
నిర్మల్, వెలుగు: వెయ్యి ఉరుల మర్రి.. నిజాం, బ్రిటిష్ సేనల అరాచకానికి గుర్తుగా చరిత్రలో నిలిచిపోయిన ఓ చేదు జ్ఞాపకం. విముక్తి కోసం, అస్థిత్వం కోసం పోరాడిన రాంజీ గోండును, ఆయన అనుచరులను కలిపి వెయ్యి మంది గెరిల్లా యోధులను సామూహికంగా ఉరివేశారు నాటి నిరంకుశ పాలకులు. మరాఠా సామ్రాజ్యం పతనమయ్యాక గోండ్వానా ప్రాంతం బ్రిటిష్, నిజాం సంయుక్త ఏలుబడిలోకి వచ్చింది. వీళ్ల ఆధిపత్యం కారణంగా బలహీన పడ్డ గోండులు తమ అస్థిత్వం కోసం 1836–-66 మధ్య రాంజీ గోండు నేతృత్వంలో గెరిల్లా తరహా పోరాటం కొనసాగించారు. నిర్మల్ కేంద్రంగా గోదావరి వెంట ఉన్న దట్టమైన అడవులు, గుంటలను కేంద్రంగా చేసుకున్న రాంజీ గోండు నేతృత్వంలోని దళం అడవుల్లో రహస్యంగా సైనిక శిక్షణ పొందుతూ అదును చూసి నిజాం సైన్యంపై గెరిల్లా దాడులకు దిగేది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత తాంతియాతోపే సేనల్లోని రోహిల్లాలు కూడా రాంజీ గోండుతో జత కట్టారు. ఇలా యుద్ధ నిపుణుల రాకతో బలోపేతమైన రాంజీ గోండు సేనలు నిర్మల్‌తోపాటు మహారాష్ట్రలో గల పర్భణీ, అజంతా, బస్మత్, లాతూర్, మక్తల్ కేంద్రాలుగా నిజాం వ్యతిరేక పోరాటం కొనసాగించారు. ‘దున్నేవాడిదే భూమి’ అని నినదించారు. బలవంతపు పన్ను వసూళ్లను ఆపివేయించారు.
ఇంకెవ్వరూ తిరుగుబాటు చేయొద్దని..
దాడులతో బ్రిటిష్, నిజాం సైనికులను, పోలీసులను చంపడంతో రాంజీ గోండును టార్గెట్ చేశారు. సోన్ఏరియాలో రాంజీ గోండు నిర్వహిస్తున్న సైనిక శిక్షణ కేంద్రంపై నిఘా పెట్టారు. కోవర్ట్ ఆపరేషన్ద్వారా రాంజీ, ఆయన అనుచరుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే 1860 ఏప్రిల్ 8న రాంజీ గోండుతో పాటు ఆయన అనుచరులు వెయ్యి మందితో ఉన్న స్థావరాన్ని పసిగట్టిన నిజాం, బ్రిటిష్సైన్యం మెరుపుదాడులు చేసింది. రాంజీ గోండుతో పాటు వెయ్యి మంది యోధులను నిర్బంధించి నిర్మల్దగ్గర్లోని ఎల్లపల్లి గ్రామం వద్ద గల భారీ మర్రి చెట్టుకు బహిరంగంగా ఉరి తీసింది. భవిష్యత్తులో ఎవరూ తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయకుండా ఈ ఘోర కలికి పాల్పడింది. ఈ దారుణానికి సజీవ సాక్ష్యంలా నిలిచిన వెయ్యి ఉరుల మర్రి చెట్టు 1995లో బలమైన ఈదురు గాలులకు నేలకూలింది. 2007లో ప్రజా సంఘాల జేఏసీ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో వెయ్యి ఉరుల మర్రి ప్రాంతం వద్ద అమరవీరుల స్మారక స్థూపం నిర్మించింది. 2008లో ఇక్కడి చైన్గేట్ వద్ద రాంజీ గోండుతో పాటు కుమ్రం భీం విగ్రహాలను ఏర్పాటు చేశారు. నాటి నుంచి గిరిజనులు ఘన నివాళులు అర్పిస్తున్నారు.