దమ్మక్క మండపంలో రామయ్యకు రాపత్ సేవ

దమ్మక్క మండపంలో రామయ్యకు రాపత్ సేవ

భద్రాచలం, వెలుగు :  ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా వైకుంఠ రామునికి శుక్రవారం ఆంధ్రాలోని ఏటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని  దమ్మక్క మండపంలో రాపత్​ సేవ జరిగింది. భద్రాచలంలో గర్భగుడిలో సీతారామచంద్రస్వామికి ఉదయం సుప్రభాత సేవ అనంతరం మూలవరులను బంగారు కవచాలతో అలంకరణ చేశారు. స్వర్ణ కవచధారి రామయ్యకు విశేష హారతులు సమర్పించారు.

 తర్వాత లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, లక్ష్మి అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన, విష్ణు సహస్రనామ పారాయణం జరిగాయి. బేడా మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం జరిగింది. సాయంత్రం దర్బారు సేవ అనంతరం వైకుంఠ రాముణ్ణి ఊరేగింపుగా పురుషోత్తపట్నం గ్రామస్తులు తీసుకెళ్లారు. గ్రామంలో ప్రతీ ఇంటిముందు రంగవల్లులు అలంకరించి స్వామికి స్వాగతం పలికారు. పూజలందుకున్న అనంతరం స్వామి తిరిగి ఆలయానికి వచ్చారు. తిరువీధి సేవ జరిగింది. 

నేడు నదీహారతి..

పౌర్ణమి సందర్భంగా  శనివారం గోదావరి తీరంలో నదీ హారతిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ తెలిపారు. దేశంలో నదులు ప్రజల జీవనానికి ఆధారంగా నిలిచి, నాగరికత అభివృద్ధికి మూలాధారంగా పనిచేశాయన్నారు. ఏరు ది ఫెస్టివల్​లో భాగంగా ఇకపై ప్రతీ వారం భద్రాచలంలో గోదావరికి నదీ హారతిని ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. గోదావరి నదీ ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు.