
సూర్యాపేట, వెలుగు : ‘పుష్ప 2’ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన రప్పా.. రప్పా డైలాగ్ సెగలు ఏపీ రాజకీయాల్లో నుంచి తెలంగాణలోకి పాకింది. అల్లు అర్జున్ సినిమా డైలాగ్ తో ఏపీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా ఆ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ రప్పా.. రప్పా” డైలాగ్ ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు హాజరైన సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన రైతు మహాధర్నాలో ‘2028లో రప్పా.. రప్పా 3.0 లోడింగ్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆదివారం సూర్యాపేటలో సైతం ‘2028లో రప్పా.. రప్పా 3.0 లోడింగ్’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి సారథ్యంలో మేము రెడీ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.ఈ ఫ్లెక్సీలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.