ఆరు నెలల్లోనే వెయ్యి దాకా పెరిగిన సన్న బియ్యం రేటు

ఆరు నెలల్లోనే వెయ్యి దాకా పెరిగిన సన్న బియ్యం రేటు
  • సర్కార్ ప్రోత్సాహం లేక తగ్గిన సాగు 
  • రైతుల దగ్గర అగ్గువకే కొని ఎగుమతి చేస్తున్న మిల్లర్లు 
  • కొరత ఏర్పడడంతో ధర పెంచేసిన వ్యాపారులు

నల్గొండ/నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రంలో సన్న బియ్యం రేట్లు భారీగా పెరిగాయి. మార్కెట్​లో సోనామసూరి, హెచ్ఎంటీ, జైశ్రీరాం లాంటి పాత బియ్యం క్వింటాల్ కు రూ.5,600 నుంచి రూ.6,200 పలుకుతున్నాయి. రేట్లు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. సర్కార్ ప్రోత్సాహం లేకపోవడంతో రాష్ట్రంలో ఏటా సన్న రకాల సాగు తగ్గుతోంది. ఈ వడ్లను ఐకేపీ సెంటర్లలో కొనకపోవడంతో మిల్లర్లే గంపగుత్తగా సేకరించి పెట్టుకున్నారు. ఇప్పుడు డిమాండ్​ను బట్టి పక్క రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యానికి కొరత ఏర్పడింది. ఇదే అదనుగా వ్యాపారులు రేట్లు భారీగా పెంచేశారు. గడిచిన ఆరు నెలల్లోనే క్వింటాల్​కు వెయ్యికి పైగా పెంచడంతో జనం లబోదిబోమంటున్నారు.

సర్కారు చెప్పిందని 2021 వానాకాలం సీజన్​లో సన్నాలు సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. ఆ సీజన్​లో 52 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేయగా.. 24 లక్షల ఎకరాల్లో బీపీటీ, తెలంగాణ మసూరి లాంటి సన్న రకాలు పండించారు. సుమారు 50 లక్షల క్వింటాళ్ల దాకా సన్న వడ్ల దిగుబడి వచ్చింది. దొడ్డు వడ్లతో పోలిస్తే సన్నాలకు ప్రతి ఎకరాపై  రూ.10వేల వరకు అదనంగా ఖర్చు కావడం, దొడ్డు రకాల కంటే  4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి తక్కువగా రావడంతో క్వింటాల్ కు రూ.2,500 చొప్పున రేటు పెట్టాలని రైతులు డిమాండ్ ​చేశారు. ఈ క్రమంలో సన్న వడ్లపై క్వింటాల్​కు రూ.100 నుంచి రూ.150 వరకు బోనస్ ఇస్తామని జనగామ జిల్లా కొడకండ్ల రైతు సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ అది అమలు చేయలేదు. పైగా కొనుగోలు సెంటర్లలో సన్న వడ్లను కొనకపోవడంతో మిల్లర్లు సిండికేట్ గా మారి రూ.1,600 నుంచి రూ.1,700 మాత్రమే రేటు పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో 2022 వానాకాలం సీజన్‌‌‌‌లో  రైతులు సన్నాల సాగు తగ్గించారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినా, ఇందులో నాలుగో వంతు అంటే సుమారు 16 లక్షల ఎకరాలకు మించి సన్నాలు సాగు కాలేదని అగ్రికల్చర్​ఆఫీసర్లు అంటున్నారు. ఈ లెక్కన 30 లక్షల టన్నులకు మించి సన్న వడ్ల దిగుబడి రాలేదని చెబుతున్నారు. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో 2021లో 54 వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేయగా, పోయినేడాది 20,234 ఎకరాలకే పరిమితమయ్యారు. ఇక ఐకేపీ సెంటర్లలో సన్న వడ్లు కొనకపోవడంతో ఎప్పట్లాగే  రైతుల నుంచి అగ్గువకు కొన్న మిల్లర్లు ఎక్కడికక్కడ నిల్వ పెట్టుకొని ఇప్పుడు రేట్లు పెంచి అమ్ముకుంటున్నారు. 

అంతా మిల్లర్ల చేతుల్లోనే.. 

గతంలో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో బాయిల్డ్​రైస్ ​వినియోగం ఎక్కువగా ఉండేది. కానీ కొంతకాలంగా ఆయాచోట్ల జనం సన్న బియ్యం తినేందుకు అలవాటు పడ్డారని, దీంతో హోల్​సేల్​ ఆర్డర్లు వస్తున్నాయని, ఫలితంగా ఎగుమతులు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనూ సన్న బియ్యం వినియోగం పెరగడం, ఆ స్థాయిలో స్టాక్​ లేకపోవడంతో ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నారు. గతంలో బియ్యం రేట్లపై సర్కార్ కు నియంత్రణ ఉండేది. అందుకు అనుగుణంగానే ఫుడ్ ​గ్రెయిన్​ లైసెన్సులు జారీ చేసేవారు. కానీ ఇప్పుడంతా ఓపెన్​మార్కెట్ ​కావడంతో తెలంగాణ, ఆంధ్రా రైస్​మిల్లర్లు సిండికేట్​గా మారి.. సన్న వడ్ల కొనుగోళ్లను పూర్తిగా తమ కంట్రోల్​లోకి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో కొనుగోలు చేసిన వడ్లను బియ్యంగా మార్చి పొరుగు రాష్ట్రాలకు, ఏపీలోని పోర్టుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో సన్న బియ్యానికి కొరత ఏర్పడింది.  

నెల రోజుల్లో 500 పెంచిన్రు​

నేను మిర్యాలగూడ టౌన్ లో జిరాక్స్ సెంటర్ నడిపించుకుంట. ఇప్పటికే నిత్యావసరాల రేట్లు పెరిగి ఇబ్బందులు పడ్తుంటే, ఇప్పుడు బియ్యం ధరలు పెరగడంతో మరింత కష్టమైతాంది.  నెల రోజుల్లోనే క్వింటాల్​కు రూ.500 దాకా పెంచారు. రేట్లు కంట్రోల్​ చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాలె. 

- నూనె రాంబాబు యాదవ్, ధర్మాపురం, నల్గొండ జిల్లా