రేట్లు పెరిగినయ్.. హైదరాబాద్​లో ఇల్లు కొనలేం!

రేట్లు పెరిగినయ్..   హైదరాబాద్​లో ఇల్లు కొనలేం!
  • హైదరాబాద్​లో ఇల్లు .. కొనలేం!..  అందనంత ఎత్తులో రేట్లు
  • దేశంలో ముంబై తర్వాత ఇక్కడే అత్యంత ఖరీదు
  • చదరపు మీటర్ జాగ ధర రూ.58,234
  • రూ.కోటికిపైగా రేటు ఉన్న ఇండ్లకు గిరాకీ
  • రూ.50 లక్షల కన్నా తక్కువున్న ఇండ్ల కొనుగోళ్లు తగ్గినయ్
  • సిటీ వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే 60 శాతం అమ్మకాలు
  • ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’ రిపోర్టులో వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్న సామాన్యులకు సొంతింటి కల నెరవేరేలా లేదు. ఇండ్ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. మన దగ్గర ఢిల్లీ, బెంగళూరును మించి రేట్లు పెరిగినయ్​. దేశంలో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్న సిటీల్లో ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ‘నైట్ ఫ్రాంక్ ఇండియా’ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ‘అఫర్డబిలిటీ ఇండెక్స్ 2023’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇల్లు కొనుక్కోవాలంటే సగటున ప్రతి నెల 31 శాతం జీతాన్ని ఈఎంఐలకే చెల్లించాల్సి వస్తున్నదని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ స్పష్టం చేసింది. కొన్నేండ్ల నుంచి సిటీలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నట్టు వివరించింది. ఆ ఎఫెక్ట్​ ఇండ్లపైనా పడిందని, ఈ ఏడాది పది శాతానికిపైగా ధరలు పెరిగాయని పేర్కొంది. ప్రస్తుతం సిటీలో ఒక చదరపు మీటరు సగటు ధర రూ.58,234గా ఉందని, ఒక చదరపు అడుగుకు రూ.5,410గా ఉందని తేల్చింది. గతేడాది చదరపు మీటరు ధర రూ.53,651 కాగా.. చదరపు అడుగు ధర రూ.4,984గా ఉంది. అంటే ఈ ఆరు నెలల్లోనే రేటు 10 శాతంపైగా పెరిగింది.  ఏడాది వ్యవధిలో మణికొండ (39%), సైనిక్​పురి (38%), బండ్లగూడ (33%), కోకాపేట (28%), ఎల్బీనగర్​ (22%) పరిధిలోనే ఎక్కువగా పెరిగాయి. రాజేంద్రనగర్ పరిధిలో మాత్రం 12 శాతం తగ్గాయి.

నిలకడగానే ఇండ్ల కొనుగోళ్లు

ధరలు పెరుగుతున్నా ఇండ్ల కొనుగోళ్లు స్టడీగా సాగుతున్నట్టు నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ తెలిపింది. రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న ఇండ్ల కోసం జనాలు చూస్తున్నట్టు పేర్కొంది. రూ.50 లక్షల కన్నా తక్కువున్న ఇండ్లను పెద్దగా పట్టించుకోవడం లేదని వెల్లడించింది. 2018లో రూ.50 లక్షలలోపు ఉన్న ఇండ్లను కొనేటోళ్లు 29 శాతం ఉంటే.. అదిప్పుడు 13 శాతానికి పడిపోయింది. అదే సమయంలో 2022లో కూడా 21 శాతం మంది ఈ కేటగిరీలో ఇండ్లు కొనుక్కున్నారు. ఇక 2018లో రూ.50 లక్షల నుంచి రూ. కోటి మధ్య ఉన్న ఇండ్లను కొంటున్నోళ్లు 42 శాతం మంది ఉన్నారు. రూ.కోటికిపైగా ధర ఉన్న ఇండ్లు కొనేటోళ్ల సంఖ్య భారీగా పెరిగింది. 2018లో 18 శాతం మందే కోటికిపైగా విలువ ఉన్న ఇండ్లను కొంటే.. ఇప్పుడా సంఖ్య 45 శాతానికి పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశమున్నట్టు రిపోర్ట్​వెల్లడించింది.

వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఎక్కువ

హైదరాబాద్ సిటీలోని మిగతా ఏరియాలతో పోలిస్తే పడమర దిక్కునే ఎక్కువ మంది ఇండ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్టు రిపోర్టులో తేలింది. మొత్తం అమ్మకాల్లో 60 శాతం సిటీ వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే జరుగుతున్నట్టు వెల్లడైంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్​రాంగూడ, కొండాపూర్, కోకాపేట్ వంటి ప్రాంతాలన్నీ సిటీ వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉండడం.. ఐటీ ఆఫీసులు, ఇతర ఆఫీసులకు కొద్ది దూరంలోనే ఉండడంతోనే అటువైపు జనాలు చూస్తున్నట్టు రిపోర్ట్​లో పేర్కొన్నారు. మరోవైపు ఈ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇండ్ల కన్నా అపార్ట్​మెంట్లలోనే ఎక్కువగా ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నట్టు రిపోర్ట్ తేల్చింది. ఎక్కువ మంది ఎన్నారైలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఇండ్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సర్వే వెల్లడించింది. 

అహ్మదాబాద్‌‌లో అగ్గువ

అత్యంత నివాసయోగ్యమైన సిటీ అహ్మదాబాద్ అని నైట్ ఫ్రాంక్ తన రిపోర్టులో తెలిపింది. మొత్తం 8 సిటీలపై సంస్థ రీసెర్చ్ చేయగా.. అహ్మదాబాద్ మాత్రమే సామాన్యుడు ఇండ్లు కొనుక్కునేందుకు అనువుగా ఉన్నట్టు వెల్లడైంది. ఆ తర్వాతి స్థానాల్లో కోల్​కతా, పుణె, చెన్నై ఉన్నాయి. మనతో పోలిస్తే బెంగళూరులో కూడా సామాన్యుడు ఇంటి మీద ఇన్వెస్ట్ చేసేందుకు అనువుగా ఉండడం గమనార్హం.