ఎగ్జిబిషన్‌లో ఎలుకలు పడ్డయ్.. ఫుడ్డు పెట్టి వేడుకుంటున్న వ్యాపారులు

ఎగ్జిబిషన్‌లో ఎలుకలు పడ్డయ్.. ఫుడ్డు పెట్టి వేడుకుంటున్న వ్యాపారులు
  • నుమాయిష్‌లో స్టాక్ కొరికేస్తున్న ర్యాట్స్ .. రూ.వేలల్లో నష్టం
  • కంప్లయింట్ చేసినా పట్టించుకోని సొసైటీ పెద్దలు
  • నచ్చిన ఫుడ్ పెట్టి ఎలుకలనే వేడుకుంటున్న వ్యాపారులు

నుమాయిష్ స్టాల్స్ నిర్వాహకులకు ఎలుకలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేల ఖరీదు చేసే గార్మెంట్స్‌ను కొరికిపారేస్తుండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయల స్టాక్ ఉండడం, ఎగ్జిబిషన్ సొసైటీకి చెప్పినా పట్టించుకోకపోవడంతో వాటినే శరణు వేడుకుంటున్నారు. ఎలుకల మందు పెట్టినా ఆశించిన ప్రయోజనం లేకపోవడం వల్ల రోజుకో వెరైటీ చొప్పున వెజిటబుల్స్, స్వీట్లు, బిస్కెట్లు పెట్టి సరుకు వైపు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

హైదరాబాద్, వెలుగు: నుమాయిష్‌‌.. దేశవ్యాప్తంగా ఎంతో మంది చిరువ్యాపారులకు ఆసరాగా నిలుస్తున్న ప్రదర్శన. వివిధ రాష్ట్రాల వ్యాపారులు విలువైన వస్తువులు, బట్టలను ఇక్కడ అమ్మేందుకు ఏటా వస్తుంటారు. మెయిన్‌గా నుమాయిష్ లో ఎక్కువగా కనిపించేవి బట్టల స్టాల్సే. ఇప్పుడు బట్టల స్టాల్స్‌కి ముప్పు వచ్చి పడింది. ఎలుకలు ఎక్కడికక్కడ బట్టలను కొరికేస్తూ వ్యాపారులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఈ సమస్య నుం చి తప్పించుకేందుకు ఎలుకల మందు పెడితే.. కొత్త ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. దీంతో వ్యాపారులు ఎలుకలకు నచ్చే ఆహారపదార్థాలు పెట్టి సమస్యను కాస్త సద్దుమణిగేలా చేసుకుంటున్నారు.

స్టాల్స్‌లో మకాం

విశాలమైన స్థలం కావడంతో పందికొక్కులు, ఎలుకలు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి. ఎగ్జిబిషన్ ఏరియాలో ఎలుకల కన్నాల్లో దూరి.. 1500 స్టాల్స్‌లో మకాం పెట్టేశాయి. కాస్మెటిక్, ఫుడ్ స్టాల్స్ పరిస్థితి ఎలా ఉన్నా..బట్టల దుకాణాల వ్యాపారులు మాత్రం దినదిన గండంగా గడుపుతున్నారు. ఒక్క చీరను కొరికినా నష్టం వేలల్లోనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాపాడుకునేందుకు ప్రయోగాలు

మన మాట ఎలుక వినడం కాదు.. ఎలుకల మాటే మనం వినాలని వ్యాపారులు నిర్ణయించుకున్నారు. అందుకే బట్టల దుకాణాల్లో నాలుగు మూలలకు నాలుగు ఆహారపదార్థాలు పెడుతున్నారు. ఒకరోజు టమాటాలు, ఒక రోజు స్వీట్స్, కూరగాయల ముక్కలు ఉంచుతున్నారు. స్టాల్స్‌లో దూరే ఎలుకలు వాటిని తిని తమ బట్టల జోలికిరావని తమకి తాము నచ్చజెప్పుకుంటున్నారు. దాదాపుగా నుమాయిష్‌‌ లో చాలా బట్టల దుకాణాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోం ది. అయితే సమస్యను సొసైటీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు స్టాల్స్ నిర్వాహకులు.

చికాకు పెట్టిస్తున్న సొసైటీ తీరు

ఎలుకలు సమస్యను పట్టించుకోకుండా ఇతర విషయాలను సొసైటీ బాగా పట్టించుకుంటోందని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది ఫైర్ యక్సిడెంట్‌తో ఎంతో నష్టపోయామని, ఆ సమయంలోనూ సొసైటీ తమకు సాయం చేయలేదని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం రెంట్, జీఎస్టీ పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆందోళన చెందుతున్నారు. స్టాల్ ఇన్సూరెన్స్ కోసం రూ.2వేలు, ఐడీ కార్డ్ కోసం రూ.200 అడుగుతున్నారని, కరెంట్ కి ఎక్స్‌ట్రా చార్జ్ వసూలు చేస్తున్నట్టు తెలిపారు. వంటకోసం అవకాశం ఉండేదని, బయట నుంచి ఫుడ్ తెచ్చుకుని తినాల్సి వస్తుందని, దీంతో ఖర్చు పెరగడమే కాకుండా హెల్త్​ కూడా పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఖరీదైన చీరలన్నింటినీ కొట్టేస్తున్నయ్

హ్యాండ్లూమ్ చీరలు తీసుకొచ్చాం. గతేడాది జరిగిన ఫైర్ యాక్సిడెంట్, ఈసారి ఎలుకలు మా బతకులను ఆగమాగం చేస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు కొరుకుతున్నాయి. రోజూ 10 చీరలు పాడవుతున్నాయి. ఒక్కోదాని కాస్ట్​ రూ.10వేలకు పైనే.

– రేఖ, వెస్ట్​ బెంగాల్

పండ్ల ముక్కలు పెడుతున్నం

మా పక్క స్టాల్‌లో ఎలుకల బెడద గురించి విన్నాక భయం పట్టుకుంది. అందుకే ఎలుకలు బట్టల జోలికి రాకుండా ఆహారం పెడుతున్నాం . కార్పెట్ కింద చెక్క పెట్టి నాలుగు మూలలకు కవర్లలో పండ్లు, కూరగాయల ముక్కలు పెడుతున్నాం.

– మహ్మద్ సుల్తాన్, వెస్ట్​ బెంగాల్