ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలి :రవినాయక్​

ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలి :రవినాయక్​
  •     ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి రవినాయక్

​వనపర్తి, వెలుగు :   పాలమూరు -రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిపోయిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి జి. రవి నాయక్ ఆదేశించారు.  మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన ఇరిగేషన్, రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధికారులతో ఇరిగేషన్ భూసేకరణ అంశంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..  వర్షాకాలం మొదలైతే  రైతులు పంటలు వేసుకుంటారని, అప్పుడు సర్వే చేయడం ఇబ్బందిగా ఉంటుందన్నారు.

వారం పదిహేను రోజుల్లో మిగిలిపోయిన భూసేకరణకు సర్వే పూర్తి చేయాలని సూచించారు. సర్వే ల్యాండ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని  చేయాలని ఆదేశించారు.  గోపాలపేట, బుద్ధారం, ఖిల్లాగణపూర్, రేవల్లి తదితర మండలాల్లో చేయాల్సిన భూసేకరణ పై కూలంకషంగా చర్చించారు. రైతులను ఒప్పించి సర్వే పూర్తిచేయాలని సూచించారు.  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. జిల్లాలో ఇరిగేషన్ కు సంబంధించి భూసేకరణ సకాలంలో పూర్తి చేసి ఆయకట్టు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.  సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్ ఎస్ఈ  సత్యనారాయణ, డీఈ శ్రీనివాస్ రెడ్డి, తహశీల్దార్లు, సర్వే ల్యాండ్ అధికారులు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.