రావత్ టీం హెలికాప్టర్ క్షణాల్లో మాయం

రావత్ టీం హెలికాప్టర్ క్షణాల్లో మాయం
  • చూస్తుండగానే పొగమంచులోకి చాపర్
  • కూలడానికి ముందు స్థానికులు తీసిన వీడియో వైరల్
  • ఎయిర్‌‌ మార్షల్ మానవేంద్రసింగ్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ: రాజ్‌‌నాథ్ 
  • బ్లాక్ బాక్స్ రికవర్ చేసినం
  • లైఫ్‌‌ సపోర్ట్‌‌పై కెప్టెన్ వరుణ్ సింగ్
  • పార్లమెంటులో ప్రకటన చేసిన రక్షణ మంత్రి    
  • కాసేపు మౌనం పాటించిన ఉభయ సభలు

కూనూర్/న్యూఢిల్లీ: ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కూలిపోవడానికి ముందు తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు స్థానికులు తీసిన ఈ వీడియో గురువారం బయటికి వచ్చింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచులోకి చాపర్ వెళ్లడం, కొందరు వ్యక్తులు రైలు పట్టాలపై నిలుచుని చాపర్‌‌‌‌ను చూడటం అందులో కనిపించింది. పొగమంచులోకి చాపర్ వెళ్లిన వెంటనే పెద్ద శబ్దం కూడా వచ్చింది. అయితే ఈ వీడియో బుధవారం ప్రమాదానికి గురైన చాపర్ దేనా? లేక పాత వీడియోనా? అనే దానిపై ఎయిర్‌‌‌‌ఫోర్స్ ఎలాంటి కామెంట్ చేయలేదు. 
దర్యాప్తు షురూ
తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాప్టర్‌‌‌‌ కూలిపోయి సీడీఎస్ బిపిన్ రావత్ సహా 13 మంది చనిపోయిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎయిర్‌‌‌‌ఫోర్స్ ఆదేశాలిచ్చిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ తెలిపారు. ‘‘ఎయిర్‌‌‌‌ మార్షల్ మానవేంద్రసింగ్ ఆధ్వర్యంలో ట్రై సర్వీసెస్ ఎంక్వైరీ జరుగుతోంది. ఇన్వెస్టిగేటర్లు బుధవారమే వెల్లింగ్టన్‌‌ చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు” అని వివరించారు. రావత్ అంత్యక్రియలను పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహిస్తామన్నారు. తీవ్ర గాయాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. ప్రస్తుతం లైఫ్‌‌ సపోర్ట్‌‌పై ట్రీట్‌‌మెంట్ పొందుతున్నారని వెల్లడించారు. ప్రమాదం జరిగిన చోటు నుంచి బ్లాక్ బాక్స్‌‌ను ఇప్పటికే రికవర్ చేసినట్లు తెలిపారు. హెలికాప్టర్‌‌‌‌ క్రాష్‌‌పై గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్‌‌నాథ్ ప్రకటన చేశారు. ఆర్మీ ఆఫీసర్ల మృతికి సంతాపంగా లోక్‌‌సభ, రాజ్యసభలు కొద్దిసేపు మౌనం పాటించాయి. 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్​పై చేయాలనుకున్న ధర్నాను ప్రతిపక్షాలు విరమించుకున్నాయి. నివాళులర్పించేందుకు అనుమతించకపోవడాన్ని ఖండించాయి.
12.08కి కాంటాక్ట్ కట్..
‘‘ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌కు చెందిన ఎంఐ17వీ5 హెలికాప్టర్.. సూలూర్ ఎయిర్‌‌‌‌ బేస్ నుంచి 11.48కి టేక్ ఆఫ్ అయింది. 12.15కి వెల్లింగ్టన్‌‌కు చేరుకోవాల్సింది. కానీ 12.08 సమయంలో సూలూర్‌‌‌‌లోని ఎయిర్‌‌‌‌ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. కూనూర్ దగ్గర అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడాన్ని స్థానికులు చూశారు. హెలికాప్టర్ మంటల్లో చిక్కుకోవడాన్ని గమనించారు” అని పార్లమెంటులో రాజ్‌‌నాథ్ వివరించారు. రెస్క్యూ టీమ్స్ వెంటనే స్పాట్​కు చేరుకున్నారని, గాయపడినోళ్లను  వాళ్లను కాపాడేందుకు ప్రయత్నించారని చెప్పారు. శిథిలాల నుంచి బయటికి తీసిన వారందరినీ మిలటరీ ఆస్పత్రికి తరించామన్నారు.
డెడ్‌‌బాడీల గుర్తింపులో ఇబ్బందులు
ప్రమాదంలో చనిపోయిన 13 మంది డెడ్‌‌బాడీలను వెల్లింగ్టన్‌‌లోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆర్మీ సీనియర్ ఆఫీసర్లు, తమిళనాడు మంత్రులు, ఆర్మీ వెటరన్లు నివాళులర్పించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోయంబత్తూరుకు తరలించి, తర్వాత ప్రత్యేక ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌లో ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే డెడ్‌‌బాడీలను గుర్తించడం కష్టంగా మారిందని ఎయిర్‌‌‌‌ఫోర్స్ తెలిపింది. ‘‘డెడ్‌‌బాడీలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక సహా నలుగురు డెడ్‌‌బాడీలను గుర్తించాం. ఆర్మీ ఆఫీసర్ల కుటుంబ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. తమ వారి వస్తువులను గుర్తించాలని వారికి చెప్పాం. సైంటిఫిక్ చర్యలతో పాటు... పాజిటివ్ ఐడెంటిఫికేషన్ కోసం కుటుంబ సభ్యుల సాయం తీసుకుంటున్నాం. గుర్తింపు తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాం’’ అని ఎయిర్‌‌‌‌ఫోర్స్  అధికారులు చెప్పారు.
రావత్ నీళ్లు అడిగిన్రు
ప్రమాదం తర్వాత జనరల్ బిపిన్ రావత్ కొద్దిసేపు బతికే ఉన్నారని, ఆయనతో తాను మాట్లాడానని ప్రత్యక్ష సాక్షి శివ కుమార్ చెప్పారు. కాంట్రాక్టర్ అయిన శివ కుమార్.. తన తమ్ముడు పని చేస్తున్న టీ ఎస్టేట్‌‌కు వచ్చారు. అదే టైంలో కూనూర్ దగ్గర ప్రమాదం జరిగింది. చాపర్ కూలిపోవడం, మంటలు చెలరేగడం తాను చూశానని, వెంటనే అక్కడికి వెళ్లానని శివ చెప్పారు. ‘‘అప్పటికే ముగ్గురు కిందపడ్డారు. అందులో ఒకరు బతికే ఉన్నారు. తాగేందుకు నీళ్లు అడిగారు. ఆ టైంలో ఆయన్ను మంటల దగ్గర్నుంచి బెడ్‌‌షీట్‌‌లో పక్కకి తీసుకొచ్చాం. తర్వాత రెస్క్యూ సిబ్బంది తీసుకెళ్లారు. నన్ను నీళ్లు అడిగిన వ్యక్తి బిపిన్ రావత్ అని తర్వాత చెప్పారు” అని వివరించారు. దేశం కోసం రావత్ ఎంతో చేశారని, కానీ ఆయనకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయానని, రాత్రంతా నిద్ర పట్టలేదని శివ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇయ్యాల రావత్ అంత్యక్రియలు
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధూలికా రావత్ అంత్యక్రియలు శుక్రవారం ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో జరగనున్నాయి. శుక్రవారం ఉదయం కామరాజ్ మార్గ్​లోని రావత్ నివాసంలో వారిద్దరి భౌతికకాయాలను ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. 2 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. తర్వాత మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఢిల్లీ లేదా బెంగళూరుకు బ్లాక్ బాక్స్
హెలికాప్టర్ కూలిన ఘటనపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రోన్లతో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు 2బాక్సులు రికవర్ చేసినట్లు ఎయిర్‌‌‌‌ఫోర్స్ ఆఫీసర్లు చెప్పారు. అందులో ఒకటి బ్లాక్ బాక్స్ అని, హెలికాప్టర్ ఎందుకు క్రాష్ అయిందనే విషయం తెలుసుకునేందుకు ఢిల్లీ లేదా బెంగళూరుకు వాటిని తీసుకెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్పాయి.