
- రజాకార్ సినిమా దర్శకుడు సత్యనారాయణ
చిట్యాల, వెలుగు : సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందడానికి కారణం జర్నలిజమేనని రజాకార్ సినిమా దర్శకుడు, గద్దర్ పురస్కార గ్రహీత యాట సత్యనారాయణ అన్నారు. శనివారం చిట్యాలలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మండల కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
అనంతరం యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ల బయన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ మాట్లాడారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో జర్నలిస్టుగా పనిచేశానని తెలిపారు. సినీ రంగంలో రాణించాలని ఆలోచన ఆనాడే కలిగిందన్నారు. రజాకార్ సినిమా చిత్రీకరణకు ముందు ఎంతోమంది తనను బెదిరించినప్పటికీ తెలంగాణ చరిత్ర, ప్రజల జీవన విధానం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో సినిమా తీశానన్నారు.
తాను తీసిన ఈ సినిమాకు విశేష ఆదరణ లభించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు కూడా అందజేసిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్లే ఇది సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కార్యదర్శి నరేందర్, మండల అధ్యక్షుడు వెంకన్న, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, నాయకులు పాల్గొన్నారు.