- బలహీనపడుతున్న రూపాయిని నిలబెట్టేందుకు చర్యలు
- బాండ్ పెట్టుబడులపై రిస్ట్రిక్షన్లు తొలగించిన ఆర్‌బీఐ.. ట్యాక్స్ రద్దు చేసిన కేంద్రం
- డాలర్లలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విదేశీ ఇన్వెస్టర్లకు రాయితీలు
- లాంగ్, షార్ట్‌టర్మ్ గెయిన్స్‌పై ట్యాక్స్‌లు ఎత్తివేత
- ఇతర నిబంధనల్లోనూ మినహాయింపులు డాలర్లలో అప్పులు తీసుకునే బ్యాంకులకు ప్రోత్సాహకాలు
- రెపో రేటును 5.25% వద్దనే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటన
- రెండేళ్లలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచనా
- ఈక్విటీల్లో ఎన్నారైలు, ఓసీఐల పెట్టుబడి పరిమితులు పెంపు
- వడ్డీ రేట్లను మార్చని ఎంపీసీ.. తగ్గిన జీడీపీ వృద్ధి అంచనా
- 2026–27 లో 5.1 శాతానికి పెరగనున్న రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రూపాయి పతనాన్ని ఆపేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఆర్‌బీఐ , కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేశాయి. ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి వెళ్లిపోతుండడంతో రూపాయి విలువ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5 శాతానికి పైగా నష్టపోయింది. 96 లెవెల్‌ను దాటి 100 కి జారుకుంటోంది.
ఇలాంటి టైమ్‌లో విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ కొత్త చర్యలను ప్రకటించగా, కేంద్రం ప్రభుత్వం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీజీసీ), షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎస్‌టీసీజీ) రద్దు చేసింది. ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేసే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) కు ఇది వర్తిస్తుంది. ఆర్‌బీఐ చర్యలు ఇవే..
1. ఎఫ్ఏఆర్ పొడిగింపు..
విదేశీ ఇన్వెస్టర్లు ఎటువంటి రిస్ట్రిక్షన్లు, లిమిట్స్ లేకుండా లాంగ్ టర్మ్ గవర్నమెంట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆర్‌బీఐ ఫుల్లీ యాక్సెసబుల్ రూట్ (ఎఫ్‌ఏఆర్) మార్గాన్ని విస్తరించింది. ఇప్పటివరకు ఈ రూట్‌లో కేవలం 5, 7, 10 ఏళ్ల బాండ్లు మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా 15, 30, 40 ఏళ్ల కాలపరిమితి గల బాండ్లను కూడా చేర్చింది. దీంతో ఫారిన్ ఇన్వెస్టర్లు ఎఫ్‌ఏఆర్ రూట్‌లో ఈ ప్రభుత్వ బాండ్లలో ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.
2. జనరల్ రూట్‌లోనూ పరిమితులు లేనట్టే
ఎఫ్‌ఏఆర్ కాకుండా జనరల్ రూట్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై (ఎఫ్‌పీఐలు) ఉన్న 'కాన్సంట్రేషన్ లిమిట్స్' (ఒక రకం బాండ్లలో ఇంతమేర ఇన్వెస్ట్ చేయాలనే పరిమితులను) ఆర్‌బీఐ పూర్తిగా తొలగించింది.
3. ఎన్నారైలు, ఓసీఐలపై లిమిట్స్ పెంపు
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్‌ఆర్‌ఐలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐలు) ఇండియాలో లిస్ట్ అయిన కంపెనీల్లో ఇక నుంచి భారీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. షేర్లలో పెట్టే పెట్టుబడుల పరిమితులను ఆర్‌బీఐ పెంచింది.
4. ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) డిపాజిట్ల హెడ్జింగ్ సాయం
బ్యాంకులు సేకరించే 3 నుంచి 5 ఏండ్ల ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంక్) (ఎఫ్‌సీఎన్‌ఆర్(బి)) విదేశీ కరెన్సీ డిపాజిట్లపై ఇచ్చే పూర్తి హెడ్జింగ్-కాస్ట్ సపోర్ట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. సాధారణంగా ఎన్నారైలు బ్యాంకుల్లో డాలర్లు డిపాజిట్ చేసినప్పుడు, అవి డాలర్లలోనే డిపాజిట్ అయి ఉంటాయి. కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల వచ్చే నష్ట భయాన్ని తట్టుకునేందుకు బ్యాంకులు వీటిపై హెడ్జింగ్ చేపడతాయి. సాధారణంగా ఈ ఖర్చును బ్యాంకులే భరించాలి. సెప్టెంబర్ 30 వరకు ఆర్‌బీఐ ఈ ఖర్చును భరిస్తుంది.
దీంతో బ్యాంకులు విదేశాల్లో భారీగా డిపాజిట్లు సేకరించొచ్చు. మరోవైపు ప్రభుత్వ కంపెనీలు విదేశాల నుంచి తీసుకునే రుణాల కోసం కేటాయించిన కన్సెషనల్ ఫారెక్స్ స్వాప్ విండో కాలపరిమితిని ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఆర్‌బీఐ పొడిగించింది.
5. ఎగుమతి సొమ్ము గడువు 9 నెలలకు తగ్గింపు
ఎగుమతిదారులు తాము విదేశాలకు పంపిన వస్తువుల సొమ్మును తిరిగి దేశంలోకి తీసుకురావడానికి గల గడువును 15 నుంచి 9 నెలలకు తగ్గించారు. దీంతో విదేశీ కరెన్సీ వేగంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుంది.
ఎల్‌టీసీజీ, ఎస్‌టీసీజీ రద్దు
విదేశీ నిధులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బాండ్లలో ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) పెట్టే పెట్టుబడులపై లాంగ్-టర్మ్ (ఎల్‌టీసీజీ), షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టీసీజీ) పన్నులను పూర్తిగా రద్దు చేసింది. దీంతో పాటు బాండ్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై విధించే విత్‌హోల్డింగ్ పన్నును సైతం రద్దు చేసింది. ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు ప్రభుత్వ బాండ్లపై 12.5శాతం ఎల్‌టీసీజీ, 30శాతం ఎస్‌టీసీజీ పన్నుతో పాటు, వడ్డీపై 20శాతం విత్‌హోల్డింగ్ పన్ను చెల్లించేవారు. ఆదాయపు పన్ను చట్టం, 2025ను సవరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్డినెన్స్ జారీ చేశారు.
ఈ మార్పులను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం జనరల్, ఎఫ్‌ఏఆర్ (ఎఫ్‌ఏఆర్) రూట్ల కింద ప్రభుత్వ బాండ్లలో ఎఫ్‌ఐఐ పెట్టుబడులు రూ.3.75 లక్షల కోట్లు (మొత్తం పెట్టుబడుల్లో కేవలం 3.34శాతం) మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల రాబోయే రెండేళ్లలో డెట్ మార్కెట్లోకి 45-50 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4.80 లక్షల కోట్లకు పైగా) విదేశీ నిధులు వచ్చి చేరతాయని యాక్సిస్ బ్యాంక్ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
మూడోసారీ వడ్డీ రేట్లు మారలే
ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌లో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ రెపో రేటును మూడోసారి కూడా 5.25 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. తన పాలసీ వైఖరిని 'న్యూట్రల్' గానే కొనసాగించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థపై భరోసా ఉంచింది. వడ్డీ రేట్లను పెంచుతారని ఎనలిస్టులు ఊహించారు. ఆర్‌బీఐ 2026–27 కి గాను దేశీ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.9శాతం నుంచి 6.6శాతానికి తగ్గించింది. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) అంచనాను 4.6శాతం నుంచి 5.1శాతానికి పెంచింది.
రూపాయి జూమ్
ఆర్బీఐ తీసుకున్న చర్యలతో రూపాయి శుక్రవారం పరుగులు పెట్టింది. డాలర్‌తో 56 పైసలు బలపడి 95.18 వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడుల ఇన్‌ఫ్లో పెరుగుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు 682.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
