బ్యాంకుల్లో పనులు... ఇంకా ఈజీగా జరగాలె

బ్యాంకుల్లో పనులు... ఇంకా ఈజీగా జరగాలె
  • బ్యాంకుల్లో పనులు... ఇంకా ఈజీగా జరగాలె
  • సిబ్బంది కస్టమర్లతో  మర్యాదగా ఉండాలె
  • బ్యాంకు ఉద్యోగులకు శిక్షణ ఇప్పించాలి
  • కస్టమర్​ సర్వీసును మరింత బలోపేతం చేయాలి 
  • యాజమాన్యాలకు  సూచించిన ఆర్​బీఐ

ముంబై: కస్టమర్ల  సౌకర్యం కోసం బ్యాంకులు/ఆర్థిక సంస్థలు మరిన్ని కొత్త విధానాలను తీసుకురావాలని ఆర్​బీఐ నియమించిన ప్యానెల్​ సూచించింది. ఖాతాదారులు మరణిస్తే వాళ్ల వారసులు ఆన్​లైన్​లోనే డబ్బు పొందేలా చేయాలని, పెన్షనర్లు మరింత సులువుగా లైఫ్​సర్టిఫికెట్లు అందజేసేలా చూడాలని సిఫార్సు చేసింది. సెంట్రలైజ్డ్​ కేవైసీ డేటాబేస్​ను తయారు చేసుకోవాలని కోరింది. బ్యాంకుల్లో సదుపాయాలను మెరుగుపర్చడానికి సంబంధిత కస్టమర్​ సర్వీస్​ స్టాండర్డ్స్​లో తీసుకురావాల్సిన మార్పులను సూచించడానికి ఆర్​బీఐ ఈ కమిటీని నియమించింది. గత ఏడాది మే నెలలో కమిటీ ఏర్పాటు కాగా, దీనికి సంస్థ మాజీ డిప్యూటీ గవర్నర్​ బీపీ కానుంగో నాయకత్వం వహించారు. ఖాతాదారుల  కేవైసీ పెండింగ్​లో ఉన్నందున సేవలను నిలిపివేయకూడదని ఇది స్పష్టం చేసింది. 

‘‘లోన్ల ఇబ్బందులను కూడా త్వరగా పరిష్కరించాలి. కస్టమర్ ​బాకీ పూర్తిగా చెల్లించాక ఆస్తి డాక్యుమెంట్లను వాపసు ఇవ్వడానికి ప్రస్తుతం చాలా సమయం పడుతోంది. ఇక నుంచి వీటిని తొందరగా ఇవ్వాలి. లేకపోతే సంబంధిత బ్యాంకుకు జరిమానా వేయాలి. బ్యారోవర్ ​ఆస్తి డాక్యుమెంట్లను బ్యాంకు పోగొడితే.. వాటిని బాధితుడు తిరిగి పొందడానికి సాయం చేయాలి. ఇందుకు అయ్యే ఖర్చులన్నింటినీ భరించడమేగాక కొంత మొత్తం పరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఇలాంటి డాక్యుమెంట్ల కాపీలను సంపాదించాలంటే చాలా సమయం పడుతుంది”అని పేర్కొంది. ఆర్​బీఐ రెగ్యులేటెడ్​ ఎంటిటీల కోసం ఏర్పాటైన ఇంటర్నల్​ గ్రీవెన్స్​ రిడ్రెస్​ (ఐజీఆర్​) విధానం కింద గత మూడేళ్లలో వచ్చిన ఫిర్యాదులను ఈ కమిటీ పరిశీలించింది. 

ఏడాదికి కోటి దాకా ఫిర్యాదులు అందుతున్నట్టు గుర్తించింది. లోన్ల విషయంలోనూ మరీ కఠినంగా ఉండొద్దని సూచించింది. జీతం ఖాతాలు ఉన్న వారి విషయంలో ఉదారంగా ఉండాలని, వారి ఆదాయం ఖర్చుల గురించి బ్యాంకులకు అవగాహన ఉంటుంది కాబట్టి ‘హైరిస్క్​’ కేటగిరీలో చేర్చకూడదని సూచించింది. స్టూడెంట్స్​ను కూడా ‘లో రిస్క్​’ కేటగిరీలో చేర్చవచ్చని పేర్కొంది. 

కామన్​ కంప్లెయింట్​ పోర్టల్​

ఈ కమిటీ రిపోర్టు ప్రకారం.. ఫిర్యాదులను వేగంగా, సమర్థంగా పరిష్కరించేందుకు ఆర్​బీఐ కామన్ ​కంప్లెయింట్​ పోర్టల్​ఏర్పాటు చేయాలి. ఇది అందుబాటులోకి వచ్చేలోపు బాధితుడు తన ఫిర్యాదు స్థితిని తెలుసుకునే విధానాన్ని తేవాలి. కస్టమర్లతో నేరుగా మాట్లాడే సిబ్బంది/అధికారులు కస్టమర్లతో దురుసుగా వ్యవహరించకుండా తగిన శిక్షణ ఇవ్వాలి. పెన్షనర్లు తనకు ఖాతా ఉన్న బ్యాంకుకు చెందిన ఏ బ్రాంచీలో లైఫ్​సర్టిఫికెట్​ ఇచ్చినా తీసుకోవాలి.  బ్యాంకులు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, స్మాల్​ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పేమెంట్స్​ బ్యాంకులు సహా అన్ని రెగ్యులేటెడ్​  ఎంటిటీలలో (ఆర్​ఈలు) కస్టమర్​ సర్వీసును బలోపేతం చేయడానికి కమిటీ పలు సలహాలను సూచనలను సూచనలను ఇచ్చింది.