చెలరేగిన హారిస్‌‌, స్మృతి.. డబ్ల్యూపీఎల్‌‎లో‌ ఫైనల్‎కు దూసుకెళ్లిన ఆర్సీబీ

చెలరేగిన హారిస్‌‌, స్మృతి.. డబ్ల్యూపీఎల్‌‎లో‌ ఫైనల్‎కు దూసుకెళ్లిన ఆర్సీబీ

వడోదరా: ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు (ఆర్సీబీ) డబ్ల్యూపీఎల్‌‌  ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఛేజింగ్‌‌లో గ్రేస్‌‌ హారిస్‌‌ (37 బాల్స్‌‌లో 13 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 75), స్మృతి మంధాన (27 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 54 నాటౌట్‌‌) దంచికొట్టడంతో గురువారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడిన యూపీ 20 ఓవర్లలో 143/8 స్కోరు చేసింది. దీప్తి శర్మ (55), మెగ్‌‌ లానింగ్‌‌ (41) రాణించారు. తర్వాత బెంగళూరు 13.1 ఓవర్లలోనే 147/2 స్కోరు చేసి నెగ్గింది. ఈ ఓటమితో యూపీ ప్లే ఆఫ్ రేస్‌‌ నుంచి నిష్క్రమించింది. హారిస్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

బౌలర్లు అదుర్స్‌‌..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన యూపీని కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు సక్సెస్‌‌ అయ్యారు. డి క్లెర్క్‌‌ (4/22), గ్రేస్‌‌ హారిస్‌‌ (2/22) వరుస విరామాల్లో కీలక వికెట్లు తీసి స్కోరుకు కళ్లెం వేశారు. దాంతో ఓపెనర్లు మినహా మిగతా లైనప్‌‌ మొత్తం ఫెయిలైంది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన లానింగ్‌‌, దీప్తి.. బెంగళూరు బౌలింగ్‌‌పై విరుచుకుపడ్డారు. రెండో ఓవర్‌‌లో ఫోర్‌‌తో లానింగ్‌‌ టచ్‌‌లోకి రాగా, నాలుగో ఓవర్‌‌లో దీప్తి బౌండ్రీతో జోరు పెంచింది. 

తర్వాత లానింగ్‌‌ వరుస సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించింది. ఫలితంగా పవర్‌‌ప్లేలో యూపీ 50/0 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌ పెరిగిన తర్వాత కూడా లానింగ్‌‌ వెనక్కి తగ్గలేదు. ఏడో ఓవర్‌‌లో నాలుగు ఫోర్లతో రెచ్చిపోయింది. రెండో ఎండ్‌‌లో దీప్తి వేగంగా సింగిల్స్‌‌ తీసి స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసింది. అయితే 9వ ఓవర్‌‌లో డిక్లెర్క్‌‌ డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చింది.

ఐదు బాల్స్‌‌ తేడాలో లానింగ్‌‌, అమీ జోన్స్‌‌ (1)ను పెవిలియన్‌‌కు పంపింది. తొలి వికెట్‌‌కు 74 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగియడంతో పాటు యూపీ 78/2తో నిలిచింది. హర్లీన్‌‌ డియోల్‌‌ (14)తో కలిసి దీప్తి ఇన్నింగ్స్‌‌ను నిలబెట్టే ప్రయత్నం చేసింది. యూపీ 82/2తో ఫస్ట్‌‌ టెన్‌‌ ఓవర్స్‌‌ను ముగించింది. చకచకా రెండు ఫోర్లతో జోరు పెంచిన హర్లీన్‌‌ను 12వ ఓవర్‌‌లో హారిస్‌‌ ఔట్‌‌ చేయడంతో మూడో వికెట్‌‌కు 17 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది.

ఇక్కడి నుంచి ఆర్సీబీ బౌలర్లు విజృంభించారు. చోలే ట్రయాన్‌‌ (6), శ్వేత (7), సిమ్రాన్‌‌ షేక్‌‌ (10), దీప్తి, సోఫీ ఎకిల్‌‌స్టోన్‌‌ను (0) తక్కువ స్కోరుకే ఔట్​ చేశారు. ఆశా శోభన (0 నాటౌట్‌‌), శిఖా పాండే (0 నాటౌట్‌‌) బ్యాట్లు ఝుళిపించలేదు. ఓవరాల్‌‌గా ఇన్నింగ్స్‌‌లో ఆరుగురు సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు.  

హారిస్‌‌, స్మృతి ధనాధన్‌‌

ఛేదనలో హారిస్‌‌, స్మృతి యూపీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి ఓవర్‌‌లో హారిస్‌‌ రెండు ఫోర్లు కొడితే, స్మృతి బౌండ్రీతో ముందుకొచ్చింది. మూడో ఓవర్‌‌లో హారిస్‌‌ ఐదు ఫోర్లు బాదింది. ఆ వెంటనే 6, 4, 4 దంచింది. మధ్యలో స్మృతి కూడా ఫోర్లు రాబట్టడంతో పవర్‌‌ప్లేలో ఆర్సీబీ 63/0 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌‌లో 6, 4, 4 కొట్టిన హారిస్‌‌ 24 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసింది. 8వ ఓవర్‌‌లో స్మృతి ఒక ఫోర్‌‌, హారిస్‌‌ రెండు ఫోర్లు రాబట్టారు. 

9వ ఓవర్‌‌లో స్మృతి మూడు ఫోర్ల దంచడంతో స్కోరు వంద దాటింది. అయితే 10వ ఓవర్‌‌ తొలి బాల్‌‌కు హారిస్‌‌ ఔట్‌‌కావడంతో తొలి వికెట్‌‌కు 108 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. స్మృతితో కలిసిన జార్జియా వోల్‌‌ (16) బౌండ్రీలతో విరుచుకుపడింది. 12, 13వ ఓవర్‌‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన స్మృతి 26 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసింది. చివర్లో జార్జియా ఔటైనా. స్మృతి ఫోర్‌‌తో చిరస్మరణీయ విజయాన్ని అందించింది. 

సంక్షిప్త స్కోర్లు
యూపీ: 20 ఓవర్లలో 143/8 (దీప్తి 55, లానింగ్‌‌ 41, డిక్లెర్క్‌‌ 4/22). బెంగళూరు: 13.1 ఓవర్లలో 147/2 (హారిస్‌‌ 75, స్మృతి 54*, ఆశా 1/24).