క్రిస్ గేల్ తనకు ఇష్టమైన ఇంటికి చేరుకున్నాడు

క్రిస్ గేల్ తనకు ఇష్టమైన ఇంటికి చేరుకున్నాడు

క్రికెట్ యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అరుదైన గౌరవం ఇచ్చింది. RCB హాల్ ఆఫ్ ఫేమ్ లో క్రిస్ గేల్ను మాజీ ఆటగాడిగా చేర్చుకుంది. 2011లో క్రిస్ గేల్ తొలిసారి ఆర్సీబీకి ఆడాడు. 2011 నుంచి 2017 వరకు ఆర్సీబీ  జట్టుతో కొనసాగాడు. 

గేల్తో పాటు..డివిలియర్స్ కూడా..

ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ లో క్రిస్ గేల్ను చేర్చిన విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్ మీడియాలో  పోస్ట్ చేసింది. యూనివర్స్ బాస్ తనకు ఇష్టమైన ఇంటికి చేరుకున్నాడు అనే క్యాప్షన్‌ పెట్టింది. గేల్తో పాటు.. ఏబీ డివిలియర్స్‌ను కూడా ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చింది. దీంతో పాటు..ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్ల గౌరవార్థం వారి జెర్సీ నంబర్‌ను రిటైర్ చేయాలని ఆర్సీబీ నిర్ణయించింది. 

సంతోషంగా ఉంది..

ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ లో గేల్, డివిలియర్స్ కు చోటు దక్కడంపై బెంగుళూరు మాజీ కెప్టెన్  కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. వీరిద్దరితో కలిసి ఆడటం గర్వంగా ఉందన్నాడు. ఏబీ తన బ్యాటింగ్తో క్రికెట్ ఆడే విధానాన్నే మార్చేశాడని చెప్పాడు. గేల్తో ఏడేళ్ల పాటు ఐపీఎల్ ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని..ఈ ప్రయాణం అద్భుతమైందన్నాడు. 

తన ఐపీఎల్ కెరీర్‌లో క్రిస్ గేల్ మొత్తం 142 మ్యాచ్‌లు ఆడాడు. 141 ఇన్నింగ్స్‌లలో 39.79 సగటు, 148.96 స్ట్రైక్ రేట్‌తో 4,965 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 31 అర్థ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోరు 175 పరుగులు.  ఐపీఎల్‌లో ఒక ఆటగాడు చేసిన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు ఇదే కావడం విశేషం.