అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

అప్పుల బాధతో  ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది.  పటాన్ చెరు మండలం రామేశ్వరం బండ గ్రామానికి చెందిన చెన్నకేశవరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో అప్పులు బాగా పెరిగిపోయాయి. అప్పులు ఇచ్చిన వాళ్లు నిత్యం ఫోన్ లు చేయడం, ఇంటికి వచ్చి డబ్బులు ఎప్పుడిస్తావని ప్రశ్నించడంతో చెన్నకేశవరెడ్డి మనస్తాపానికి గురయ్యాడు.

తీసుకున్న అప్పులను తీర్చే మార్గం ఇప్పటికిప్పుడు లేకపోవటం.. వ్యాపారం సరిగా సాగకపోవటం.. రియల్ ఎస్టేట్ లో పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవటం వంటి కారణాలతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు చెన్నకేశవులరెడ్డి. అప్పుల బాధ తట్టుకోలేక.. తన భూమిలోనే గడ్డి మందు తాగి చనిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. కేసు నమోదు చేసుకున్న పటాన్‌చెరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పులు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటమే కాకుండా.. భూములపై భారీగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. పెట్టుబడి పెట్టిన భూములను అమ్ముదామని ప్రయత్నించినా.. ప్రస్తుతం ఆ ధరలో కొనేవారు లేక.. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు బంధువులు.