దేశ భద్రత విషయంలో దేనికీ తలొగ్గం: మోడీ

 దేశ భద్రత విషయంలో దేనికీ తలొగ్గం: మోడీ

‘భారత్​ శత్రుదుర్భేద్యమని మన సైనికులు పాక్​కు చాటి చెప్పారు.. కార్గిల్​విజయమే దీనికి ఉదాహరణ’ అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. కార్గిల్​యుద్ధం జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో కార్గిల్​ విజయ్​దివస్ ముగింపు కార్యక్రమం​ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాజ్​నాథ్​సింగ్​తో కలిసి ప్రధాని పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబ సభ్యులు నాటి సంఘటనలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధాని మోడీ అమరవీరులకు అంజలి ఘటించిన తర్వాత సభలో మాట్లాడుతూ ‘కార్గిల్‌‌ వార్​లో గెలుపొందాక మన సైనికులు మంచుకొండల్లో మువ్వన్నెల జెండా ఎగరవేశారని చెప్పారు. కార్గిల్‌‌లో పోరాడిన సైనికులు నిజమైన యుద్ధవీరులని అన్నారు. యుద్ధం ప్రభుత్వాల మధ్య కాదు.. దేశాల మధ్య జరుగుతుందన్నారు. కార్గిల్​విజయం ఇప్పటికీ దేశ పౌరులలో స్ఫూర్తి నింపుతూనే ఉందని చెప్పారు. అది దేశంలోని ప్రతీ పౌరుడి విజయం’ అని చెప్పారు.  కార్గిల్​లో కొంతభాగాన్ని ఆక్రమించుకుని కొత్త సరిహద్దులను ఏర్పాటు చేయాలన్నది పాకిస్తాన్ ప్రయత్నమని చెప్పారు. దీనికోసం 1999లో పాక్​సైన్యం విఫలయత్నం చేసిందన్నారు. అయితే, పాక్​దురాలోచనను సైన్యం తిప్పికొట్టిందని, చొచుకొచ్చిన శత్రువును బోర్డర్​అవతలికి తరిమి కొట్టిందని మోడీ చెప్పారు. కార్గిల్​యుద్ధం కొనసాగుతుండగానే తాను అక్కడికి వెళ్లినట్లు ప్రధాని చెప్పారు. అది తనకో తీర్థయాత్రలాంటిదన్నారు. సైనికులు నేలకొరిగిన చోటు పుణ్యక్షేత్రాలేనని, సైనికులే నిజమైన హీరోలని అన్నారు. ‘దేశం భద్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, జాతీయ భద్రత విషయంలో ఏ ఒత్తిడికీ తలొగ్గమని స్పష్టం చేశారు. సైనిక బలగాల ఆధునికీకరణకు ప్రాధాన్యమిస్తున్నామని మోడీ చెప్పారు.