తైవాన్ ఆక్రమణకు చైనా వ్యూహం

తైవాన్ ఆక్రమణకు చైనా వ్యూహం

చైనా ఆక్రమణకు ప్రయత్నిస్తే  తైవాన్‌ దేశానికి అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటున్నారు. తైవాన్‌కు మద్దతుగా సైనికపరంగా అమెరికా జోక్యం చేసుకుంటుందని ప్రకటించారు. వన్‌ చైనా పాలసీకి అమెరికా కట్టుబడి ఉన్నామంటూనే.. తైవాన్‌ను బలవంతంగా విలీనం చేసుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తేలేదని బైడెన్ హెచ్చరిస్తున్నారు. ఇంతకీ చైనా తైవాన్ ను ఎందుకు టార్గెట్ చేసింది? ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలకు కారణమేంటి ?

దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపం తైవాన్.  వందల ఏళ్ల క్రితం నుంచే చైనాతో తైవాన్ మధ్య సంబంధాలు కొనసాగుతున్నా.. 1949 నాటి సివిల్ వార్ లో ఆ రెండు దేశాలు విడిపోయాయి. అప్పటి నుంచి తైవాన్ ను హస్తగతం చేసుకునేందుకు చైనా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే తైవాన్ ప్రజలు, ప్రభుత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా వెనక్కి తగ్గని చైనా బలవంతంగానైనా తైవాన్ ను ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. నిజానికి తైవాన్ స్వయం పాలనలో ఉన్నప్పటికీ చైనా నుంచి ఇంకా దానికి స్వాతంత్ర్యం లభించలేదు. చైనా ఇప్పటికీ ఆ దేశాన్ని తమ రాష్ట్రాల్లో ఒకటిగా భావిస్తోంది. 1980లో చైనా తైవాన్ మధ్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. దీంతో డ్రాగన్ కంట్రీ ఒకదేశం రెండు వ్యవస్థల సూత్రాన్ని తెరపైకి తెచ్చింది. చైనాలో కలిసేందుకు ఒప్పుకుంటే.. పాలనలో స్వతంత్రతను కల్పిస్తామని చెప్పినా తైవాన్ ససేమిరా అంటోంది. 

నిజానికి చైనా, తైవాన్ మధ్య సంబంధాలు ఈనాటివి కావు. చైనా నుంచి వలస వెళ్లిన ఆస్ట్రోనేషియన్‌ గిరిజనులు తొలిసారిగా తైవాన్‌లో స్థిరపడినట్టు చరిత్ర చెప్తోంది. క్రీ.శ.239లో తమ దేశానికి చెందిన యాత్రికులు తైవాన్‌ను మొదట గుర్తించినట్లు చైనా రికార్డులు చెబుతున్నాయి. అందుకే తైవాన్‌ తమ దేశంలో భాగమేనని చైనా వాదిస్తోంది. 1624 -1661 మధ్య డచ్ పాలకుల అధీనంలో ఉన్న తైవాన్, ఆ తర్వాత 1895 వరకు చైనాకు చెందిన క్వింగ్ సామ్రాజ్యం పాలనలోనే కొనసాగింది. 17వ శతాబ్దంలో చైనాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు పెద్ద సంఖ్యలో తైవాన్‌కు వలస పోయారు. 1895లో జరిగిన సైనో-జాపనీస్ యుద్ధంలో క్వింగ్‌ ప్రభుత్వం పరాజయం పాలవడంతో తైవాన్.. జపాన్ అధీనంలోకి వెళ్లిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తర్వాత జపాన్  తైవాన్‌ పై నియంత్రణను వదులుకోవడంతో చైనా మళ్లీ పెత్తనం ప్రారంభించింది. 

చైనాలో అంతర్యుద్ధం మొదలవడంతో నాటి చైనా నాయకుడు షియాంగ్ కై-షెక్ సైన్యాన్ని మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టు బలగాలు ఓడించాయి. దీంతో ఆయన షియాంగ్‌తో పాటు ఆయనకు మద్దతుదారులైన 15లక్షల మంది తైవాన్‌కు వలసపోయారు. చాలా ఏళ్ల పాటు అక్కడి రాజకీయాలను శాసించారు. షియాంగ్‌ మరణానంతరం ఆయన కొడుకు షియాంగ్ చింగ్-కో తైవాన్ అధికారం చేపట్టాడు. చివరకు ప్రజాస్వామ్య ఉద్యమానికి తలొగ్గి 2000 సంవత్సరంలో ఎన్నికలకు సిద్ధమయ్యాడు. దీంతో తైవాన్‌లో షియాంగ్ కుటుంబ పాలన ముగిసింది. తైవాన్‌కు ప్రస్తుతం సొంత రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. అయినా కొన్ని దేశాలు మాత్రమే తైవాన్ ను దేశంగా గుర్తిస్తున్నాయి. చైనా మాత్రం ఇప్పటికీ అది తమ దేశంలో అంతర్భాగేనని వాదిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి తైవాన్ ను తన భూభాగంలో కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

పంజాబ్లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో?

మహిళల టీ-20 ఛాలెంజ్-2022లో వెలాసిటీ బోణి