మెతుకుసీమలో..కాంగ్రెస్​ ఓటమికి కారణాలెన్నో

మెతుకుసీమలో..కాంగ్రెస్​ ఓటమికి కారణాలెన్నో
  •     ఒక్కో సెగ్మెంట్‌లో ఒక్కో సమస్య
  •     పోస్ట్​మార్టం  చేసుకుంటున్న నేతలు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఆ పార్టీ మెజారిటీ సీట్లు సాధించినప్పటికీ ఉమ్మడి  మెదక్ జిల్లాలో మాత్రం వెనుక బడింది. ఇక్కడ మొత్తం 11 అసెంబ్లీ స్థానాలు ఉండగా కేవలం నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్​ అభ్యర్థులు గెలుపొందారు. కేసీఆర్​ పోటీ చేసిన గజ్వేల్, ఆర్థిక మంత్రి హరీశ్​రావు బరిలో ఉన్న సిద్దిపేట మినహా నర్సాపూర్, పటాన్ చెరు, సంగారెడ్డి, దుబ్బాక, జహీరాబాద్ లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉన్నా

 అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావడం, తొందరపాటు నిర్ణయాలు, టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్లు పార్టీ వీడిపోకుండా చూడడంలో విఫలం కావడం, అనుకూల గాలి వీస్తోందన్న ధీమా పెరిగిపోవడం, పోల్​మేనేజ్​ మెంట్​విషయంలో నిర్లక్ష్యం ఆయా సెగ్మెంట్లలో కాంగ్రెస్​ అభ్యర్థులు ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి. 

అసంతృప్తి కలిసొస్తుందని నిర్లక్ష్యం..

మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉండగా మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్​రావు గెలుపొందినప్పటికీ నర్సాపూర్​లో ఆవుల రాజిరెడ్డి ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్​ టికెట్ కోసం రాజిరెడ్డితోపాటు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్​కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్​రెడ్డి పోటీ పడ్డారు. అయితే హైకమాండ్​ రాజిరెడ్డికి టికెట్ కేటాయించింది. దీంతో మిగితా ముగ్గురు అసంతృప్తి వ్యక్తం చేశారు. గాలి అనిల్​ కుమార్ ఏకంగా హైకమాండ్​ తీరును నిరసిస్తూ నామినేషన్​ దాఖలు చేశారు.

ఆ తర్వాత పార్టీ పెద్దలు చర్చలు జరపడంతో నామినేషన్​ విత్​ డ్రా చేసుకున్నారు. పార్టీ టికెట్ ఇచ్చిన రాజిరెడ్డి గెలుపుకోసం సహకరిస్తానని చెప్పిన అనిల్​ కుమార్ అనూహ్యంగా కాంగ్రెస్​కు గుడ్​ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు వివిధ మండలాలకు చెందిన మద్దతుదారులు సైతం బీఆర్‌‌ఎస్​లోకి వెళ్లారు. ఇది కాంగ్రెస్ కు​మైనస్​ అయింది. బీఆర్ఎస్​లో నెలకొన్న అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని ఆశించారు.ప్రచారంలో కొన్ని ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం, పోల్​మేనేజ్​మెంట్​ విషయంలో వెనుకంజ వేయడం కాంగ్రెస్​ కొంప ముంచిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  

దెబ్బతీసిన లోకల్ ఫీలింగ్..

జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి పి. చంద్రశేఖర్ లోకల్ ఫీలింగ్ తో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు చేతిలో ఓడిపోయారు. ఈ సెగ్మెంట్ లోని కాంగ్రెస్ సెకండ్ క్యాడర్ కూడా చంద్రశేఖర్ గెలుపు కోసం పెద్దగా శ్రమించలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినప్పటికీ జహీరాబాద్ లో మాత్రం స్థానిక  ఫీలింగ్ ఆ పార్టీని దెబ్బతీసింది. పైగా ఇక్కడ 35 శాతం ఓటర్లు ఉన్న మైనార్టీలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపడం

క్రిస్టియన్లు సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ ఓటమికి కారణమైందని చెప్పుకుంటున్నారు. ఇకపోతే ఈ నియోజకవర్గ ఓటర్లలో లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ రావడంతో ఓటర్లు స్థానికుడైన మాణిక్ రావు వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. 

బీఎస్పీ దెబ్బకు..

పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి ప్రధాన కారణం బీఎస్పీ అని  చెప్పొచ్చు. టికెట్​ కోసం కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు పోటీ పడగా, మొదట్లో మధు పేరును ఖరారు చేసిన హై కమాండ్ చివరి క్షణంలో కాటాకు బీఫామ్ ఇచ్చింది. దీంతో ఎలాగైనా పోటీలో ఉండాలని భావించిన నీలం మధు బీఎస్పీ తరఫున పోటీ చేసి 40 వేల ఓట్లు దక్కించుకోవడం కాంగ్రెస్ ఓటమికి కారణమైంది.

ఈ ఇద్దరి మధ్య సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి.. 7,070 స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. పైగా బీఆర్ఎస్ ఇక్కడ డబ్బు ప్రభావం ఎక్కువగా చూపించడం వల్లే గెలిచిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ కాటాకు పటాన్ చెరులో మంచి పట్టు ఉన్నప్పటికీ టికెట్ వ్యవహారంలో నెలకొన్న ఇబ్బందులు, ప్రచారానికి పెద్దగా టైం లేకపోవడం ఆయన ఓటమికి కారణాలయ్యాయి. 

బీఆర్ఎస్​ పటిష్టంగా ఉండటం వల్లే.. 

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ఆశించినంత ఫలితాలను సాధించలేక పోతోంది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలో చేదు అనుభవాన్ని చవి చూసింది.  మూడు నియోజకవర్గాల్లో  కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉన్నా మెజారిటీ ఓట్లను సాధించలేకపోయింది.  సిద్దిపేట, దుబ్బాకలో పాతిక వేల లోపు, గజ్వేల్​లో 32 వేల ఓట్లను మాత్రమే సాధించారు.  సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతిసారి కాంగ్రెస్  అభ్యర్థులు మారుతుండడంతో  ఇక్కడ  నిలదొక్కుకోలేక పోతోంది. సిద్దిపేటలో హరీశ్ రావు లాంటీ లీడర్​తో పోటీ పడాలంటే ప్రజాబలం ఉన్న నాయకుడిని నిలబెట్టాల్సి ఉంటుంది.

ఈ విషయంలో కాంగ్రెస్​ ఫెయిల్​ అయిందని చెప్పాలి.  గజ్వేల్​లో మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినధ్యం వహించడం ఒక విధంగా కాంగ్రెస్ కు శాపంగా మారింది. గత మూడు ఎన్నికల్లో ను వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నా ఆశించిన ఫలితాల్ని సాధించ లేకపోతున్నారు.  గతంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఎంత ప్రయత్నించినా కేసీఆర్ లాంటీ బిగ్ పర్సనాల్టీ ముందు తేలిపోతున్నారు. గజ్వేల్​లో కాంగ్రెస్ కు మంచి ఓటు బ్యాంకున్నా ఎన్నికలు వచ్చే సరికి వాటిని పొందలేకపోతున్నారు.  

దుబ్బాక  ముక్కోణపు పోటీలో కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకపడిపోతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ తో పాటు బీజేపీలను ఎదుర్కోవాల్సి రావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయానికి దూరంగానే ఉండి పోతున్నారు. ఎన్నికల సమయంలో విజయం కోసం చమటోడ్చినా ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ దుబ్బాక అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి 24,843 ఓట్లు మాత్రమే వచ్చాయి. గతంలో శ్రీనివాసరెడ్డి తండ్రి ముత్యం రెడ్డి దుబ్బాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందినా తరువాత మళ్లీ పూర్వ వైభవాన్ని పొందలేకపో తున్నారు.

కొంపముంచిన అతి విశ్వాసం.. 

 రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ నడుస్తోంది.. ఎట్లైనా గెలుస్తామన్న ధీమా సంగారెడ్డి నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డి ఓటమికి కారణమైంది. ఇక్కడ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్..  జగ్గారెడ్డి మీద గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి జగ్గారెడ్డి నియోజకవర్గంలో ఫుల్ ప్లేడ్జ్ గా ప్రచారం చేయకపోవడం, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములపై ఆధారపడి ఓవర్ కాన్ఫిడెన్స్​తో  ఓటమి పాలయ్యారన్న ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డి భార్య నిర్మలారెడ్డి, కూతురు జయరెడ్డి మాత్రమే విస్తృతంగా ప్రచారం చేశారు.

చివరి క్షణంలో జగ్గారెడ్డి పైపైన తిరిగి రోడ్ షోలు నిర్వహించినప్పటికీ ప్రజలు ఆయనను ఆదరించలేకపోయారు. అంతేగాక కొందరు స్థానిక లీడర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తికి లోనై  బీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ ను దెబ్బ తీశారు. గడిచిన ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గానికి దూరంగా ఉండడం ఆయనకు మైనస్ గా మారింది. కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ అనుకూలంగా మలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని గెలుపును సునాయాసం చేసుకున్నారు.