కోర్టు, లాయర్ ఖర్చులు భరించలేకపోతున్న వారికి భరోసా

కోర్టు, లాయర్ ఖర్చులు భరించలేకపోతున్న వారికి భరోసా

రఘు, జానకి (పేర్లు మార్చాం) చూడముచ్చటైన జంట. పెండ్లైన కొన్ని రోజులకే వాళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు పెద్దవై విడాకుల కోసం  కోర్టు మెట్లు ఎక్కారు. అయితే... ఇదంతా ఏడాది కిందటి మాట. ఇప్పుడు వాళ్లు మళ్లీ కలిసే ఉంటున్నారు. అదెలా సాధ్యమైందంటే... మధ్యవర్తిత్వం వల్ల. భార్యాభర్తల పంచాయితీలే కాకుండా గృహహింస, విడాకులు, ఆస్తిపంపకం వంటి సమస్యలను కూడా మధ్యవర్తిత్వంతో పరిష్కరిస్తాయి ఆర్బిట్రేషన్​ సెంటర్లు. అలాంటి ఆర్బిట్రేషన్​ సెంటర్​ నడుపుతున్న జ్యోతిరావు గురించి...

భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు స్థలం గొడవలు.. సమస్య ఏదైతేనేం... ‘కోర్టులో చూసుకుందాం’ అంటుంటారు కొందరు. తీరా కోర్టుకి వెళ్లాక లాయర్​ ఫీజు భరించలేరు. వాయిదాలు, పైకోర్టులో అప్పీల్స్​ విసుగుతెప్పిస్తాయి కూడా. సరిగ్గా ఇలాంటప్పుడే ‘కూర్చొని మాట్లాడుకుని లేదా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యని పరిష్కరించుకుంటే బాగుండు’ అనుకుంటారు చాలామంది. అలా అనుకునే వాళ్లకు ‘మేమున్నాం’ అనే భరోసా ఇస్తున్నాయి మధ్యవర్తిత్వం చేసే ఆర్బిట్రేషన్​ సెంటర్లు.  

ఫ్రెండ్​ లాంటి సంస్థ

ఇలాంటి ఆర్బిట్రేషన్​ సెంటర్​ నడుపుతోంది జ్యోతిరావు. నల్లకోటు వేసుకున్న మొదటిరోజే పేదవాళ్లు, ఆడవాళ్లకు న్యాయం జరిగేలా చూడాలనుకుందామె. ముప్ఫయ్యేండ్ల కెరీర్​లో లాయర్​గా, అమికస్​ క్యూరీగా ఎన్నో కేసుల్ని వాదించింది. భర్త వేధింపులు, ఆస్తిలో వాటాకోసం ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే ఆడవాళ్లని చూసి చలించిపోయింది. వాళ్లకు మధ్యవర్తిత్వం ద్వారా కొత్త దారి చూపాలని పోయిన ఏడాది జూన్​లో హైదరాబాద్, వనస్థలిపురంలో ‘అమిక మీడియేషన్​ అండ్​ ఆర్బిట్రేషన్​ సెంటర్’ మొదలుపెట్టింది. ‘అమిక’ అంటే లాటిన్​లో ‘ఫ్రెండ్’ అని అర్థం. ఒక్కమాటలో చెప్పాలంటే సమస్య వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్​లా మంచీచెడూ చెప్పే వ్యక్తి అన్నమాట. 

ఏం చేస్తారంటే...

ఈ​ సెంటర్​లో.... మొదట ఇరు వర్గాల వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వింటారు​. తప్పు ఎవరిదో తెలుసుకున్నాక వాళ్లకు చట్టం గురించి వివరిస్తారు. ఇక మీదట  ఎలా ఉంటే వాళ్ల మధ్య సమస్య రాదు అనే విషయం అర్థమయ్యేలా వివరిస్తారు కౌన్సెలర్స్. ఇరువర్గాలు అంగీకరించే సొల్యూషన్​ చెప్తారు. ఫ్యామిలీ కోర్టులో, సివిల్​ కోర్టులో పెండింగ్​లో ఉన్న కేసుల్ని మీడియేషన్​ ద్వారా కొలిక్కి తెస్తారు. క్రిమినల్ ప్రొసీజర్​ కోడ్ 320 సెక్షన్ మొదటి భాగంలోని ఏ కేసునైనా మధ్యవర్తిత్వంతో  పరిష్కరించొచ్చని చెప్పింది జ్యోతి. 

ఇవీ లాభాలు

మీడియేషన్​ సెంటర్లలో సమస్య గురించి చెప్పుకునే ప్రైవసీ ఉంటుంది. అదొక్కటేకాకుండా వాళ్లు చెప్పే విషయాలు నాలుగ్గోడల మధ్యే ఉంటాయి. కోపావేశాలతో ఏదోఒకటి ఇప్పటికిప్పుడు తేలాల్సిందే... అనుకుని వచ్చేవాళ్లకు మొదటి కౌన్సెలింగ్​లోనే పరిష్కారం దొరికిపోతుంది చాలాసార్లు. కొన్ని కేసుల్లో మాత్రం ఎక్కువ సిట్టింగ్స్​ పడుతుంది. నామమాత్రపు ఫీజు తీసుకుని ఇద్దరికీ అనువైన పరిష్కారం చెప్తారు అమిక సెంటర్​లో. దాంతో లాయరు ఫీజు, కోర్టు చుట్టూ తిరగడానికయ్యే ఖర్చులు మిగులుతాయి. సెటిల్​మెంట్​ అగ్రిమెంట్ ​మీద ఇరు వర్గాలతో పాటు మధ్యవర్తులు కూడా సంతకాలు పెడతారు. ఈ పేపర్ కోర్టుల్లో కూడా చెల్లుతుంది. మీడియేషన్​ సెంటర్​లో సమస్య పరిష్కారం కావడం వల్ల ఇరువర్గాలకు గెలిచామన్న తృప్తి మిగులుతుంది.

భర్త ప్రోత్సాహంతో ‘లా’ చేసి...

జ్యోతిరావు భర్త పేరు మాధవరావు. ‘లా’ లో పి.హెచ్.డి. చేసిన ఆయన సెంట్రల్ పిఎఫ్​ కమిషనర్​గా పనిచేశారు. భార్యని లాయర్​గా చూడాలని ఎల్ఎల్​బి చదివించారాయన. మొదట్లో హైదరాబాద్​లోనే ప్రాక్టీస్​ చేసింది జ్యోతి. భర్తకి ఢిల్లీ ట్రాన్స్​ఫర్​ కావడంతో అక్కడి కోర్టుల్లో కేసులు వాదించేది. అక్కడ ఉన్నప్పుడు ఢిల్లీ కోర్టులో అమికస్ క్యూరీగా చేసింది. చేయని తప్పుకు జైళ్లలో మగ్గుతున్న వాళ్ల దగ్గర ఫీజు తీసుకోకుండా బెయిల్, పెరోల్​ పిటిషన్లు వేసింది. 

ఇలాంటి సెంటర్లు ఇంకా రావాలి

 ‘‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 కోట్ల కేసులు కోర్టుల్లో పెండింగ్​లో ఉన్నాయి. అదే మన రాష్ట్రంలో తీసుకుంటే  2 నుంచి 3 లక్షల కేసులు పెండింగ్​లో ఉన్నాయి.  ఆ కేసులు పరిష్కారమై... న్యాయం జరిగే సరికి కొన్ని నెలల నుంచి ఏండ్లు పట్టే అవకాశం ఉంది. ‘ఆలస్యంగా జరిగే న్యాయం కూడా ఒకరకమైన అన్యా యమే’ అంటాను నేను. ఆస్తివివాదాలు, భార్యాభర్తల మధ్య గొడవల్లో వాళ్లెక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకునేలా చేయడమే మధ్యవర్తుల పని. ఒకప్పుడు ఇంటిపెద్ద, గ్రామ పెద్దలు మధ్యవర్తిత్వం చేసేవాళ్లు.

ఇప్పుడు మీడియేటర్​ సెంటర్స్​ ఆ పని చేస్తున్నాయి. ఆలుమగల మధ్య గొడవలకి చదువు, అంతస్తు, ఇగో వంటివి ముఖ్య కారణాలు అవుతున్నాయి. అందుకని పెండ్లికి ముందే అబ్బాయి, అమ్మాయికి కౌన్సెలింగ్ ఇవ్వడం చాలా అవసరం. దానివల్ల పెండ్లి తర్వాత వాళ్ల మధ్య మనఃస్ఫర్థలు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా ఎలా సర్దుకుపోవాలన్నది ఇద్దరికీ తెలుస్తుంది. మా ఆఫీస్​  ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు పనిచేస్తుంది. ఇలాంటి సంస్థలు మరిన్ని వస్తే తక్కువ టైంలోనే చాలా కేసుల్ని పరిష్కరించొచ్చు. ఇప్పటి వరకు మేం వందకు పైగా కేసుల్ని పరిష్కరించాం” అని చెప్పింది జ్యోతిరావు.  -సంతోష్ బొందుగుల