దారిమళ్లిన ఎల్ఆర్ఎస్ ఫీజులు!

దారిమళ్లిన ఎల్ఆర్ఎస్ ఫీజులు!

వసూళ్లే తప్ప వసతుల్లేవ్‌‌‌‌‌‌

ఎల్ఆర్ఎస్ ఫీజులు కట్టినా సౌలత్ లు సున్నా

రెండు విడతల్లో మచ్చుకైనా కనిపించని అభివృద్ధి

సమస్యలతో సావాసం చేస్తున్న పాట్ల ఓనర్లు

నిధుల మళ్లింపులపై ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: తెలిసో తెలియకో తక్కువ ధరకు వస్తుందని ప్లాట్లుకొని మోసపోయిన సామాన్యులపై రెగ్యులరైజ్ భారం మోపుతున్న సర్కారు సౌలత్​లను  మాత్రం పట్టించుకోవడం లేదు. ఎల్ఆర్ఎస్ పెట్టిన ప్రతిసారీ కోట్లలో ఫీజులు వస్తున్నా, వాటితో  వెంచర్లలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టడం లేదు. గత రెండు విడతల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు వంటివి నిర్మించాల్సిన నిధులను దారి మళ్లించిందని డెవలపర్స్, ప్లాట్ల ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు చెల్లించినాఏండ్ల తరబడి సమస్యలతో సతమతమవతున్నామని ఆవేదన చెందుతున్నారు.

దారిమళ్లిన ఎల్ఆర్ఎస్ ఫీజులు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం మూడుసార్లు ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా రూ.1,500 కోట్లకిపైగా ప్లాట్ల ఓనర్లు, డెవలపర్ల నుంచి వసూలు చేసింది. 2015లో హెచ్ఎండీఏ పరిధిలోనే  దాదాపు రూ.వెయ్యి కోట్లు వచ్చాయి. లక్షకిపైగా ప్లాట్లను రెగ్యులరైజ్ చేసిన అధికారులు వెంచర్లలో వసతుల కల్పనను మాత్రం మర్చిపోయారు.  హెచ్ఎండీఏ ఖజానాకు చేరిన ఎల్ఆర్ఎస్ ఫీజులను ప్రభుత్వం దారి మళ్లించిందనే విమర్శలున్నాయి. తాజాగా అమల్లోకి వచ్చిన ఎల్ఆర్ఎస్​లో 200 గజాల ప్లాట్​కి రెగ్యులరైజేషన్, ఓపెన్ స్పేస్ చార్జీకి కనీసం రూ.45 వేల చొప్పున వసూలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 6వేల కోట్లు రాబట్టేందుకు రెడీ అయ్యింది. ఆ ఫీజులనూ ఇతర అవసరాలకు ఉపయోగించే అవకాశాలే ఎక్కువున్నాయని రియల్టర్లు ఆరోపిస్తున్నారు.

కనిపించని పార్కులు

వెంచర్ ​విస్తీర్ణంలో 10శాతం పార్కులు, ఇతరత్రా నిర్మాణాలకి ఉండాలంటూ ప్రభుత్వం ఓపెన్ స్పేస్ చార్జీ కింద 14% పెనాల్టీగా వసూలు చేస్తోంది. 190 గజాల ప్లాటుకు 2019లో ప్రభుత్వ ధర ప్రకారం గజానికి రూ. 1200 చొప్పున 2.29లక్షలయితే.. ఓపెన్ స్పేస్ చార్జీగా రూ. 32వేలు చెల్లించాలి. ఉదాహరణకు.. అలాంటి వంద ప్లాట్లు ఉంటే వెంచర్ రూ.32లక్షలు కట్టాలి. అలా చెల్లించినా పార్కులు నిర్మిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే రూ. 140 కోట్లకుపైగా వసూలు  కాగా, ఏ ఒక్క వెంచర్ లోనూ అదనపు సౌకర్యాలు కల్పించలేదని డెవలపర్స్ వాపోతున్నారు. ఆ ఫీజులను ఇతర పనులకు వినియోగిస్తే తమకు దక్కే ప్రయోజనమేంటని ప్లాట్ ఓనర్లు ప్రశ్నిస్తున్నారు.

ఐదేండ్లయినా అవే అవస్థలు

ఫీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్​లో ఉన్న సాయి ప్రియనగర్ కాలనీ. పదేండ్ల కింద గ్రామ​పంచాయతీ పర్మిషన్​తో వందెకరాల్లో 2వేల ప్లాట్లతో డెవలప్​ చేశారు. అప్పట్లో సిటీ శివారుగా ఉండడంతో డెవలపర్స్​ సౌలత్​లు కల్పించకుండానే ప్లాట్లు అమ్మారు. 2015లో హెచ్ఎండీఏ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి రెగ్యులర్‌‌ చేసుకోవాలని ఆదేశించడంతో కొన్నవాళ్లు బేసిక్, ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించారు. దాదాపు 500 ప్లాట్లకు రూ. 50వేల చొప్పున కట్టారు. ఇప్పటికీ అక్కడ కనీస వసతులు కల్పించలేదు. డ్రైనేజీ వ్యవస్థ లేక నీళ్లు ఇలా నిలుస్తున్నాయి.

మళ్లీ దారి మళ్లిస్తే కోర్టుకు వెళ్తాం

మౌలిక వసతులు, క్రమబద్ధీకరణ పేరిట వసూలు చేసిన ఎల్ఆర్ఎస్ ఫీజులను స్థానికంగా అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి. గతంలో మాదిరి ఎల్ఆర్ఎస్ నిధులు దారి మళ్లిస్తే కోర్టుకు వెళ్తాం. కరోనా టైమ్​లో భారమైనా కొందరు భయంతో ఎల్ఆర్ఎస్ ఫీజులు కడుతున్నారు. వాటిని పార్కులు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కేటాయించాలి. వెంచర్ల నుంచి వసూలు చేసిన డబ్బుతో వెంచర్లలోనే వసతులు కల్పించాలి. ఇతర ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే ప్లాట్ల ఓనర్లకు ఏం ప్రయోజనం?

‑ ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు

ఫీజులు చెల్లించినా నో యూజ్

వెంచర్లు, వ్యక్తిగత ప్లాట్లపై ఎల్ఆర్ఎస్ పేరిట ప్రభుత్వం లక్షల్లో వసూలు చేస్తోంది. వెంచర్లలో అభివృద్ధి పనులు చేపడుతామంటూ గతంలోనూ హామీ ఇచ్చింది. తీరా చెల్లించాక సౌకర్యాల ఊసే లేదు. మళ్లొకసారి ఖజానా నింపుకొనేందుకే ఎల్ఆర్ఎస్​ను తెరమీదికి తెచ్చింది. సామాన్యులపై ఆర్థిక భారం మోపుతోందే తప్ప.. రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదు.

‑ రాంబాబురెడ్డి, పర్వతాపూర్ స్థానికుడు

For More News..

ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా పదిసార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఆంగ్ రీటా మృతి

మద్దతు ధర పెంచిన కేంద్రం.. ఏ పంటకు ఎంతంటే..

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో శ్రద్ధాకపూర్