కాంగ్రెస్​లో బీసీ కిరికిరి .. హైకమాండ్​కు తిప్పలు ​

కాంగ్రెస్​లో బీసీ కిరికిరి .. హైకమాండ్​కు తిప్పలు ​
  • టికెట్​ఆశతో పార్టీలో కొత్తగా చేరిన బీసీ యేతర లీడర్లలో టెన్షన్
  • ఎలక్షన్ ​వేళ సీట్ల సర్దుబాటుపై హైకమాండ్​కు తిప్పలు ​ 

నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో బీసీవాదం జిల్లా లీడర్లను తిప్పలు పెట్టేలా ఉంది. కర్నాటక ఎలక్షన్స్ ​రిజల్ట్​తర్వాత జోష్ ​మీదున్న కాంగ్రెస్​లోకి వలసలు పెరిగాయి. కేవలం పోటీపై ఆశతో అనేక మంది పార్టీలో చేరగా, తాజా పరిణామాలు వారిని టెన్షన్​ పెడుతున్నాయి. లోక్​సభ నియోజకవర్గ పరిధిలో కనీసం ఇద్దరు బీసీలకు ఛాన్స్ ​ఇవ్వాలనే వాదన తెరమీదకి వచ్చింది. నిజామాబాద్​ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ​పార్టీలో రెడ్డి, తర్వాత రావు లీడర్ల ప్రాబల్యం అధికంగా ఉంది. ఈ క్రమంలో బీసీలను ఎక్కడ అవకాశం ఇస్తారన్న అంశం ఆసక్తిగా మారింది.  

నాలుగు చోట్ల ఓసీల మధ్యే పోటీ..

కాంగ్రెస్​ హయాంలో మంత్రిగా పనిచేసిన సుదర్శన్​రెడ్డి బోధన్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు.ఈసారి మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. టికెట్​పై పూర్తి ధీమాతో ఉన్నారు. ఆయనకు పోటీగా కెప్టెన్ కరుణాకర్​రెడ్డి టికెట్​రేసులో ఉన్నారు. నిజామాబాద్​ రూరల్​లో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ​భూపతిరెడ్డి, మార్కెట్ ​కమిటీ మాజీ చైర్మన్ ​నగేశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పోటీ పడుతున్నారు. లోక్​సభ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్స్​కు సిద్ధంగా ఉన్నారు. ఏదైనా కారణంతో ఆయన వద్దనుకుంటే జీవన్​రెడ్డి తమ్ముడు దేవేందర్​రెడ్డి భార్య విజయలక్ష్మీ(మాజీ మున్సిపల్​ చైర్​పర్సన్​) పేరు ప్రతిపాదనలో ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో రెడ్డిల ఆధిపత్యం ఉండగా, కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి నర్సింగ్​రావు, సుమన్​రావులు పోటీకి సన్నద్ధంగా ఉన్నారు. వీరందరూ అగ్ర కులస్తులే. 

మిగతా మూడు నియోజకవర్గాలు కీలకం..

నిజామాబాద్​ అర్బన్, బాల్కొండ, ఆర్మూర్ ​నియోజకవర్గాల్లో బీసీలకు ఛాన్స్​ లభించే అవకాశం ఉంది. ఈ నియోజకర్గాల్లో ఓసీ లీడర్లు తమకు టికెట్​వస్తుందో, లేదోనని కలవరపడుతున్నారు. డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్​రెడ్డి బాల్కొండ నియోజకవర్గంపై ఫోకస్​ పెట్టారు. ఎక్కువ సమయం నియోజకర్గంలో ఉంటున్నారు.  ఇటీవల కాంగ్రెస్​లో చేరిన ఆరెంజ్ ​ట్రావెల్స్​ అధినేత ముత్యాల సునీల్​రెడ్డి కూడా బాల్కొండ టికెట్​ఆశిస్తున్నారు. వీరిద్దరి మధ్య మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్​ఒక్కరే బీసీవర్గానికి చెందినవారు. బీసీ వాదాన్ని గట్టిగా వినిపిస్తూ టికెట్​డిమాండ్​ చేస్తున్నారు. అర్బన్​నియోజకవర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​మహేశ్ ​కుమార్ ​గౌడ్, పార్టీ నగర  ప్రెసిడెంట్​కేశవేణు, మాజీ మేయర్ ​సంజయ్​ ధర్మపురి ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈ ముగ్గరూ బీసీ లీడర్లే. 2018 ఎలక్షన్లలో పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన మైనార్టీ నేత తాహేర్​బిన్​ హందాన్​ కూడా అర్బన్​ రేసులో ఉన్నారు. ఆర్మూర్​లో జిల్లా గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్​మార చంద్రమోహన్ ​రెడ్డి టికెట్​తనకేనన్న ధీమాతో ఉండగా, బీజేపీకి గుడ్​బై చెప్పిన వినయ్​రెడ్డి కాంగ్రెస్​లో చేరడం దాదాపు ఖరారైంది. అసెంబ్లీ ఎలక్షన్​లో పోటీ కోసమే ఆయన పార్టీలో చేరుతున్నారనే ప్రచారం బలంగా ఉంది.