అక్రమాలకు అడ్డాగా మారిన రిజిస్ట్రేషన్ ఆఫీసులు

అక్రమాలకు అడ్డాగా మారిన రిజిస్ట్రేషన్ ఆఫీసులు
  • సిబ్బంది నుంచి ఆఫీసర్ల వరకూ అవినీతి ఆరోపణలు
  • ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల అరెస్ట్ తో బయటపడిన డొల్లతనం
  • కొన్నిచోట్ల ప్రైవేటు సిబ్బందే అనధికార ఆర్వోలు

హనుమకొండ, వెలుగు:  ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులు అక్రమాలకు అడ్డాగా మారాయి. సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలిపి ఇష్టారీతిన నాలా కన్వర్షన్లు, డబుల్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ బాగోతంలో కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకూ పాలు పంచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖిలా వరంగల్ కు చెందిన ఓ స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో నాలా కన్వర్షన్​ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు సీనియర్​ అసిస్టెంట్లు, ఓ డాక్యుమెంట్ రైటర్​ సహా 15 మందిపై కేసు నమోదు కావడం రిజిస్ట్రేషన్​ శాఖలో అక్రమాలను స్పష్టం చేస్తోంది. కొన్నేండ్లుగా కుర్చీలను వదలని ఆఫీసర్లు, వారు నియమించుకున్న ప్రైవేటు ఏజెంట్ల  ద్వారానే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొంతమంది బాధితులు ఆ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.
 డాక్యుమెంట్​ రైటర్లే మధ్యవర్తులు..
డాక్యుమెంట్ రైటర్లకు గతంలో ప్రభుత్వం లైసెన్స్​ఇచ్చి, రిన్యూవల్స్​ చేసేది. 2002 నుంచి ఈ  వ్యవస్థ  రద్దు చేశారు. అయినా రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ వీరంతా అడ్డాలు వేసుకొని పనిచేస్తున్నారు. కొందరు మాత్రం బ్రోకర్ల అవతారం ఎత్తారు. ఎలాంటి ల్యాండ్​కైనా పేపర్లు సృష్టించి, దగ్గరుండి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ల్యాండ్ విలువను బట్టి ఆఫీసర్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. హనుమకొండ వంటి ఆఫీస్ లో కొంతమంది టీ షాపు, పండ్ల వ్యాపారాలు నడిపే వారు కూడా డాక్యుమెంట్​రైటర్ల అవతారం ఎత్తి.. అక్రమ దందాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

ఏండ్ల తరబడి ఒకేచోట..

రిజిస్ట్రేషన్ టైంలో 22(ఎ) జాబితా ప్రకారం ప్రభుత్వ, అసైన్డ్, ఇనాం తదితర భూముల సర్వే నెంబర్లు పరిశీలించాలి. నాలా కన్వర్షన్ చెక్ చేయాలి. కానీ కొంతమంది అధికారులు డబ్బులకు ఆశపడి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఏండ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్న కొందరు సబ్​ రిజిస్ట్రార్లే సహకరిస్తున్నారు. వరంగల్ సిటీలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్​లో ఇలాంటి బాగోతాలు పెరిగిపోవడంతో అప్పట్లో ఓ నలుగురు ఆఫీసర్లను ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. అయినా సిబ్బందిలో మార్పురాలేదు. తాజాగా ఖిలా వరంగల్ భూదందాలో ఏకంగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి, నాలా కన్వర్షన్​ ప్రొసీడింగ్స్​కూడా ఇచ్చారు. దీంతో సీనియర్​ అసిస్టెంట్లు చిట్యాల ప్రవీణ్​, దాసరి మునీందర్​ పైనా కేసు నమోదైంది. ఇదే కేసులో ఓ డాక్యుమెంట్​ రైటర్​ కూడా అరెస్ట్​ అయ్యాడు.

ఆఫీసర్ల చేతిలో ప్రైవేటు సిబ్బంది..

 కొందరు ఆఫీసర్లు ప్రైవేటు సిబ్బందితో అక్రమ దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఖిలా వరంగల్​ రిజిస్ట్రేషన్​ ఆఫీసులో ఓ  ప్రైవేటు వ్యక్తి ద్వారా ఓ అధికారి సెటిల్​ మెంట్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది.  పదేండ్లకు  పైగా ఇక్కడే పని చేస్తున్న ఆయన.. సదరు ప్రైవేటు వ్యక్తి చెప్పిన డాక్యుమెంట్లు మాత్రమే ముట్టుకుంటాడనే ఆరోపణలున్నాయి. భీమదేవరపల్లి ఆఫీస్​లో సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా.. సబ్​ రిజిస్ట్రార్​ మాత్రం ఓ ప్రైవేటు వ్యక్తికి అఫీషియల్ యూజర్ నేమ్, పాస్​వర్డ్ ఇచ్చి తతంగం నడిపిస్తున్నట్లు సమాచారం. 
ఆయనే అనధికార ఆర్వోగా కొనసాగుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ములుగు, పరకాల, స్టేషన్​ ఘన్​పూర్​, వరంగల్​ ఆఫీస్ ల​లో కూడా ప్రైవేటు వ్యక్తుల ద్వారానే అంతా నడుస్తున్నట్లు తెలిసింది. కొడకండ్ల లో ఓ జూనియర్​ అసిస్టెంట్​, మహబూబాబాద్​ లో ఓ సీనియర్​ అసిస్టెంట్​ చేతుల్లోనే  అక్రమ  దందా సాగుతున్నట్లు ప్రచారం జరగుతోంది.  వాస్తవానికి స్టాంప్స్​, రిజిస్ట్రేషన్స్​ శాఖలో అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగులను కేవలం ఒక సంవత్సర ప్రాతిపదికన మాత్రమే తీసుకున్నారు. కానీ ఆ గడువు ముగిసినా వారినే ప్రైవేటు సిబ్బందిగా కొనసాగిస్తూ  కొంతమంది పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు. దీంతోనే  కొద్దిరోజుల కిందట సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. తరచూ వివాదాలకు కారణమవుతున్న స్టాంప్స్​, రిజిస్ట్రేషన్​ శాఖలో బదిలీలు, ప్రక్షాళన చేపడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వివాదాస్పదంగా ఆఫీసర్ల తీరు

సిబ్బంది అక్రమాల తతంగం పెద్దాఫీసర్ల సహకారంతోనే జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖిలా వరంగల్ భూదందా విషయం కూడా జిల్లా అధికారులకు తెలిసినా కూడా పెద్దగా యాక్షన్​ తీసుకోలేదనే విమర్శలున్నాయి. గతంలో ఇన్​ఛార్జి సబ్​ రిజిస్ట్రార్​ గా ఉంటూ అక్రమాలకు పాల్పడిన చిట్యాల ప్రవీణ్​ ను సస్పెండ్​ చేసినా జిల్లా ఉన్నతాధికారులు..  కొద్దిరోజులకే ఆడిట్​ ఆఫీస్​లో పోస్టింగ్​ ఇచ్చారు. దీంతో ఆఫీసర్ల తీరుపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.  
ఈ క్రమంలో పెద్దాఫీసర్ల పాత్రపైనా ఎంక్వైరీ జరుగుతున్నట్లు తెలిసింది. కాగా రిజిస్ట్రేషన్​ ఆఫీసుల్లో అక్రమ దందా, తాజా ఘటనపై  డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్​ హరికోట్ల రవిని వివరణ కోరేందుకు ప్రయత్నం చేయగా.. ఆయన స్పందించకపోవడం గమనార్హం.