పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు

పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు
  • ప్లాట్లకు డిమాండ్​ఉండడంతో ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని లబ్ధిదారుల్లో భయం సృష్టించిన కొందరు మధ్యవర్తులు
  • ప్లాన్ ప్రకారం మధ్యవర్తుల ద్వారా ప్లాట్లు కొన్న లీడర్లు, రియల్టర్లు
  • ఇప్పటికే 50 ప్లాట్లు అన్యాక్రాంతం

మహబూబ్​నగర్​, వెలుగు : పోలేపల్లి సెజ్​ భూబాధితులకు అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను వారి అవసరాలను ఆసరాగా చేసుకొని బడాబాబులు స్వాహా చేస్తున్నారు. జాతీయ రహదారి -44కు అత్యంత సమీపంలో ఈ ప్లాట్లు ఉండటంతో ఒక్కో ప్లాట్​ రూ.30 లక్షల వరకు పలుకుతున్నది. దాంతో వాటిపై కన్నేసిన కొందరు అధికార పార్టీ లీడర్లు, రియల్  ఎస్టేట్  వ్యాపారులు.. భూబాధితులకు డబ్బు ఎరగా చూపి ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.

329 ప్లాట్లకు గాను 282 పంపిణీ..

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలంలో స్పెషల్​ ఎకనామిక్​ జోన్​ (సెజ్​) ను 2007 ఏర్పాటు చేశారు. దీని కోసం ఇదే మండలంలోని పోలేపల్లి, బాలానగర్​ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 282 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి 950 ఎకరాలను ఆంధ్రప్రదేశ్​ ఇండస్ర్టియల్​ ఇన్ ఫ్రాస్ర్టక్చర్​ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) సేకరించింది. అర ఎకరా, ఎకరా, రెండెకరాలు, ఐదెకరాలు ఇలా ఎంత భూమి ఉన్నా అందరికీ ఒకే రకమైన పరిహారం కింద రూ.70 వేలు మాత్రమే చెల్లించింది. పరిహారం సరిపోవట్లేదని బాధితులు ఆందోళన చేయడంతో 2009 జూలై 25 ప్రతి పట్టాదారుడికి 200 గజాల చొప్పున సర్వే నంబర్​ 458, 459లో ప్లాట్లు కేటాయించింది. మొత్తం 329 ప్లాట్లను జీపీ లేఅవుట్​ చేయగా, 282 మంది బాధితులకు ప్లాట్లను కేటాయించారు. బాధితులందరూ పేదలు కావడంతో ఎవరూ ఇండ్లు కట్టుకోలేదు. అప్పట్లో ప్రభుత్వమే ఇండ్లు కట్టివ్వాలని బాధితులు కోరినా స్పందించలేదు. అయితే, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత ఎన్​హెచ్​-44ను ఆనుకొని ఉన్న జడ్చర్ల, బాలానగర్​ ప్రాంతాల్లోని భూములకు విపరీతమైన డిమాండ్​ వచ్చింది. ఈ క్రమంలో సెజ్​లో ఎకరా భూమి దాదాపు రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పైగానే పలుకుతోంది. దీంతో ఈ ప్లాట్లు ఉన్న ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న వాటి గజం విలువ రూ.15 వేలు, సెకండ్​ బిట్​ ప్లాట్ల గజం విలువ రూ.12 వేల వరకు పలుకుతున్నాయి. ఈ లెక్కన ఒక్కో ప్లాట్​ విలువ రూ.24 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంది. దీంతో ఈ ప్లాట్లను ఆక్రమించేందుకు రూలింగ్​ పార్టీకి చెందిన కొందరు లీడర్లతో పాటు రియల్​ ఎస్టేట్  వ్యాపారులు స్కెచ్​ వేశారు. భూబాధితుల ఆర్థిక అవసరాలను అవకాశంగా చేసుకొని వారి ప్లాట్లను చాలా అగ్గువకే కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 2018 నుంచి ఈ తంతు నడుస్తున్నా ఎవరూ స్పందించడం లేదు. దీనికితోడు ఈ వ్యవహారంలో ఆఫీసర్లు కూడా కొనుగోలుదారులకే సహకారం అందిస్తుండటతో రిజిస్ర్టేషన్ల విషయం బయటకు రావడం లేదు. భవిష్యత్తులో బాధితులు లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా పకడ్బందీగా ప్లాట్లను రిజిస్ర్టేషన్​ చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇండ్లు  లేకున్నా.. ఇంటి నంబర్లు

మొత్తం 282 ప్లాట్లలో ఇప్పటికే 50కి పైగా ప్లాట్లను బాధితుల నుంచి ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. 2018 నుంచి ముగ్గురు మధ్యవర్తుల ద్వారా ఈ ప్లాట్లను అమ్మిన్నట్లు సమాచారం. ఒక్కో ప్లాట్​ విలువ రూ.24 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉండగా, కొనుగోలుదారులు మాత్రం బాధితులకు ఒక్కో తరహాలో చెల్లింపులు చేశారు. కొందరికి రూ.90 వేలు, మరికొందరి రూ.1.25 లక్షలు, ఇంకొందరికి రూ.1.70 లక్షలు చెల్లించారు. అత్యధికంగా రోడ్డుకు పక్కన ఉన్న ప్లాట్​కు రూ.4 లక్షల వరకు చెల్లించారు. భవిష్యత్తులో కొనుగోలుదారులకు ఇబ్బందులు రాకుండా పక్కా ప్లాన్​ ప్రకారం ప్లాట్లను రిజిస్ర్టేషన్​​ చేయించిన్నట్లు తెలిసింది. ఇందు కోసం ముందునేగా లబ్ధిదారుల నుంచి నాలుగు ఖాళీ చెక్కులు తీసుకున్నారు. అలాగే నోటరీ కూడా రాయించుకున్నారు. రూ.50 బాండ్​ పేపర్​ మీద ‘ప్లాట్​ విక్రయ అగ్రిమెంట్’ చేయించుకుంటున్నారు. అనంతరం లోకల్ ఆఫీసర్లతో ఆ ప్లాట్లకు భూబాధితుల పేర్ల మీద జీపీ నుంచి ఇంటి నంబర్లు సృష్టిస్తున్నారు. ఇందుకోసం నామ్కే వాస్తేగా ఆ ప్లాట్లల్లో సిమెంటు పలకలతో పది ఇంటు పది సైజులో చిన్న రూములు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి పైకప్పు లేకున్నా, అది ఇల్లేనని అధికారులు ఇంటి నంబర్​ కేటాయిస్తున్నారు. ఆ నంబర్​ ఆధారంగా మధ్యవర్తులు ప్లాట్లను రిజిస్ర్టేషన్​ చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు ప్లాట్లు అమ్ముకున్న కొందరు బాధితులు మాట్లాడుతూ తమను రిజిస్ర్టేషన్​ ఆఫీసుకు తీసుకెళ్లి ఫొటోలు తీయడంతోపాటు వేలిముద్రలు కూడా తీసుకున్నారని ‘వెలుగు’ కు చెప్పారు.

రూల్స్ ఉల్లంఘించారు

పోలేపల్లి భూబాధితులకు అప్పటి ప్రభుత్వం 2008లో ప్లాట్ల పట్టాలు అందజేసినపుడు పట్టాల్లో కొన్ని గైడ్​లైన్స్​ పొందుపర్చారు. అందులో బాధితులు తమకు  కేటాయించిన ప్లాట్లను ఎవరికీ అమ్ముకోరాదు, ఇతరులకు అద్దెకు ఇవ్వరాదు, దానం కూడా చేయరాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ నిబంధనల్లో ఏది అతిక్రమించినా ప్రభుత్వం ఆ ప్లాట్లను తిరిగి తీసుకుంటుందని స్పష్టం చేశారు. కానీ, ఈ ప్రాంతానికి చెందిన కొందరు మధ్యవర్తులు లబ్ధిదారులను అయోమయానికి గురిచేశారు. ‘‘మీరు ఇండ్లు కట్టుకోకుండా ప్లాట్లను ఖాళీగా ఉంచారు. త్వరలో ప్రభుత్వం వాటిని తిరిగి తీసుకుంటుంది” అని బాధితుల్లో భయం పుట్టించారు. ప్లాట్లు కేటాయించి 13 ఏండ్లు కావస్తుండడంతో రూల్స్​ ప్రకారం ఎవరికైనా అమ్ముకోవచ్చని, మీరు అమ్మాలనుకుంటే తమకు చెప్పాలనిబాధితులతో ప్లాట్లు అమ్మించారు. ఇప్పటికే దాదాపు 50కి పైగా ప్లాట్లను అమ్మగా, ఈ ప్లాట్లను మొత్తం ఇద్దరు వ్యక్తులే కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఇది సర్వే నంబర్​ 458, 459లోని ప్లాట్​ నంబర్​ 271. ఈ ప్లాట్  పోలేపల్లి గ్రామానికి చెందిన ఏట్టి వెంకటయ్యది. సెజ్​కు ఆయన తన ఎకరం భూమి ఇవ్వడంతో అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వం 2008లో ఈ ప్లాట్​ను వెంకటయ్యకు కేటాయించింది. నిరుపేద కావడంతో ఆయన ఇంకా ఇల్లు కట్టుకోలేదు. కొద్ది రోజుల కింద ఆయనకు జబ్బు చేయడంతో వైద్యం చేయించుకోవడానికి డబ్బుల కోసం గ్రామానికి చెందిన ఓ మధ్యవర్తిని ఆశ్రయించాడు. ఆయన దాదాపు రూ.20 లక్షలు విలువ చేసే ఈ ప్లాట్​ను అతితక్కువ ధర రూ.2.25 లక్షలకే వేరే వ్యక్తికి 2020 ఆగస్టు 8న ‘ప్లాట్​ విక్రయ అగ్రిమెంట్’ చేయించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తన ప్లాట్​ను వారి పేరు మీద రిజిస్ర్టేషన్​ చేయించుకున్నారని బాధితుడు తెలిపాడు.

పోలేపల్లి గ్రామానికి చెందిన పెద్ద చెన్నమ్మ, మొగలమ్మ బంధువులు. వారిద్దరికి నాలుగు ఎకరాల చొప్పున ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని మొత్తం నాటి ప్రభుత్వం సెజ్​ కోసం తీసుకుంది. దీంతో వారికి పరిహారం కింద సర్వే నంబర్​ 458, 459లోని 114, 115వ ప్లాట్లను కేటాయించింది. ఆ రెండు ప్లాట్లను కూడా మధ్యవర్తులు ఇతరులకు అమ్మించారు. ఇందుకుగాను ఒక ప్లాట్​కు రూ.1.50 లక్షలు, మరో ప్లాట్​కు రూ.2 లక్షలు కలిపి రెండు ప్లాట్లకు రూ.3.50 లక్షలు చెల్లించారు. వాస్తవానికి ఈ రెండు ప్లాట్లు 400 గజాలు ఉండగా, మార్కెట్  రేటు ప్రకారం వాటి విలువ రూ. 30 లక్షలకుపైనే ఉంటుందని అంచనా.

2021లో ఇంటి నంబర్లు ఇచ్చాం

భూబాధితులు ప్లాట్లకు సరిహద్దులు ఏర్పాటు చేసుకొని 2021లో పది ఇంటు పది సైజులో చిన్న రూములు వేసుకున్నారు. ఆ రూమ్​ ఆధారంగా సెల్ఫ్​అసెస్​మెంట్​ కింద ఇంటి నంబర్​ ఇచ్చాం. ప్లాట్లను ఇతరులకు అమ్ముకున్నారా? లేదా రిజిస్ర్టేషన్ చేశారా? అనే విషయాలు నాకు తెలియదు.

- శివప్రకాశ్​, పంచాయతీ సెక్రటరీ,
 పోలేపల్లి, మహబూబ్​నగర్​ జిల్లా