రిలయన్స్ 5జి ఫోన్ ధర రూ.2500

రిలయన్స్ 5జి ఫోన్ ధర రూ.2500
  • నెలాఖరులోగా మార్కెట్లో రిలీజ్ కు సన్నాహాలు

రిలయన్స్ జియో.. మరో సంచలనానికి నాందిపలకబోతోంది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జియో వారి 5జీ స్మార్ట్ ఫోన్ రెడీ అయినట్లు మార్కెట్ వర్గాల సమాచారం. డిజిటల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చేలా ప్రపంచంలోనే అత్యంత చవకగా రూ.2500కే అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ కనీస ప్రారంభ ధర 27వేలు పైబడి ఉంది. ఈ నేపధ్యంలో కేవలం 2500కే 5జీ స్మార్ట్ ఫోన్ నమ్మశక్యం కాని ధరే అవుతుంది. ఇంత తక్కువ ధరకు కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ పెను సంచలనం రేపే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పేదలందరికీ అందుబాటులో ఉండే ధరతో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించిన విషయం తెలిసిందే. జియోతో ఒప్పందం చేసుకుని అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ సిద్ధం చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నట్లు పలుమార్లు ప్రకటించారు. 
ఈ నేపధ్యంలో ఈనెల 24న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 44వ వార్షిక వాటాదారుల సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే జియో కొత్త 5జీ ఫోన్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ లోని అంతర్గత వర్గాల సమాచారం మేరకు మార్కెట్ నిపుణులు కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ పై అంచనాలు వేస్తున్నారు. జియో రాకతో స్మార్ట్ ఫోన్లు, డేటా వినియోగం భారతదేశంలో రెండు మూడు రెట్లు పెరిగింది. ఈ నేపధ్యంలో 5జి ఫోన్ అత్యంత చవక ధరకు వస్తే మరో సంచలనం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రముఖ ప్రైవేట్ టెలికాం నెట్ వర్క్ లు బ్రాడ్ బ్యాండ్ వాడకం భారీగా పెరగడంతో దీనికి అనుగుణంగా విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా మరో 30 కోట్ల మంది మొబైల్ బ్రాడ్ బ్యాండ్ యూజర్లు, 5 కోట్లకు పైగా ఫైబర్ హోమ్స్, 5 కోట్ల ఎంఎస్ఎంఈలకు సేవలు అందించగలిగే స్థాయిలో నెట్ వర్క్ ను అభివృద్ధి పరుస్తున్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ దిగ్గజం క్వాల్ కామ్ తో కలసి జియో భారత్ లో 5జీ సొల్యూషన్స్ ను విజయవంతంగా పరీక్షించినట్లు తెలుస్తోంది.