సంపద సృష్టిలో రిలయన్స్ నం. 1

సంపద సృష్టిలో రిలయన్స్ నం. 1

న్యూఢిల్లీ: ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్​ మరో ఘనతను సొంతం చేసుకుంది. మనదేశంలోనే అత్యధికంగా సంపద సృష్టించిన కంపెనీగా గుర్తింపు పొందింది. ఇది  2018 నుంచి 2023 వరకు ఐదేళ్ల కాలంలో అతిపెద్ద సంపద సృష్టికర్తగా ఎదిగింది. అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ భారీ, వేగంగా ఎదిగిన, స్థిరమైన (టాప్ ఆల్​రౌండర్​) కంపెనీగా నిలిచిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టడీ వెల్లడించింది.  

 కంపెనీల స్టాక్ మార్కెట్ పనితీరు ఆధారంగా జరిపిన ఈ అధ్యయనంలో వరుసగా ఐదవ సారి రిలయన్స్ అతిపెద్ద సంపద సృష్టికర్తగా అవతరించింది. 2018–-23లో ఇది రూ.9,63,800 కోట్ల సంపదను సృష్టించింది. ఆ తర్వాతి స్థానాల్లో టీసీఎస్​ (రూ. 6,77,400 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ. 4,15,500 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ. 3,61,800 కోట్లు), భారతీ ఎయిర్‌‌‌‌టెల్ (రూ. 2,80,800 కోట్లు) ఉన్నాయి.  లాయిడ్స్ మెటల్స్ 2018–23 మధ్య 79 శాతం సీఏజీఆర్​తో అత్యంత వేగవంతమైన సంపద సృష్టికర్తగా రికార్డులకు ఎక్కింది.  

అదానీ   78 శాతం సీఏజీఆర్​ సాధించింది. టాప్ 10 సంపద సృష్టికర్తలలో 2018లో పెట్టుబడి పెట్టిన రూ. 10 లక్షల విలువ 2023లో రూ.  కోటి అవుతుంది. ఇది 59 శాతం రిటర్న్ సీఏజీఆర్​కు సమానం. కాప్రి గ్లోబల్ అత్యంత స్థిరమైన సంపద సృష్టికర్తగా ఘనతను దక్కించుకుంది. ఇది గత ఐదేళ్లలో బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్‌‌‌‌ను అధిగమించింది.

 ఏకంగా50 శాతం  సీఏజీఆర్​ను సాధించింది.  అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ అత్యుత్తమ ఆల్ రౌండ్ వెల్త్ క్రియేటర్‌‌‌‌గా రికార్డు సృష్టించింది. ఇది 9వ అతిపెద్ద సంపద సృష్టికర్త. రెండవ వేగవంతమైన కంపెనీగా,  ఐదవ అత్యంత స్థిరమైన కంపెనీగా ఎదిగింది. ఆ తర్వాత వరుణ్ బెవరేజెస్, అదానీ పవర్, ట్యూబ్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్,  ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి. 

మొత్తం రూ.70 లక్షల కోట్లు

2018-–23లో ఇండియాలోని  టాప్ 100 సంపద సృష్టికర్తలు రూ. 70.5 లక్షల కోట్ల సంపదను సృష్టించారు. ఇది మునుపటి 5 సంవత్సరాల కాలం 2017-–22 (రూ. 92.2 లక్షల కోట్లు) కంటే చాలా తక్కువ. సంపద సృష్టి వేగం 21 శాతం సీఏజీఆర్​ వద్ద ఉంది. మునుపటి 5 సంవత్సరాల కాలంలో (28 శాతం) కంటే కూడా తక్కువగా ఉంది. కానీ బీఎస్​ఈ సెన్సెక్స్ రాబడి 12 శాతం కంటే చాలా ఎక్కువ. 

వరుసగా ఐదవసారి అతిపెద్ద సంపద సృష్టికర్తగా రిలయన్స్  గుర్తింపు పొందింది. టీసీఎస్​, ఇన్ఫోసిస్ ప్రతి​ఏటా టాప్ –5 సంపద సృష్టికర్తలలో ఉన్నాయి. చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా  సంపద సృష్టికర్తల టాప్–10 జాబితాలో హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ కనిపించలేదు. కన్జూమర్​,  రిటైల్  ఫైనాన్షియల్‌‌‌‌ల కంటే టెక్నాలజీ రంగం వరుసగా రెండవ సంవత్సరం కూడా అతిపెద్ద సంపదను సృష్టించే రంగంగా ఎదిగింది. 

సంపద సృష్టిలో టెక్నాలజీ 20 శాతం వాటాను దక్కించుకుంది.  రసాయనాలు/ఎరువులు రంగం నుంచి మూడు శాతం సంపద వచ్చింది. అత్యధికంగా నష్టపోయిన వాటిలో సెన్సిటివ్ ఫైనాన్షియల్స్,  ఆటో రంగాలు ఉన్నాయి. 2018–23లో పీఎస్​యూల (పబ్లిక్ సెక్టార్ అండర్‌‌‌‌టేకింగ్‌‌‌‌లు) సంపద సృష్టి పనితీరు గత రెండు అధ్యయనాల కంటే పెరిగింది. ఏడు  పీఎస్​యూలు ఆరు శాతం సంపదను సృష్టించాయి.