
- రిలయన్స్ క్యూ4 లాభం రూ.19,299 కోట్లు
- హయ్యస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్ ఇదే
- 2022–23 లో రెవెన్యూ రూ. 9 లక్షల కోట్లు..
- నికర లాభం రూ.66,702 కోట్లు
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రూ. 19,299 కోట్ల (కన్సాలిడేటెడ్) నికర లాభం వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ. 16,203 కోట్లతో పోలిస్తే క్యూ4 లో 19 శాతం పెరిగింది. ఆయిల్ బిజినెస్ రెవెన్యూ తగ్గినా, ప్రాఫిట్ పెరగడంతో కంపెనీ ఓవరాల్ లాభం మెరుగుపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇదే హయ్యస్ట్ క్వార్టర్లీ లాభం కావడం విశేషం. కార్యకలాపాల ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు క్యూ4 లో రూ.2.16 లక్షల కోట్ల రెవెన్యూ రాగా, కిందటేడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో ఈ నెంబర్ రూ. 2.12 లక్షల కోట్లుగా రికార్డయ్యింది. ఇతర మార్గాల్లో రూ. 2,918 కోట్ల ఆదాయం సంపాదించింది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో కంపెనీ ఆయిల్ టు కెమికల్ బిజినెస్‌కు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించడంతో మొదట్లో రెవెన్యూ కొంత తగ్గింది. కానీ, కిందటేడాది డిసెంబర్ నుంచి ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించుకుంటూ వస్తోంది.
కంపెనీ రెవెన్యూ పెరగడానికి ఇది కారణమయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు క్యూ4 లో రూ. 16,759 కోట్ల నికర లాభం వస్తుందని, రూ.2.22 లక్షల కోట్ల రెవెన్యూ వస్తుందని ఎనలిస్టులు అంచనావేశారు. ప్రాఫిట్ అంచనాలను ఈజీగా దాటేసినా రెవెన్యూ మాత్రం అంచనాల కంటే తక్కువగా రికార్డయ్యింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 2022–23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయం రూ.9 లక్షల కోట్లుగా ఉంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.7.36 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. నికర లాభం ఏడాది ప్రాతిపదికన రూ. 60,705 కోట్ల నుంచి రూ.66,702 కోట్లకు పెరిగింది.
ఆయిల్ బిజినెస్ రెవెన్యూ డౌన్..
ఆయిల్ బిజినెస్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు క్యూ4 లో రూ. 1,28,633 కోట్ల ఆపరేషనల్ రెవెన్యూ వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ. 1,45,786 కోట్లతో పోలిస్తే 12 శాతం తగ్గింది. ఇబిటా రూ.14,241 కోట్ల నుంచి రూ.16,293 కోట్లకు ఎగిసింది. ఇబిటా అంటే ట్యాక్స్‌లు, వడ్డీలు, ఇతరత్రా అమౌంట్ కట్ చేయక ముందు వచ్చిన ప్రాఫిట్ అని అర్థం. ఇబిటా మార్జిన్ 290 బేసిస్ పాయింట్లు పెరిగి 12.7 శాతం పెరిగింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ. 5.95 లక్షల కోట్ల రెవెన్యూని, రూ.62 వేల కోట్ల ఇబిటాను కంపెనీ ఆయిల్ బిజినెస్ ప్రకటించింది.
రిటైల్ బిజినెస్ నుంచి రూ.69 వేల కోట్లు..
రిలయన్స్ రిటైల్ బిజినెస్ ఏడాది ప్రాతిపదికన 30 శాతం గ్రోత్ నమోదు చేసింది. రిలయన్స్ రిటైల్ కిందటేడాది మార్చి క్వార్టర్‌లో కార్యకలాపాల ద్వారా రూ.58 వేల కోట్ల రెవెన్యూ సంపాదించగా, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో రూ.69,267 కోట్లు సంపాదించింది. ఇబిటా ఏడాది ప్రాతిపదికన రూ. 3,712 కోట్ల నుంచి రూ.4,925 కోట్లకు ఎగిసింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ రిటైల్‌కు రూ. 2.6 లక్షల కోట్ల రెవెన్యూ , రూ.17,974 కోట్ల ఇబిటా వచ్చింది.
జియో నికర లాభం రూ.4,716 కోట్లు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం యూనిట్ జియో ఇన్ఫోకామ్‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రూ. 4,716 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.6,638 కోట్లతో పోలిస్తే ఈసారి కంపెనీ నికర లాభం 13 శాతం పెరిగింది. రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.20,901 కోట్ల నుంచి రూ.23,394 కోట్ల (స్టాండ్ ఎలోన్) కు చేరుకుంది. కిందటేడాది డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో జియో ఇన్ఫోకామ్‌కు రూ.22,998 కోట్ల రెవెన్యూ వచ్చింది. కంపెనీ ఇబిటా క్యూ4 లో రూ.12,210 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో ఇది రూ.10,554 కోట్లుగా ఉంది. జియో ఇబిటా ఏడాది ప్రాతిపదికన 16 శాతం, క్వార్టర్ ప్రాతిపదికన 2 శాతం పెరిగింది. కంపెనీ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) క్యూ4 లో రూ.178.8 గా రికార్డయ్యింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో ఇది 178.2 గా ఉంది.