చెరకుమట్టిని సేకరించనున్న రిలయన్స్​

చెరకుమట్టిని సేకరించనున్న రిలయన్స్​
  • కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి కోసం

న్యూఢిల్లీ :  కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తికి కీలకమైన చెరకుమట్టిని సేకరించే పనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  పడింది. ఇందుకోసం చక్కెర మిల్లు నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నది.  బయోగ్యాస్ ప్లాంట్‌‌‌‌ల కోసం కంపెనీకి రోజూ వేల టన్నుల మట్టిని సరఫరా చేయగల పెద్ద చక్కెర మిల్లులతో మాట్లాడుతోందని నేషనల్​ మీడియా వెల్లడించింది.  దేశంలోని వివిధ ప్రాంతాల్లో చక్కెర మిల్లులను నిర్వహిస్తున్న కంపెనీలతో రిలయన్స్​ ఎగ్జిక్యూటివ్స్​ చర్చిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో రిలయన్స్​ చైర్‌‌‌‌పర్సన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో వ్యవసాయ వ్యర్థాలను గ్యాస్‌‌‌‌గా మార్చడానికి 100 సీబీజీ ప్లాంట్‌‌‌‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ ప్లాంట్లు 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ,  సేంద్రీయ వ్యర్థాలను వినియోగిస్తాయని అంచనా.

రిలయన్స్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని బారాబంకీలో వాణిజ్య-స్థాయి సీబీజీ ప్లాంట్‌‌‌‌ను నిర్వహిస్తోంది. ఇది కేవలం 10 నెలల రికార్డు సమయంలో ప్రారంభమైంది. గుజరాత్ జామ్‌‌‌‌నగర్‌‌‌‌లో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) కోసం రెండు డెమో యూనిట్లను కూడా ఏర్పాటు చేసింది.  రాబోయే 5 సంవత్సరాలలో 100 సీబీజీ ప్లాంట్‌‌‌‌లను నెలకొల్పడం తమ లక్ష్యమని, ఇందుకోసం 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ,  సేంద్రీయ వ్యర్థాలను వినియోగిస్తామని ముకేశ్​అంబానీ అన్నారు. తద్వారా దాదాపు 2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించి, ఏటా 2.5 మిలియన్ టన్నుల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేస్తామని ఆయన చెప్పారు. తమ కంపెనీ భారతదేశంలోనే అతిపెద్ద బయో-ఎనర్జీ ఉత్పత్తిదారుగా అవతరించిందని ప్రకటించారు.