
- సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకార సమయంలోనే పనులు
- గ్రిల్స్‌ను జేసీబీ సాయంతో తొలగించిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది
- అక్కడ సెల్ఫీలు దిగేందుకు జనం పోటీ.. స్వీట్లు పంచుకున్న మరి కొందరు
- కంచె తొలగింపు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
ఖైరతాబాద్, హైదరాబాద్, వెలుగు : ప్రగతి భవన్ ఎదుట నడి రోడ్డుపై పెట్టిన ఇనుప కంచెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీయించేశారు. ఓవైపు సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. మరోవైపు ఇనుప కంచెను తొలగించడాన్ని జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రారంభించారు. గ్రిల్స్‌ను గ్యాస్ కట్టర్లు, జేసీబీ, డోజర్ సాయంతో కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దొర గడీలు బద్ధలు అవుతున్నాయంటూ చాలా మంది పోస్టులు పెట్టారు. అటువైపున రోడ్డుపై వెళ్లే వాళ్లు అక్కడ ఆగి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. కొంత మంది స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.
2016లో నిర్మాణం
హైదరాబాద్ బేగంపేటలోని ప్రధాన రహదారిపై ప్రగతి భవన్ ఎదుట 30 అడుగుల వెడల్పు, సుమారు 20 అడుగుల ఎత్తుతో 2016లో ఈ గ్రిల్స్‌ను నిర్మించారు. కేసీఆర్, కేటీఆర్ పర్మిషన్ లేకుండా మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఈ కంచె దాటి లోపలికి రానిచ్చేవారు కాదు. ప్రగతి భవన్ వద్ద కాపలాగా ఉన్న కానిస్టేబుల్స్.. పర్మిషన్ లేదని చెప్పి హోంమంత్రి మహమూద్ అలీని వెనక్కి పంపించినఘటన అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ వంటి ఎంతో మంది ప్రముఖులకు సైతం ఇదే తరహా అవమానం ఎదురైంది.
ఈ ఇనుప కంచెల వద్దే గద్దర్ గంటల తరబడి ఎదురుచూడడం ఎంతో మందిని కలిచి వేసింది. ఎంతో మంది సామాన్యులు కేసీఆర్‌ను కలిసి తమ కష్టాలను చెప్పుకోవడానికి వెళ్లినప్పుడు వారిని పోలీసులు బయటే ఆపేశారు. కనీసం సీఎం నివాసం కూడా కనిపించకుండా ఈ నిర్మాణం చేపట్టారు. అత్యంత రద్దీగా ఉండే చోట ఈ కంచె ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యేది. ప్రస్తుతం కంచెను తొలగించడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.
ప్రమాణ స్వీకారానికి ముందే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్ధలు కొడుతామని, ప్రగతిభవన్‌ను ప్రజా భవన్‌గా మారుస్తామని గతంలో రేవంత్‌రెడ్డి అనేకసార్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి ముందే కంచెలు తొలగించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. దీంతో గురువారం ఉదయమే పంజాగుట్ట పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది
జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు. తొలగింపు పనులు ప్రారంభించారు. మూడు జేసీబీలు, ఒక క్రేన్, డోజర్ సహాయంతో ప్రధాన గేటుకు ఎదురుగా ఉన్న ఇనుప గ్రిల్స్, బారికేడ్లను తొలగించారు. వీటిని లారీల్లో మరో చోటికి తరలించారు. ప్రగతిభవన్ లోపలున్న పరుపులను లారీలతో తరలించారు.