రికాం లేకుండా కాల్స్! ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంతో ఓటర్లకు చుక్కలు

రికాం లేకుండా కాల్స్! ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంతో ఓటర్లకు చుక్కలు
  • ఉదయం నుంచి రాత్రి దాకా పదే పదే వాయిస్ కాల్స్, మెసేజ్లు 
  • ప్రైవేట్ వ్యక్తులకు ఫోన్ నంబర్లు వెళ్లడంపై గ్రాడ్యుయేట్ల ఆందోళన 
  • పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో  స్పీడ్ పెంచిన అభ్యర్థులు

ఆదిలాబాద్ , వెలుగు: ‘‘హలో నేను మీ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు నాకే వేయండి. బ్యాలెట్ పేపర్లో నా నంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి’’ అంటూ రోజూ ఉదయం నుంచి రాత్రి దాకా పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్లకు కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయి. దీంతో పోటీ చేసిన అభ్యర్థుల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయలేక ఓటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ అభ్యర్థికి ఫోన్ నంబర్ ఇవ్వలేదని.. ఇలా  కాల్స్ చేయడం ఏంటని పలువురు ఓటర్లు ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాపై ఎక్కువగా ఫోకస్
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారానికి మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రధానంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ పై ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల నుంచి ఓటర్లకు వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ద్వారానే కాకుండా నేరుగా ఫోన్ కాల్స్  వస్తున్నాయి. ఇలా వస్తుండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.  వచ్చే కాల్స్‌‌‌‌, మెసేజ్ ల్లో ఏవైనా ఇంపార్టెంట్ అనుకొని లిఫ్ట్ చేస్తుండడంతో సరిగా పనులు చేసుకోలేకపోతున్నామని, చిరాకు వస్తుందని పలువురు ఓటర్లు చెబుతున్నారు.

గోప్యంగా ఉంచాల్సింది పోయి..
ఓటర్లు  విద్యావంతులే అయినా వారి అనుమతి లేకుండానే ప్రైవేట్ వ్యక్తులకు ఫోన్ నంబర్లు వెళ్లడంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో 3.59 లక్షల మంది గ్రాడ్యుయేట్, 28 వేల మంది టీచర్ ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు సమయంలో ఫోన్ నంబర్లను ఎలక్షన్ వెబ్ సైట్ తో పాటు ఆఫ్ లైన్ లో మాన్యువల్ గా  ఇచ్చారు. అయితే.. అధికారికంగా నంబర్ గోప్యంగా ఉంచాలి.  కాగా.. ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎలా వెళ్లాయనే సందేహం వస్తుంది.  పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్ల వివరాలు తెలుకునేందుకు అక్రమంగా కొనుగోలు చేసి ఉండొచ్చని పేర్కొంటున్నారు.

ఫోన్ నంబర్ మిస్ యూజ్పై ఆందోళన 
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం లక్షలాది మంది ఓటర్ల ఫోన్ నంబర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో ఎక్కడ దుర్వినియోగమవుతా యోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వివిధ వ్యాపార ప్రకటనలు, ఇతరత్రా అవసరాల కోసం వాడుకునే అవకాశం లేకపోలేదనే అనుమానిస్తున్నారు. ఫోన్ కాల్స్ చేసి సైబర్ నేరాలకు పాల్పడే చాన్స్ ఉండొచ్చనే భయందోళనలో పడిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచార కాల్స్ కొందరు ఓటర్లు బ్లాక్ చేస్తున్నప్పటికీ వేర్వేరు నంబర్లతో పదే పదే కాల్స్ వస్తుండడంతో లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని కూడా వదిలేస్తున్నారు.