ఐఅండ్ పీఆర్ లో ఏం జరిగింది?..500 కోట్ల వరకు మిస్ యూజ్ అయినట్లు టాక్!

ఐఅండ్ పీఆర్ లో  ఏం జరిగింది?..500 కోట్ల వరకు మిస్ యూజ్ అయినట్లు టాక్!
  • ఎన్నికల వేళ నిధుల దుర్వినియోగం
  • అప్పటి అధికార పార్టీకి అధికారుల మద్దతు
  • రూల్స్ కు విరుద్ధంగా సోషల్ మీడియాకు యాడ్స్!
  • డిజిటల్ మీడియా పేరుతో భారీగా ఫండ్స్ డైవర్షన్?
  • 500 కోట్ల వరకు మిస్ యూజ్ అయినట్లు టాక్!
  • జాతీయ రాజకీయాల పేరుతో హిందీ, ఇంగ్లీషు, పొరుగు రాష్ట్రాల పత్రికలకు భారీ ఎత్తున ప్రకటనలు
  • సొంత మీడియాకూ నిధుల ధారాదత్తం
  • ఇప్పుడు విషయం బయటికి పొక్కకుండా ఆశాఖలో తప్పించిన ఉన్నతాధికారులు
  • సమాచార శాఖలో అక్రమాలపై సీఎం రేవంత్ ఆరా!

హైదరాబాద్: రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖలో అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో ఆ శాఖలో తిష్టవేసిన కొందరు ఉన్నతాధికారులు గులాబీ పార్టీకి మద్దతుగా విచ్చలవిడిగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అప్పటి అధికార పార్టీకి మద్దతుగా నిలిచిన మీడియా చానెళ్లు, పేపర్లకే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకూ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేసినట్టు సమాచారం. డిజిటల్ మీడియా పేరుతో భారీగా ఫండ్స్ డైవర్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఫేస్ బుక్  పేజీలు, గ్రూపులు, యూట్యూబ్ చానెళ్ల వారికీ పెద్ద ఎత్తున నజరానాలు సైతం అందించినట్టు జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ ప్రచారం కోసం ప్రజాధనం వినియోగించడంపై జోరుగా విమర్శలు వెల్లువెత్తాయి. 

500 కోట్ల వరకు మిస్  యూజ్

రెండు పర్యాయాల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రకటనలు గుమ్మరించింది. ముఖ్యంగా జాతీయ రాజకీయాలకు కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించడం.. ఆ తర్వాత పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ దేశానికే టార్చ్ బేరర్, రోల్ మోడల్ అంటూ  కోట్లాది రూపాయల హిందీ, ఇంగ్లీషు, ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పత్రికలకు, చానెళ్లకు ప్రకటనలు ఇచ్చారు.  పథకాలు ప్రజలకు చేరాలనే పేరుతో పొరుగు రాష్ట్రాల్లో ప్రకటనలు ఇచ్చారు. అదే సమయంలో ఐ అండ్ పీఆర్ లో అవినీతి రాజ్యమేలింది. ఔట్ డోర్ మీడియాతో కలుపుకొని గడిచిన 5 ఏళ్లలోనే ఐదు వందల కోట్ల స్కాం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి

కేసీఆర్ జాతీయ రాజకీయాల సమయంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, బెంగాల్, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల లోకల్ పత్రికలకు యాడ్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ దేశం మొత్తం వెలిగేలా.. ప్రజల సొమ్ముతో ప్రకటనలు గుప్పించారు. కొన్ని పత్రికలకు ఒక్కో యాడ్ కు రూ. 4 కోట్ల నుంచి మూడున్నర కోట్ల వరకు ముట్టజెప్పారు. ఔట్ డోర్ మీడియాకు పార్టీ యాడ్స్ లా ప్రభుత్వ ప్రకటనలను వాడారు. నంబర్ వన్ పేపర్ కి కోటి రూపాయల యాడ్ అని ఆర్వో రిలీజ్ అయితే.. ఏజెన్సీకి కోటి వచ్చినా.. యాజమాన్యానికి మాత్రం 40 లక్షలే చేరేది. ఇలా చాలా రాష్ట్రాల పేపర్స్ కి, టీవీలకు రిలీజ్ అయిన సొమ్ములో మిగతా డబ్బులు ఎవరు నొక్కేశారనే అంశాలపైనా రహస్యంగా విచారణ జరుగుతోంది. 

డిజిటల్ మీడియా పేరిట

డిజిటల్ మీడియా పేరుతోనూ భారీగా నిధుల దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది.  ఏపీలో మాదిరిగా తెలంగాణలో డిజిటల్ మీడియా కార్పొరేషన్ లేదు. ఇక్కడి యూట్యూబ్ చానెళ్లకు ఆన్లైన్ పత్రికలకు, వెబ్ సైట్లకు ప్రకటనలు ఇవ్వడానికి సంబంధించిన విధి విధానాలు లేవు. అయినా నిబంధనలకు పాతరేసి నిధులకు బాటలు వేశారనే విమర్శలున్నాయి. గులాబీ పార్టీ కనుసన్నల్లో ఉండే యూట్యూబర్లకు, ఫేస్ బుక్ పేజీలు మెయింటేన్ చేసే వాళ్లకు, ఇన్ స్టాలో రీల్స్ చేసే వాళ్లకు వివిధ మార్గాల ద్వారా డబ్బులు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.  సొంత మీడియాకూ భారీగా ప్రకటనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అవసరం లేని, అంతగా ప్రాధాన్యం లేని సందర్భాల్లోనూ ప్రకటనలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. వాటన్నింటినీ రేవంత్ సర్కారు సీరియస్ గా తీసుకొని విచారణ చేయిస్తున్నట్టు సమాచారం. అసలు విషయం బయటపడితే దోషులెవరో తేలిపోనుంది.