చంద్రబాబు జైలులో ఉండమే మంచిది: హౌస్ అరెస్టుపై సీఐడీ

చంద్రబాబు జైలులో ఉండమే మంచిది: హౌస్ అరెస్టుపై సీఐడీ

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ అవినీతి కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబుకు బెయిల్ కోరుతూ.. విజయవాడ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ఆయన తరపు లాయర్లు. చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని.. ఆయన ప్రాణాలకు హాని ఉందని.. ఆయన్ను హౌస్ అరెస్ట్ లో ఉంచాలని.. గెస్ట్ హౌస్ లేదా మరో ప్రాంతంలో ఇంట్లో ఉంచాలని కోర్టును కోరారు చంద్రబాబు తరపు లాయర్లు. ఆయన మాజీ సీఎం అని.. ఇప్పటికే కేంద్ర బలగాల రక్షణలో ఉన్నారని.. అలాంటి వీవీఐపీని కరుడుగట్టిన నేరస్తులు ఉంటే జైల్లో ఉంచటం సురక్షితం కాదంటూ తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం సైతం బాగోలేదని.. 74 ఏళ్ల వయస్సు అని.. ఆయన్ను మానవత్వంతో హౌస్ అరెస్టుకు అనుమతించాలని కోరారు ఆయన తరపు లాయర్లు.

దీనిపై సీఐడీ తరపు లాయర్లు తమ వాదన వినిపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుందని.. చంద్రబాబుకు కోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక గదిని కేటాయించటంతోపాటు.. ఆయన రక్షణ కోసం జైలు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. ఇంటి భోజనం, మందులతోపాటు ఆయనకు ఏం కావాలన్నా అన్నీ సమకూర్చటానికి జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారని.. వైద్యులను కూడా అందుబాటులో ఉంటాచమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సీఐడీ తరపు లాయర్లు. 

చంద్రబాబు హౌస్ అరెస్ట్ కంటే జైలులోనే సురక్షితంగా.. భద్రంగా ఉంటారని కోర్టుకు వివరించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో 50 అడుగుల మేర ప్రహరీ గోడ ఉందని.. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని.. చంద్రబాబు భద్రత విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని.. కోర్టు ఆదేశాలతో అన్నీ చక్కగా జరుగుతున్నాయని.. హౌస్ అరెస్టు అవసరం లేదని వాదించారు సీఐడీ లాయర్లు.