మీరొద్దు.. మీదేశమూ వద్దు: భార్యా పిల్లలతో కలిసి దేశాన్ని వీడిన పాక్ క్రికెటర్

మీరొద్దు.. మీదేశమూ వద్దు: భార్యా పిల్లలతో కలిసి దేశాన్ని వీడిన పాక్ క్రికెటర్

ఒకవైపు పెళ్లిళ్లు.. మరోవైపు వలసలు.. పాకిస్తాన్ క్రికెటర్లు ఆ దేశ క్రికెట్ బోర్డుకు షాకులు మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే షోయబ్ మాలిక్(Shoaib Malik) పెళ్లితో ప్రపంచమంతా పాకిస్తాన్ క్రికెటర్ల గురించే మాట్లాడుతుంటే, ఇంతలోనే ఆ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed) మరో బాంబు పేల్చాడు. జట్టులో తన స్థానంపై అనిశ్చితి నెలకొనడంతో సర్ఫరాజ్ భార్యా పిల్లలతో కలిసి దేశాన్ని విడిచిపెట్టాడు.

నివేదికల ప్రకారం.. సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్‌ను విడిచిపెట్టి వెళ్లినట్లు తెలుస్తోంది. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అతడు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌కు చేరుకున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జట్టులో తన స్థానంపై స్పష్టతలేకపోవడంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా కోడై కూస్తోంది. లండన్‌లో ఉంటూ నాలుగేళ్ళ పాటు కౌంటీ క్రికెట్ ఆడితే.. ఆ తరువాత ఇంగ్లీష్ పౌరసత్వం పుచ్చుకొని ఇంగ్లాండ్ జట్టుకు ఆడొచ్చనేది అతని ఆలోచనట.

Also Read : Shoaib Malik: విడాకులు ఏకపక్షం! షోయబ్ పెళ్లిపై సానియా మీర్జా తండ్రి కీలక వ్యాఖ్యలు
 

పాకిస్తాన్ సూపర్ లీగ్

సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ క్రికెట్‌తో తన బంధాన్ని తెంచుకున్నప్పటికీ.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడతాడని క్వెట్టా గ్లాడియేటర్స్‌ యాజమాన్యం తెలిపింది. అతడే తమ జట్టు కెప్టెన్ అని క్వెట్టా మేనేజ్మెంట్ ప్రకటన చేసింది. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా  సర్ఫరాజ్ పాకిస్తాన్‌ జట్టుకు విశేషమైన సేవలందించాడు. అతని కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. సర్ఫరాజ్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆడాడు.