భారత్‌తో చివరి మ్యాచ్..అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న మాజీ కెప్టెన్

భారత్‌తో చివరి మ్యాచ్..అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న మాజీ కెప్టెన్

దక్షిణాఫ్రికా ఓపెనర్, మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఈ  విషయాన్ని ఎల్గర్ స్వయంగా వెల్లడించకపోయినా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ర్యాపోర్ట్ వార్తాపత్రిక ఎల్గర్ తన రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడని..భారత్ తో జరిగే టెస్టు సిరీస్ తర్వాత ఈ వెటరన్ ప్లేయర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడని తెలిపింది.  ఇందులో భాగంగా టెస్ట్ కోచ్ షుక్రి కాన్రాడ్ తో ఎల్గర్ ఇకపై టెస్టు క్రికెట్ లో కొనసాగటం కష్టం అన్నట్లుగా ఈ వార్తా పత్రిక తెలిపింది. 

2012 లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఎల్గర్.. దశాబ్దకాలంగా దక్షిణాఫ్రికా టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2023 ఫిబ్రవరిలో ఈ లెఫ్ట్ హ్యాండర్ తన కెప్టెన్సీని కోల్పోయాడు. ఎల్గర్ స్థానంలో బవుమాకు కెప్టెన్సీ దక్కింది. 2024లో న్యూజీలాండ్ తో జరగబోయే సిరీస్ కు కెప్టెన్సీ చేయాలనుకున్నా అది జరగడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది. భారత్ తో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ లో ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు జరగనుంది.        

2018లో ఎల్గర్ తాను దక్షిణాఫ్రికా జట్టుకు చేసిన సేవలకు తనకు తగినంత గుర్తింపు లభించలేదని.. అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తనకు, దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులకు మధ్య పెద్దగా సంబంధం ఉందని అనుకోవట్లేదని.. నేను చేసిన పనిని కార్పెట్ కింద బ్రష్ చేశారని.. తనలాంటి క్రికెటర్లు దక్షిణాఫ్రికా క్రికెట్ అవసరమని సూచించాడు.
  
టెస్ట్ స్పెషలిస్ట్ గా జట్టులో స్థానాన్ని స్థిరం చేసుకున్న ఈ 36 ఏళ్ళ బ్యాటర్.. దక్షిణాఫ్రికా తరఫున 84 టెస్టుల్లో 37.28 సగటుతో 5146 పరుగులు చేశాడు. 13 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఎల్గర్ ఖాతాలో ఉన్నాయి. ఇక 8 వన్డేలు మాత్రమే ఆడిన ఈ స్టార్ ఓపెనర్ కేవలం 104 పరుగులు మాత్రమే చేసి జట్టులో స్థానం కోల్పోయాడు.