IPL 2024: పూర్తిగా కోలుకొని రిషబ్ పంత్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి

IPL 2024: పూర్తిగా కోలుకొని రిషబ్ పంత్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి

భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిషబ్ పంత్ త్వరలోనే మీ ముందుకు రానున్నారు. కారు ప్రమాదం కారణంగా దాదాపు ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్ ఐపీఎల్ 2024 లో కనిపించనున్నారు. అయితే పూర్తిస్థాయిలో మాత్రం కాదు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా పంత్‌ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడని రెవ్‌స్పోర్ట్జ్ కథనాన్ని ప్రచురించింది. ఢిల్లీ జట్టులో అతడు తిరిగి చేరతాడు కానీ వికెట్ల వెనుక సేవలందించడని పేర్కొంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఈ విషయమై ఢిల్లీ యాజమాన్యం.. కోచ్ రికీ పాంటింగ్, టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీలతో చర్చించినట్లు పేర్కొంది. దీనిపై ఢిల్లీ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఈ వార్తలు మాత్రం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

కింద నుండి రెండో స్థానం

పంత్‌ గైర్హాజరీతో గత సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతని కెప్టెన్సీలో ఢిల్లీ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింట విజయం సాధించింది. దీంతో లీగ్‌ దశలోనే నిష్క్రమించడమే కాకుండా పాయింట్ల పట్టికలో కింద నుండి రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ పంత్‌ తిరిగి జట్టులో చేరినా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టకపోతే మరోసారి వార్నర్ సారథిగా కొనసాగే అవకాశముంది. 

ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 98 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 2838 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 15 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే, అతని ఖాతాలో 64 క్యాచ్‌లు, ఆరు రనౌట్లు, 18 స్టంపింగ్‌లు ఉన్నాయి.