ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల?

 ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల?
  • రేపు సోనియా, రాహుల్, ఖర్గేతో ఏపీ కాంగ్రెస్ లీడర్ల సమావేశం
  • జనవరి ఫస్ట్ రోజు ప్రకటించే చాన్స్!
  • వైఎస్సార్టీపీ విలీనంపైనే అదే రోజు  ప్రకటన?
  • పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మార్పులు
  • సౌత్ పై ప్రధానంగా దృష్టి పెట్టిన హస్తం పార్టీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే సూచనలున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఏపీ వ్యవహారాలపై దృష్టిపెట్టింది. ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కొత్త ఇన్ చార్జిని నియమించిన విషయం తెలిసిందే.  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఒక్క ఏపీ మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఉంది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడగా, కేరళ, తమిళనాడులో ఇండియా కూటమి పార్టీలే అధికారంలో ఉన్నాయి. ఏపీలో ఖాతా తెరిచేందుకు కాంగ్రెస్ కష్టపడుతోంది.

రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కాంగ్రెస్ హవా నడిచింది. రాష్ట్ర విభజన తర్వాత అక్కడ హస్తం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి కాంగ్రెస్ క్యాడర్ వైసీపీకి షిఫ్ట్ అయ్యింది. అధికార వైసీపీని, ప్రతిపక్ష టీడీపీని ఢీకొట్టే సత్తా దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలకు ఉందని భావిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం ఆమెకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో మొదట కాంగ్రెస్ ఏపీ వ్యవహరాల ఇన్ చార్జిగా మాణిక్కం ఠాకూర్ ను నియమించింది. పార్టీకి పూర్వవైభవం తేవడం, దక్షిణభారతాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఏఐసీసీ వ్యూహాలు రచిస్తోంది.  

27న ఏపీ కాంగ్రెస్ నేతలతో మీటింగ్

ఈ నెల 27న ఏఐసీసీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించనుంది. ఏఐసీసీ చీఫ్​ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ ఏపీ నేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే ఎన్నికలపై చర్చించడంతోపాటు మార్పులపైనా చర్చించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించాలని అధినాయకత్వం ఇప్పటికే  నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్ నేతలకు వివరించి సమన్వయంతో సాగాలని సూచించనున్నట్టు సమాచారం.  ఈ నూతన సంవత్సరం రోజునే దీనిపై అధికారిక ప్రకటన వెలువనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో గతంలో షర్మిల చర్చలు జరిపారు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే, ఆమె సేవలను అధిష్టానం ఏపీలో వాడుకోవాలని చూడగా.. షర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు. ఏపీలో వైఎస్‌ఆర్‌కు ఉన్న క్రేజ్‌‌ను వాడుకొని మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని, అందులో భాగంగానే షర్మిలు పగ్గాలు ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలు భావిస్తున్నారు.