బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి : ఆర్.కృష్ణయ్య

బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి : ఆర్.కృష్ణయ్య

ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ 

ముషీరాబాద్, వెలుగు: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం పరిమితి తొలగిపోయిందని, వెంటనే బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం కాచిగూడలోని ఓ హోటల్​లో 14 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ముత్యం వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.

 రిజర్వేషన్లపై విధించిన గరిష్ఠ పరిమితి 50 శాతాన్ని సుప్రీంకోర్టు తొలగించిందని, ఇక న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. కులాల వారీగా జనగణన చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీ యాక్ట్ తీసుకురావాలన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేశ్​యాదవ్ తదితరులు పాల్గొన్నారు.