
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రిటైల్ధరలు గత నెల తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో దాదాపు 6 సంవత్సరాల కనిష్ట స్థాయి 3.16 శాతానికి తగ్గింది. ప్రధానంగా కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు ఇతర ప్రోటీన్ ఆహారాల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో 3.34 శాతంగా, గత ఏప్రిల్‌లో 4.83 శాతంగా ఉంది. ఇది 2019 జులైలో 3.15 శాతంగా రికార్డయింది. ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 1.78 శాతంగా ఉంది. ఇది గత నెలలో 2.69 శాతంగా, గత సంవత్సరం ఇదే నెలలో 8.7 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం 4 శాతం వద్ద ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్‌పై ఉంది. ధరలు అదుపులోకి రావడంతో ఇటీవల కీలక వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి సీపీఐ ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా అంచనా వేసింది.