
- రిటైర్డ్ ఎస్సై చొరవతో సైన్ బోర్డు ఏర్పాటు
ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వరంగల్ -కరీంనగర్ హైవే ఎన్ హెచ్563, సిద్దిపేట –- ఎల్కతుర్తి హైవే 765 లను కలిపే జంక్షన్ ను రూ. 3.3 కోట్ల కుడా (కాకతీయ పట్టాణాభివృద్ధి సంస్థ) నిధులతో, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఇటీవల ఆధునీకరించారు. సంబంధిత అధికారులు అక్కడ సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసినా విద్యుత్ సరఫరా ఇవ్వలేదు. ఈ మార్గం ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఏ దారి ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి.
పగటి వేళల్లో వాహనాల డ్రైవర్లు వాహనాలను ఆపి, స్థానికులను అడిగి గమ్యస్థానాలకు వెళ్తుండగా, కొందరు దారి తప్పి కొంత దూరం వెళ్లాక కనిపించిన వారిని అడిగి మళ్లీ వెనక్కి తిరిగి వస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో రిటైర్డ్ ఏఎస్సై కటకం సంపత్ స్పందించారు. జంక్షన్ నిర్మాణ సమయంలో తొలగించి, పక్కన పడేసిన సూచిక బోర్డులను ఆటో డ్రైవర్ల సహాయంతో తీసుకొచ్చి అక్కడ అమర్చారు. ఆర్అండ్ బీ, 'కుడా' అధికారులు చేయాల్సిన పనిని రిటైర్డ్ ఏఎస్సై చేయడంపై వాహనదారులు, స్థానికులు అభినందించారు.