- మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్నా వినిపించుకోలే
- మా రిపోర్టును పక్కనపెట్టి ఆయనకు నచ్చినట్లు చేసిండు
- జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు రిటైర్డ్ ఇంజనీర్ల వెల్లడి
- తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడ్తేనే మేలని చెప్తే మేడిగడ్డ వద్ద కట్టిండు
- మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తే సమస్యలని కూడా చెప్పినం
- పైగా ఖర్చుతో కూడుకున్నదని రిపోర్టులో ప్రస్తావించినట్లు వివరణ
- కాళేశ్వరం ఏజెన్సీలు, సబ్ కాంట్రాక్టర్ల ఆర్థిక లావాదేవీలపైనా జస్టిస్ ఘోష్ కమిషన్ ఫోకస్
హైదరాబాద్, వెలుగు : తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడ్తేనే ప్రయోజనమంటూ తాము ఇచ్చిన రిపోర్టును కేసీఆర్ పక్కనపెట్టేశారని, తనకు నచ్చినట్టు మేడిగడ్డ వద్దే బ్యారేజీ నిర్మాణానికి పట్టుబట్టారని రిటైర్డ్ ఇంజినీర్లు వెల్లడించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయని, పైగా ఖర్చుతో కూడుకున్నదని చెప్పినా ఆయన వినిపించుకోలేదన్నారు. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ఎదుట నలుగురు రిటైర్డ్ ఇంజనీర్లు వివరణ ఇచ్చారు. ఈ నలుగురు అప్పటి బీఆర్ఎస్ సర్కారు వేసిన అనంత రాములు కమిటీ సభ్యులే. ప్రాణహిత-- చేవెళ్ల రీ డిజైన్‌లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని భావించిన కేసీఆర్.. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై 2015లో ఐదుగురు రిటైర్డ్ ఇంజనీర్లు అనంతరాములు, వెంకటరామారావు, చంద్రమౌళి, దామోదర్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డితో కమిటీని వేశారు.
ఆ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి అప్పట్లోనే రిపోర్ట్‌ను ఇచ్చింది. కానీ, నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆ రిపోర్టును పట్టించుకోలేదు.. బయటపెట్టలేదు. కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ జ్యుడీషియల్ కమిషన్ ముందు శనివారం రిటైర్డ్ ఇంజినీర్లు అనంతరాములు, వెంకటరామారావు, చంద్రమౌళి, దామోదర్‌రెడ్డి హాజరయ్యారు. బీఆర్కే భవన్లో జరిగిన ఈ విచారణలో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వానికి తాము ఇచ్చిన రిపోర్టును కమిషన్ ముందు వాళ్లు ఉంచారు. నాటి విషయాలను కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్‌కు వివరించారు. వివిధ కారణాలతో రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి ఈ విచారణకు హాజరు కాలేదు.
‘‘తుమ్మిడిహెట్టి వద్ద ఏడాదిపొడవునా ప్రాణహిత జలాల లభ్యత, తక్కువ ఎత్తుకు ఎత్తిపోయడం, గ్రావిటీ ద్వారా నీటిని తరలించే వీలు ఉండడం, అప్పటికే కొంతమేర కెనాల్ వర్క్స్ పూర్తికావడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అక్కడే ప్రాజెక్టు నిర్మిస్తే అన్ని విధాలా ప్రయోజనం అని మేము రిపోర్టు ఇచ్చాం. కానీ.. అప్పటి సీఎంకు, అప్పటి ఇరిగేషన్ మంత్రికి ఇది ఇష్టం లేదు. అందుకే మా రిపోర్ట్‌ను పక్కనపెట్టి మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టి, ప్రాణహిత నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు” అని కమిషన్ చైర్మన్‌కు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
పిలిస్తే ఎవరైనా రావాల్సిందే..
తాము విచారణకు పిలిస్తే ఎవరైనా సరే రావాల్సిందేనని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే తేల్చిచెప్పారు. విచారణకు పిలిచే అధికారం కమిషన్‌కు ఉందని, ఒకవేళ ఎవరైనా తమ ఆదేశాలను ధిక్కరిస్తే రూల్‌బుక్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్తున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీకి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతులు తీసుకున్నట్లు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అన్ని అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక అవసరమైతే సీడబ్ల్యూసీ ఆఫీసర్లను కూడా విచారణకు పిలుస్తామని ఘోష్ అన్నట్లు సమాచారం.
ఈ నెల 27 లేదా 28వ తేదీ నాటికి ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల నుంచి అఫిడవిట్లు అన్నీ వచ్చేస్తాయని భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతానికి కాళేశ్వరంలో వివిధ స్థాయిల్లో పనిచేసిన ఇంజనీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించిన కమిషన్.. ఏఈఈలు, డీఈఈలను కూడా విచారించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అఫిడవిట్లు, రిపోర్టులు చేతికి అందాక వాటిని స్టడీ చేసి తర్వాతి దశ ఎంక్వైరీ మొదలుపెట్టాలని ఘోష్ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, విజిలెన్స్ రిపోర్టును వీలైనంత త్వరగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కోఆరు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి నివేదికను అతిత్వరలో అందించేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమవుతున్నారు.
సబ్ కాంట్రాక్ట్ సంస్థలపై ఆరా
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ బాధ్యతలను వివిధ ఏజెన్సీలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా, పనులు దక్కించుకున్న ప్రధాన ఏజెన్సీలన్నీ వివిధ సంస్థలకు సబ్ కాంట్రాక్టులిచ్చాయి. మూడు బ్యారేజీల నిర్మాణానికి ఏకంగా 10 నుంచి 15 సబ్ కాంట్రాక్ట్ సంస్థలు పనిచేసినట్టు జస్టిస్ ఘోష్ కమిషన్‌కు సమాచారం ఉంది. ఈ క్రమంలో ప్రధాన ఏజెన్సీలతో పాటు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థల వివరాలు, వాటి ఆర్థిక లావాదేవీలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది.
ఏయే టైంలో ఏయే సంస్థకు ఎన్ని నిధులు వెళ్లాయి? ఆయా సంస్థల నుంచి సబ్ కాంట్రాక్ట్ సంస్థలకు మళ్లిన నిధులెన్ని? ఎన్ని వందల కోట్లు చేతులు మారాయి? అన్న అంశాలపై ఆయన లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అడగాలని కమిషన్ నిర్ణయించినట్టు తెలిసింది. ఒకవేళ వాళ్ల నుంచి డిటెయిల్స్ రాకుంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ఆ వివరాలను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.