- మంచిర్యాల జిల్లా కేంద్రంలో రిటైర్డ్ పోలీస్ ల్యాండ్ స్కామ్
- గర్మిళ్ల శివారు 115/4 సర్వేనంబర్‌లో 3 ఎకరాలు కబ్జా
- ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ర్టేషన్లు, ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్
- ప్లాట్లు చేసి అమ్ముకున్నా పట్టించుకోని యంత్రాంగం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం గర్మిళ్ల శివారు గోపాల్వాడలో అత్యంత ఖరీదైన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ రిటైర్డ్ కానిస్టేబుల్ బోగస్ డాక్యుమెంట్లతో కొట్టేశాడు. ఆపై ప్లాట్లు చేసి గజాల లెక్కన అమ్ముకుంటూ కోట్లలో సొమ్ము చేసుకుంటున్నాడు. అందులో ప్లాట్లు కొన్నవారు ఫేక్ డాక్యుమెంట్లతో ఎల్ఆర్ఎస్కు అప్లై చేసుకోవడం, సంబంధిత అధికారులు కండ్లు మూసుకొని ప్రొసీడింగ్స్ జారీ చేయడం చకచకా జరిగిపోతున్నాయి.
మరోవైపు అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా అడ్డుకునే నాథుడు లేడు. దీనిపై ఇటు రెవెన్యూ, అటు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా....
రెవెన్యూ రికార్డుల ప్రకారం, గర్మిళ్ల శివారులోని 115 సర్వేనంబర్‌లో మొత్తం 12.17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1954-–55 ఖాస్రా పహాణీ నుంచి 1981–-82 వరకు సర్కారీ బంచరాయి భూమిగా నమోదైంది. 1982-–83 నుంచి 1986–-87 వరకు రికార్డులు లేవు. 1987–-88 నుంచి 1994–-95 వరకు 115 సర్వేనంబర్‌లో 9.37 ఎకరాలు సర్కారీ బంచరాయి, 115/1 సర్వేనంబర్‌లో 2 ఎకరాలు పెద్దల కొమురయ్య, 115/2లో మరో 2 ఎకరాలు ధర్ని భీమయ్య పేరిట లావుని పట్టాగా రికార్డయింది.1997-–98 నుంచి 2002–-03 వరకు115 సర్వేనంబర్‌లో ఉన్న 9.37 ఎకరాల నుంచి 3 ఎకరాలు మల్లెపూల నారాయణ పేరిట 115/4 సర్వేనంబర్ లావుని పట్టాగా రికార్డుల్లో ఉంది. నారాయణకు 3 ఎకరాలు ఎట్లా అసైన్డ్ అయ్యిందో ఎలాంటి వివరాలు లేవు. అసైన్మెంట్ రిజిస్టర్లోనూ ఆయన పేరు లేదు. 2005–-06 నుంచి 2010-–11మధ్య 115/4 సర్వేనంబర్‌లో నారాయణ పేరిట ఉన్న 3 ఎకరాలు జుట్టు గంగాధర్ పేరు మీదకు మారింది.
ఇల్లీగల్ రిజిస్ర్టేషన్... బోగస్ పట్టా....
2004 జూన్ 26న మల్లెపూల నారాయణ నుంచి మంచిర్యాల సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ నంబర్ 0303 ద్వారా 115/4 సర్వేనంబర్‌లోని 3 ఎకరాల భూమి జుట్టు గంగాధర్‌కు సంక్రమించింది. అసలు నారాయణకు అసైన్డ్ భూమి ఎట్లా వచ్చిందో రెవెన్యూ ఆఫీసులో ఎలాంటి రికార్డులు లేవు. అయినప్పటికీ ఆయన పేరిట ఉన్న లావుని పట్టా భూమిని సబ్ రిజిస్ర్టార్ ఆఫీసులో గుడ్డిగా దాన పట్టా చేసేశారు. వాస్తవంగా వీరిద్దరికి ఎలాంటి బంధుత్వం లేకపోయినా మేమమాన వరుస కలిపి రిజిస్ర్టేషన్ చేయించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి 2010లో పట్టా నంబర్ ఏ/ల్యాండ్స్/8010/2010 మంచిర్యాల తహసీల్దార్ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ ఇది ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం కేటాయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
మార్కెట్ విలువ రూ.10 కోట్లకు పైమాటే....
జుట్టు గంగాధర్ 115/4 సర్వేనంబర్‌లోని 3 మూడు ఎకరాల భూమిలో ప్లాట్లు చేసి పలువురికి అమ్మేశాడు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ రేటు గజం రూ.10వేల నుంచి రూ.15వేలు పలుకుతోంది. ఈ లెక్కన సదరు భూమి విలువ రూ.10 కోట్లకు పైమాటే. ఫేక్ డాక్యుమెంట్లతో 2014 నుంచి ఇప్పటివరకు మంచిర్యాల సబ్ రిజిస్ర్టార్ ఆఫీసులో 30కి పైగా రిజిస్ర్టేషన్లు జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 115 సర్వేనంబర్‌లో జుట్టు గంగాధర్‌కు ఎలాంటి భూకేటాయింపు జరగలేదని రెవెన్యూ రికార్డులను బట్టి స్పష్టమవుతోంది.
అక్రమ నిర్మాణాలకు అడ్డేది..
115/4 సర్వేనంబర్‌లో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్లో దరఖాస్తు చేసుకోగా పలువురికి ప్రొసీడింగ్స్ కూడా జారీ అయినట్టు సమాచారం. వీరిలో కొంతమంది మున్సిపల్ పర్మిషన్ లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అసలు విషయం తెలుసుకున్న మరికొందరు ఏనాటికైనా ఇబ్బందులు తప్పవనే భయంతో నిర్మాణాలు చేపట్టేందుకు జంకుతున్నారు. గతంలో పనిచేసిన రెవెన్యూ, రిజిస్ర్టేషన్, మున్సిపల్ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం కోట్ల విలువైన ఆస్తిని కోల్పోయింది. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.
