ధరణితో కేసీఆర్ బంధువులకు  రూ.వేల కోట్లు : రేవంత్​రెడ్డి

ధరణితో కేసీఆర్ బంధువులకు  రూ.వేల కోట్లు : రేవంత్​రెడ్డి

వాళ్లందరికీ బేడీలు వేసి జైల్లో పెట్టాలె: రేవంత్​రెడ్డి
ధరణితో ఊరూరా భూవివాదాలు పెరిగినయ్
అయ్య గల్లీలో.. బిడ్డ ఢిల్లీలో లిక్కర్​ దందా అని విమర్శ
కేసీఆర్ పేదల భూములు పెద్దలకు కట్టబెడుతుండు: మాణిక్​రావు ఠాక్రే
కాంగ్రెస్ సర్కార్ రాగానే ధరణి రద్దు చేస్తం: జైరాం రమేశ్

పెద్దపల్లి/కరీంనగర్/హైదరాబాద్, వెలుగు : ‘‘పేదల కోసం కాదు.. పెద్దల కోసమే సీఎం కేసీఆర్ ధరణి తీసుకొచ్చిండు. వేల కోట్ల రూపాయలు తన బంధువులకు దోచిపెడుతున్నడు. వాళ్లందరికీ బేడీలు వేసి జైల్లో పెట్టాలె” అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ధరణిలో తప్పుల సవరణకు రైతులు రూ.1,200 కట్టాల్సి వస్తున్నదని, ఎన్నిసార్లు చార్జీలు చెల్లించి రిక్వెస్టులు పెట్టుకున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్​పూర్​లో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణిపై నిర్వహించిన అదాలత్​లో రేవంత్ మాట్లాడారు. ఇదివరకు గ్రామానికి 20 సమస్యలు ఉంటే.. కేసీఆర్ తెచ్చిన ధరణితో ఊరికి 200 దాకా పెరిగాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ధరణి సమస్యలను పరిష్కరించి, బరాబర్ ధరణి పోర్టల్ రద్దు చేస్తామని వెల్లడించారు. 

భూవివాదాలకు పరిష్కారం

ధరణి పోర్టల్​లో 20 లక్షల రికార్డుల్లో తప్పులే ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూసమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ రద్దు, రీసర్వే, ఒక్క పట్టా ఒక్క రికార్డు, ఒక చట్టం, ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అనే ఐదు సూత్రాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 90 రోజుల పాటు ధరణి లోక్ అదాలత్ లు నిర్వహిస్తామన్నారు.  కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే రెండేండ్లలో రాష్ట్రంలో భూముల సర్వే పూర్తి చేస్తామన్నారు. భూములకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలు, జీవోలను కలిపి ఒకే చట్టం తీసుకొస్తామని తెలిపారు. తెలంగాణలోని 15 లక్షల మంది కౌలు రైతులను కేసీఆర్ పట్టించుకోవట్లేదన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. కేసీఆర్ పేదల భూములను లూటీ చేసి, పెద్దలకు దోచిపెడుతున్నాడని ఆరోపించారు. భూమి కోసం పోరాటాలు చేసిన చరిత్ర ఈ నేలకు ఉందని ఏఐసీసీ నేత కొప్పుల రాజు అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీ వేసి భూ పంపిణీ చేపట్టిందన్నారు. 

టాపిక్ డైవర్ట్ కోసమే కవిత దీక్ష

మహిళ రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష టాపిక్ డైవర్ట్ కోసమేనని శుక్రవారం సాయంత్రం జైరాం గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ లో అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు. అయితే, ఇన్నేండ్లలో ఒక్కసారి కూడా మహిళా బిల్లుపై ఎందుకు మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని, బీఆర్ఎస్​తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.

అయ్య గల్లీలో.. బిడ్డ ఢిల్లీలో లిక్కర్ దందా: రేవంత్

జగిత్యాల టౌన్, వెలుగు : ‘‘అయ్య గల్లీలో లిక్కర్ దందా చేస్తే.. బిడ్డ ఢిల్లీలో లిక్కర్ దందా చేస్తోందని, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్​కు.. తెలంగాణకు సంబంధం లేదు” అని రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పాదయాత్ర జగిత్యాల జిల్లా చల్గల్ నుంచి జగిత్యాల పట్టణం వరకు సాగింది. సాయంత్రం జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తాలో జరిగిన సభలో రేవంత్​మాట్లాడుతూ ‘‘అవినీతి పంపకాల్లో పీఎం మోడీ, సీఎం కేసీఆర్​కు తేడా వచ్చిందని.. అందుకే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు దోపిడీ చేసి దొరికితే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియాను అవమానించేందుకు ఈడీ తన ఆఫీసుకు పిలిచినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. అధికారం ఉందని ఆనాడు కోదండరామ్, తీన్మార్ మల్లన్న, తనను ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ జైల్లో పెట్టిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు.