రెండు లక్షల ఉద్యోగాల పేరిట రేవంత్ మోసం: మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు

రెండు లక్షల ఉద్యోగాల పేరిట రేవంత్ మోసం: మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు
  • సినిమా టాకీస్​కు కాదు, అశోక్​నగర్​ సెంట్రల్​ లైబ్రరీకి పోవాలని హితవు
  •     నర్మెట్ట ఆయిల్  పామ్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన
  •     ఓపెనింగ్​కు సీఎం వస్తే రుణమాఫీ కాని రైతులతో కలిసి ధర్నా చేస్తామని వెల్లడి

సిద్దిపేట, వెలుగు: రెండు  లక్షల ఉద్యోగాల పేరుతో రేవంత్​రెడ్డి నిరుద్యోగులను  మోసం చేస్తున్నాడని, సినిమా టాకీస్ ప్రారంభోత్సవానికి కాదు, అశోక్​నగర్​ సెంట్రల్​ లైబ్రరీకి పోవాలని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు హితవు పలికారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్  పామ్  ఫ్యాక్టరీ పనులను  పరిశీలించి మీడియాతో మాట్లాడారు. 

వేలాది మంది పోలీసులను పెట్టుకొని అశోక్ నగర్ లో సినిమా టాకీస్  ఓపెనింగ్​కు పోతున్నాడే.. కానీ, ఎన్నికల ముందు రాహుల్ గాంధీ సెంట్రల్  లైబ్రరీకి పోయి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని  ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు. జాబ్  క్యాలెండర్.. జాబ్  లెస్  క్యాలెండర్ గా చేసి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమని మంత్రి శ్రీధర్ బాబు ఎలా అంటారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను నమ్మించి, ఇప్పుడు నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట నియోజక వర్గంలో 22వేల మందికి రుణమాఫీ జరగలేదని, ఆయిల్ పామ్  ఫ్యాక్టరీ ఓపెనింగ్​కు సీఎం వస్తే బాధిత రైతులతో కలిసి ధర్నా చేస్తామని 
హెచ్చరించారు.

సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం..

 సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ‘నాపై కోపం ఉంటే, నా మీదే చూపించు రేవంత్ రెడ్డి’ అంటూ తీవ్రంగా స్పందించారు. బీజెపీ నేతలు పత్రి శ్రీనివాస్​ యాదవ్, సీనియర్ నేత హన్మంతరావు అనుచరులతో  కలిసి బీఆర్ఎస్ లో చేరారు. జిల్లా రద్దయింతే సిద్దిపేట అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైతే మరో ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. సమస్యలపై నిలదీస్తుంటే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, మున్సిపల్  మాజీ చైర్మన్  రాజనర్సు పాల్గొన్నారు.