కేసీఆర్ ప్రెస్ మీట్ ను మించి.. రేవంత్​ ప్రమాణం.. వీ6 లైవ్ వ్యూస్ 3.12 లక్షలు

కేసీఆర్ ప్రెస్ మీట్ ను మించి.. రేవంత్​ ప్రమాణం.. వీ6 లైవ్ వ్యూస్ 3.12 లక్షలు

హైదరాబాద్, వెలుగు : ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రమాణం కార్యక్రమం వ్యూస్ కొత్త రికార్డులు సృష్టించింది. వీ6 న్యూస్ యూట్యూబ్ లైవ్ ఈవెంట్స్ లో ఒకేసారి 3 లక్షల 12 వేల మంది లైవ్ లో చూశారు. తెలుగు రాష్ట్రాల్లో అటు దేశ, విదేశాల్లో టీవీల్లో వీ6 చానెల్లో లైవ్ చూసిన అసంఖ్యాక వీక్షకులకు అదనంగా ఈ3 లక్షల మందికి పైగా వీ6 యూట్యూబ్ ఈవెంట్స్ లో చూడటం విశేషం. నిజానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా చాలా ఆసక్తి చూపించారు.

దీంతో డిసెంబర్ 3న రిజల్ట్ రోజున లక్షలాది మంది వీ6 చానెల్ తో పాటు యూట్యూబ్ లైవ్ ఈవెంట్స్ లో ఫాలో అయ్యారు. రిజల్ట్ రోజు తర్వాత అంతకంటే ఉత్కంఠ, ఆసక్తి కలిగించే న్యూస్ ఈవెంట్స్ పెద్దగా ఉండవు. అందుకే కొత్త సర్కారు ప్రమాణం లాంటి కార్యక్రమాలను లక్షల మంది చూసే అవకాశం తక్కువ. మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నిమజ్జనం, మేడారం జాతర లాంటి సంబరాలకు మాత్రమే భారీ సంఖ్యలో వ్యూస్ ఉంటాయి.

అవి కాకుండా అనుకోకుండా జరిగే భారీ విపత్తులు, అత్యంత పెద్ద విషాదాలు సంభవించినప్పుడు మాత్రమే జనం ఆ వివరాలు తెలుసుకోవడానికి ఎక్కువ సంఖ్యలో చూస్తుంటారు. 

కేసీఆర్ ప్రెస్ మీట్ ను మించి.. 

కరోనా విపత్తు కాలంలో నాటి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ను వీ6 యూట్యూబ్ లైవ్ ఈవెంట్లో లక్షన్నర మంది ఒకేసారి చూడటం సంచలనం రేపింది. ఒక ప్రాంతీయ నాయకుడు, స్థానిక భాషలో మాట్లాడుతుంటే, కేవలం ప్రెస్ మీట్ ను లక్షలాది మంది చూడటం అసాధారణ సంఘటనగా నిలిచింది. అదేకోవలో ఇపుడు కాంగ్రెస్ సర్కారు ప్రమాణ కార్యక్రమం మరింత అసాధారణ సంఖ్యలో లైవ్ వ్యూస్ తో నిలిచింది. ఎన్నికల రిజల్ట్ రోజుకు మించి ఊహించని సంఖ్యలో 3 లక్షల మందికి పైగా ప్రమాణం కార్యక్రమాన్ని వీ6 న్యూస్ లైవ్ ఈవెంట్స్ లో ఫాలో అయ్యారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.

తెలంగాణ ఏర్పాటు అయ్యాక పదేండ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత జనం మార్పు కోరుకున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్న నినాదాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రచారం, తెలంగాణతో తమది కుటుంబ బంధం అన్న మాట జనాన్ని ఆకట్టుకుంది. గురువారం ప్రమాణ కార్యక్రమంలో రేవంత్ తోపాటు వీరంతా వున్నారు. అట్లాగే 6 గ్యారంటీలు, ప్రజల ఆకాంక్షలపై ఏం చెబుతారన్న ఆసక్తి జనంలో

ముఖ్యంగా విద్యార్థులు, యూత్ లో కనిపించింది. కొత్త మంత్రులు ఎవరు అవుతారన్న ఇంటరెస్ట్ పెరిగింది. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ సర్కారు రావటంతో ఆ పార్టీ కార్యకర్తలు ఫుల్ జోష్ తో వున్నారు. ఇవన్ని కలిసి ప్రమాణం కార్యక్రమంపై ఆసక్తిని విపరీతంగా పెంచింది.