ఢిల్లీ పెద్దలకు ఆహ్వానం.. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేకు రేవంత్ ఇన్విటేషన్

ఢిల్లీ పెద్దలకు ఆహ్వానం.. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేకు రేవంత్ ఇన్విటేషన్

న్యూఢిల్లీ, వెలుగు : ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్ అగ్రనేతలను సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తనను సీఎంగా ప్రకటించిన నేప థ్యంలో హైకమాండ్​కు కృతజ్ఞతలు చెప్పేందుకు ఢిల్లీకి వచ్చిన రేవంత్.. బుధవారం బిజీబిజీగా గడిపారు. మొదట కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం 10 జన్ పథ్​కు చేరుకుని సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీని కలిశారు. సోనియా ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు ప్రచారంలో ముందుడి నడిపించినందుకు రాహుల్, ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి చీఫ్​ గెస్టులుగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పుపై అగ్రనేతలందరితోనూ రేవంత్ చర్చించారు. హర్యానా ఎంపీ దీపేంద్ర సింగ్ హుడాను కూడా కలిసి ప్రమాణస్వీకారానికి రావాలని రేవంత్ ఆహ్వానించారు. అనంతరం వారిద్దరూ కలిసి పార్లమెంట్​కు చేరుకుని, అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. సుశీల్ కుమార్ షిండే, మీరాకుమార్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు, ఇండియా కూటమిలోని సీఎంలు హేమంత్ సోరెన్, స్టాలిన్, పినరయి విజయన్, మమతా బెనర్జీ, నీతీశ్ కుమార్​లకు కూడా రేవంత్ ఆహ్వానాలు పంపారు. కాగా, రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారా? అని పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సోనియాను మీడియా ప్రశ్నించగా.. ‘హాజరు కావొచ్చు’ అని ఆమె బదులిచ్చారు. 

ఠాక్రేతో భేటీ.. 

ఢిల్లీ పర్యటన ముగించుకుని ఎయిర్ పోర్ట్​కు బయలుదేరిన రేవంత్​కు కాంగ్రెస్ స్టేట్ ఇన్​చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే నుంచి పిలుపు రావడంతో తిరిగి వెనక్కి వచ్చారు. థాక్రేతో దాదాపు 40 నిమిషాలకు పైగా భేటీ అయ్యా రు. మంత్రివర్గం, సీఎంతో పాటు ఎవరెవరు ప్రమాణం చేయాలి, కార్యక్రమ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో రేవంత్ హైదరాబాద్ కు వెళ్లారు. ఆయన వెంటన మాణిక్ రావ్ థాక్రే, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు. 

ఎంపీల అభినందనలు.. 

సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్​కు సహచర ఎంపీలు అభినందనలు తెలిపారు. ఆయన బుధవారం పార్లమెంట్​కు రాగా.. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, వైసీపీ ఎంపీలు నిరంజన్ రెడ్డి, కోటగిరి శ్రీధర్, టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనక మేడల రవీంద్ర కుమార్, తమిళనాడు ఎంపీ జ్యోతిమణి, కేరళ ఎంపీ హిబి హిడెన్ కలిసి మాట్లాడారు. అనంతరం స్పీకర్ ఓంబిర్లాను రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.

తర్వాత కాసేపు లోక్ సభకు హాజరై బయటకు వస్తున్న రేవంత్​ను బీఆర్ఎస్ ఎంపీ రాములు నాయక్ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. రఘురామ కృష్ణంరాజు, రమ్య హరిదాసు, మనీష్ తివారీ, ఇతర పార్లమెంట్​ సభ్యులు రేవంత్ రెడ్డితో ఫొటోలు దిగారు. కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఢిల్లీకి వస్తానని.. అప్పుడే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ తెలిపారు.