రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ పోరాటం.. ఆయన దూతగానే గోవాకు  వచ్చిన: సీఎం రేవంత్

రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ పోరాటం.. ఆయన దూతగానే గోవాకు  వచ్చిన: సీఎం రేవంత్
  • నషా ముక్త్ భారత్‌‌ ఎప్పుడో మోదీ, అమిత్ షా చెప్పాలి
  • గోవాలో డ్రగ్స్ ఎందుకు ఆపట్లేదు? 
  • సీఎం సావంత్‌‌ కాదు ‘ప్రాపర్టీ సావంత్‌‌’ అని ఎద్దేవా 
  • 2027లో గోవాలో వచ్చేది కాంగ్రెస్ సర్కార్‌‌‌‌ అని ధీమా 
  • కాంగ్రెస్ 27 రోజుల పాదయాత్ర ముగింపు సభలో స్పీచ్  

 

హైదరాబాద్, వెలుగు:  ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ రాజ్యాంగాన్ని నాశనం చేస్తూ, నిరుద్యోగ యువతపై లాఠీచార్జీలు చేయిస్తుండటంతో వారి తరఫున కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అక్కడే ఉండి పోరాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే, రాహుల్ స్థానంలో ఆయన దూతగా తాను గోవాకు వచ్చానని తెలిపారు. గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ల్యాండ్, డ్రగ్ మాఫియా అడ్డాగా మార్చేసిందని ధ్వజమెత్తారు. గోవాలో 40 నియోజకవర్గాల్లో 27 రోజుల పాటు కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఆదివారం సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 


‘‘ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతినిధిగా నేను గోవా గడ్డపైకి వచ్చాను. శనివారం అర్ధరాత్రి12 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా ఫోన్ చేసి గోవా కార్యకర్తలకు అండగా నిలవాలని ఆదేశించారు”అని సీఎం రేవంత్ తెలిపారు. హక్కులను కాలరాస్తున్న బీజేపీ పాలనపై ప్రజలు తిరగబడాలని, రాబోయే రోజుల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఐక్యంగా కదలాలని పిలుపునిచ్చారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ అసలు పేరును ప్రజలే స్వయంగా ‘ప్రాపర్టీ సావంత్’గా మార్చేశారని సీఎం రేవంత్  ఎద్దేవా చేశారు. గోవా సీఎం భూములను కార్పొరేట్లకు, ఇతరులకు అడ్డగోలుగా అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్‌‌లో డ్రగ్స్, గంజాయి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ, అమిత్ షా ‘నషా ముక్త్ భారత్’ అంటూ నీతులు చెబుతున్నారని, మరి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న గోవాలో డ్రగ్స్ రాకెట్‌‌ను ఎందుకు అణచివేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే డ్రగ్స్ నిర్మూలనకు ‘ఈగల్ ఫోర్స్’ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌‌కు డ్రగ్స్ గోవా నుంచే సరఫరా అవుతున్నట్లు తేలడంతో, తెలంగాణ పోలీసులు గోవాకు వచ్చి నైజీరియన్ కింగ్‌‌పిన్‌‌లను, డీలర్లను అరెస్ట్ చేశారని చెప్పారు. గోవాలో సీబీఐ, ఈడీ, ఎన్‌‌సీబీ సంస్థలు డ్రగ్స్ ముఠాలపై ఎందుకు ఉక్కుపాదం మోపడం లేదో చెప్పాలన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ధర్మయుద్ధం.. 

గోవాలో బీజేపీని గద్దె దించాలంటే కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఓటేయాలని ఓటర్లకు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిన్న చిన్న పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఓటేస్తే పరోక్షంగా అది బీజేపీకే మేలు చేస్తుందని, కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకే బీజేపీ ఆ పార్టీలను పాముల్లా పెంచి పోషిస్తోందని హెచ్చరించారు. ఇది రావణుడు (బీజేపీ), రాముడు (కాంగ్రెస్) మధ్య జరుగుతు న్న ధర్మయుద్ధమని, ప్రజలంతా రాముడి పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. 2017, 2022 ఎన్నికల్లో గోవా ప్రజలు కాంగ్రెస్‌‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, బీజేపీ అక్రమంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు.

తెలంగాణలోనూ గతంలో కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నారని, అయినా వెరవకుండా ప్రజల్లో ఉండి 2023లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చామని ఉదహరించారు. గోవాలోనూ రాజ్యాంగ విరుద్ధంగా గద్దెనెక్కిన తోలుబొమ్మ సర్కార్‌‌కు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ఓట్లను చీల్చేందుకు ఎన్నికల సంఘాన్ని వాడుకుంటున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు.

కాంగ్రెస్ గెలుపు ఖాయం.. 

వర్షాకాలంలో రుతుపవనాలు కేరళ మీదుగా గోవాలోకి ఎలాగైతే ప్రవేశిస్తాయో, రాజకీయ మార్పు కూడా అలాగే సాగుతుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గోవాలోనూ, కేంద్రంలోనూ యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. అదేవిధంగా 2027 నాటికి గోవాలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, ఆ తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలోని ఎర్రకోటపై కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తుందన్నారు. పార్టీ స్థానిక నేతలు గిరీష్ చోడంకర్, యూరి అలమావో, అంజలి నింబాల్కర్, ఫ్రాన్సిస్కో సర్దానా, పార్టీ ఇన్‌‌చార్జ్ మాణిక్‌‌రావ్ ఠాక్రే విభేదాలు పక్కనపెట్టి యూత్ కాంగ్రెస్, ఎన్‌‌ఎస్‌‌యూఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్‌‌ను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని హితవుపలికారు. అధికారం కోసం కాకుండా గోవా భవిష్యత్తు కోసం, పర్యావరణాన్ని, భూములను కాపాడుకునేందుకు పోరాడాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు గోవా కాంగ్రెస్‌‌కు ఉంటుందని వెల్లడించారు.