ఎన్నికల ముందు కేసీఆర్​ బయోపిక్

ఎన్నికల ముందు కేసీఆర్​ బయోపిక్
  • ఎన్నికల ముందు కేసీఆర్​ బయోపిక్
  • స్క్రిప్ట్​ రెడీగా ఉంది: రామ్‌‌గోపాల్ వర్మ

న్యూఢిల్లీ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ బయోపిక్  సినిమా రిలీజ్​ చేస్తానని ప్రముఖ డైరెక్టర్​ రాంగోపాల్​ వర్మ ప్రకటించారు. సినిమాకు కావాల్సిన స్క్రిప్ట్ అంతా రెడీగా ఉందని చెప్పారు. నిజజీవితాన్ని అనుసరించి తీసే సినిమా కావడంతో స్క్రిప్టు పెద్ద కష్టమేమీ కాదన్నారు. డ్రామాతో కూడిన పొలిటికల్‌‌ సినిమాలు తీసిన తాను వాస్తవంగా ప్రస్తుత రాజకీయాలు అంతగా ఫాలో అవనని ఆయన స్పష్టం చేశారు. తాను డైరెక్ట్ చేసిన ‘డేంజరస్’ మూవీ ట్రైలర్ ను గురువారం ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్  హాల్​లో హీరోయిన్స్ నైనా గంగూలీ, అప్సరా రాణితో కలిసి ఆర్జీవీ చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ‘డేంజరస్​’ సినిమాను రూపొందించామని, ఏప్రిల్ 8న విడుదల చేస్తామన్నారు. ఇంతవరకు అబ్బాయి, అమ్మాయి ప్రేమ చూశామని, అంతే ఇంటెన్స్​తో అమ్మాయి, అమ్మాయి ప్రేమను చూడాలనేది తన అభిమతమని చెప్పారు. కేవలం 40 రోజుల్లో ‘డేంజరస్’ సినిమాను తీశామని వివరించారు. కాశ్మీర్ ఫైల్స్ మూవీలో వాస్తవాలను చిత్రీకరించారని, సినిమా టేకింగ్ విధానం కూడా చాలా బాగుందని ఆయన అన్నారు. ‘డేంజరస్​’ మూవీలో నటించేందుకు తెర వెనక చాలా కష్టపడ్డానని నటి నైనా గంగూలీ తెలిపారు. సినిమాలో మరో హీరోయిన్ తో ముద్దు సీన్లలో నటించేందుకు తొలత కొంత ఇబ్బందిపడ్డానని,  హీరోతో ఇలాంటి సీన్లు చేస్తున్నప్పుడు, హీరోయిన్ తో ఎందుకు చేయకూడదనే ఆలోచనతో తన క్యారెక్టర్ కు న్యాయం చేశానన్నారు. ఆర్జీవీ నిర్మించిన ‘డేంజరస్​’ సినిమాలో తనకు అవకాశం రావడం లక్కీగా భావిస్తున్నానని మరో నటి అప్సరా రాణి తెలిపారు. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి తాను మద్దతు తెలుపుతున్నానని, అందుకే ఈ చిత్రంలో నటించానన్నారు.