బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

బియ్యం అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

మిర్యాలగూడ, వెలుగు: తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో  రేషన్  బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్  చేశారు.  శుక్రవారం మిర్యాలగూడ టూ టౌన్  పీఎస్ లో డీఎస్పీ రాజశేఖర రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. 

గుంటూరు అర్బన్  జిల్లాకు చెందిన కొమ్మలపాటి శ్రీనివాస్  ఏపీలోని చెరుకూరు, నల్లపాడు, లాలాపేట, కాకాని, పత్తిపాడు మండలాలతో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని రూ.11కు కిలో చొప్పున కొనుగోలు చేసేవాడని చెప్పారు. వెంకట సుబ్బారావుకు చెందిన పద్మజ రైస్  ట్రేడర్స్  మిల్లులో రీసైక్లింగ్  చేసి ఆర్మూర్, ఒరిస్సా, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరి, కాకినాడ ప్రాంతాల్లో రూ. 35 కేజీ చొప్పున అమ్ముతున్నట్లు తెలిపారు. 

చెక్ పోస్ట్ ల వద్ద పట్టుకోకుండా ఏపీలోని పిడుగురాళ్లకు చెందిన మహేశ్​రెడ్డికి నెలకు రూ.3 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. బియ్యం ట్రాన్స్ పోర్ట్  చేసేందుకు నరసరావుపేటకు చెందిన రమేశ్, సకిల శ్రీనివాస్​కు కమీషన్  ఇచ్చేవాడని తెలిపారు. 300 క్వింటాళ్ల బియ్యాన్ని 600 ప్లాస్టిక్  బ్యాగుల్లో నింపి లారీల్లో తరలిస్తుండగా వాడపల్లి చెక్ పోస్ట్  వద్ద పట్టుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. కొమ్మలపాటి శ్రీనివాస్,  వెంకట సుబ్బారావు, మహేశ్ రెడ్డి, శ్రీనివాస్, డ్రైవర్  మనుబాయ్​ను అరెస్ట్​ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.