సర్కారు వార్నింగ్​తో దిగొస్తున్న మిల్లర్లు

సర్కారు వార్నింగ్​తో దిగొస్తున్న మిల్లర్లు
  • ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ
  • బీఆర్ఎస్​ హయాంలో 14 నెలల్లో 24.5 లక్షల టన్నుల సీఎంఆర్
  • గత 50 రోజుల్లో వచ్చిన సీఎంఆర్ 14.5 లక్షల టన్నులు
  • ఒకే రోజు 56 వేల టన్నుల బియ్యం ఇచ్చిన మిల్లర్లు

హైదరాబాద్‌‌, వెలుగు:  రైతుల దగ్గర కొన్న ధాన్యాన్ని మిల్లింగ్(సీఎంఆర్)​ చేసి బియ్యంగా ఇవ్వడంలో ఇన్నాళ్లు జాప్యం చేస్తూ వచ్చిన మిల్లర్లు.. కొత్త ప్రభుత్వం వార్నింగ్​తో ఒక్కో మెట్టు దిగొస్తున్నారు. గత బీఆర్ఎస్​ సర్కారు ఉదాసీనత వల్ల 14 నెలల్లో సివిల్​సప్లయ్స్​కు 24.5 లక్షల టన్నుల సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లు.. కొత్త సర్కారు చర్యలతో 50 రోజుల్లోనే 14.5 లక్షల టన్నుల సీఎంఆర్ ​అప్పగించారు. ఈ నెల 27న సివిల్‌‌ సప్లయ్స్‌‌ చరిత్రలోనే అత్యధికంగా 56,843 టన్నుల సీఎంఆర్‌‌ను సేకరించడం గమనార్హం. సీఎంఆర్‌‌ సేకరణ గతంతో పోలిస్తే 40 శాతం వేగం పెరిగింది. 

మంత్రి వరుస సమీక్షలు

సివిల్‌‌ సప్లయ్స్‌‌ శాఖ మంత్రిగా ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచే సంస్థ పరిస్థితిపై దృష్టి పెట్టారు. గత కొన్ని రోజులుగా పౌర సరఫరాల శాఖపై అధికారులు, కమిషనర్లతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

మిల్లర్ల వద్ద రూ.20 వేల కోట్ల విలువైన ధాన్యం ఎలాంటి పూచీకత్తు లేకుండా పెట్టారని, అది ఇప్పుడు ఉందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని సంప్రదించి సీఎంఆర్‌ బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలపైనా సీరియస్​అయ్యారు. దీంతో మిలర్లు సీఎంఆర్​ఇవ్వడంలో వేగం పెంచారు. ఎక్కడైనా మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని అమ్ముకొని ఉంటే.. బయట వడ్లు కొని మరీ మిల్లింగ్​చేసి సర్కారుకు ఇచ్చే పనిలో పడ్డట్లు తెలుస్తున్నది.

ఫలించిన వ్యూహం..

ప్రభుత్వం సీఎంఆర్‌పై  ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి డి.ఎస్‌. చౌహాన్‌ను కమిషనర్‌గా నియమించింది. ఈ మేరకు ఆయన ప్రతిరోజు సీఎంఆర్‌ పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. మిల్లర్ల జాప్యానికి కారణాలను తెలుసుకుని విజిలెన్స్‌ విభాగంతోపాటు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లును రంగంలోకి దించారు. అవసరమైన ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సమన్వయంతో సమష్టిగా పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో వీలైనంత మేరకు మిల్లర్ల నుంచి బియ్యాన్ని తీసుకోవాలని టార్గెట్‌ పెట్టకున్నారు. ఉద్దేశ పూర్వకంగా సీఎంఆర్​ఇవ్వడంలో డిఫాల్ట్‌ అయితే గతంలో మాదిరిగా బియ్యం ఇస్తామంటే తీసుకొనే ప్రసక్తే లేదని నగదు వసూలు చేస్తామని ఇప్పటికే మిల్లర్లకు స్పష్టం చేశారు. కొత్త సర్కారు వైఖరితో రైస్‌ మిల్లర్లు దిగివస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు రోజుకు 5 నుంచి 6 వేల టన్నులే సీఎంఆర్​వచ్చేది. ఇప్పుడు వేగం పెరిగింది. 

నిరుటి వానాకాలం సీఎంఆర్​ ఇంకా..

నిరుటి(2022–23) వానాకాలం సీజన్‌కు సంబంధించి రైస్‌ మిల్లర్లు 43.73 లక్షల టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంది. అయితే 2022 అక్టోబర్‌ నుంచి 2023 నవంబర్‌ వరకు14 నెలల్లో మిల్లర్ల నుంచి 24.50 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే సేకరించారు. కొత్త సర్కారు వచ్చి రావడంతోనే మిల్లర్లపై ఒత్తిడి పెంచింది. దీంతో గత డిసెంబర్‌ రెండో వారం నుంచి జనవరి 27 వరకు దాదాపు 50 రోజుల్లో 14.50 లక్షల టన్నులు సీఎంఆర్‌ను మిల్లర్లు సివిల్​సప్లయ్స్​కు అప్పగించారు. కాగా సీఎంఆర్‌ ఎక్కువగా  పెండింగ్ ఉన్న  జిల్లాల్లో  వనపర్తి 82 వేల టన్నులు, నాగర్‌కర్నూల్‌ 42 వేలు, మెదక్‌ 40 వేలు, కామారెడ్డి 37 వేలు, నిర్మల్‌ 35 వేలు, జగిత్యాల 33 వేలు, పెద్దపల్లి, సూర్యాపేట  జిల్లాల నుంచి 32 వేల టన్నుల బియ్యం రావాల్సి ఉంది. పెండింగ్ ఉన్న జిల్లాలపై  అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. 

సంస్థకు ఆర్థిక భారం

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొని మిల్లర్లకు ఇస్తున్నది.  మిల్లర్లు ఒక క్వింటాల్‌ వడ్లు  తీసుకుంటే 68 కిలోల బాయిల్డ్‌రైస్‌, 67 కిలోల రా రైస్‌ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.  రాష్ట్రంలో అవసరమైన రేషన్‌ బియ్యం కోటా తీసుకుని మిగిలిన బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ గత మూడేళ్లుగా కేంద్రం నిర్దేశించిన గడువులోగా బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించలేదు. ఫలితంగా సివిల్ సప్లయ్స్‌ సంస్థ అప్పులు పెరిగిపోతున్నాయి. 

అందరి సహకారంతోనే ... 


వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయడంతో గతంలో లేని విధంగా మిల్లర్ల నుంచి సీఎంఆర్‌ను వేగంగా సేకరిస్తున్నాం. తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సూచనలు, సలహాలతో మిల్లర్లపై చర్యలతో సీఎంఆర్ వేగం పెరిగింది. రికార్డుస్థాయిలో సేకరణ జరుగుతోంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నాం.


– డీఎస్‌ చౌహాన్‌, కమిషనర్‌, సివిల్‌ సప్లయ్స్‌ డిపార్ట్​మెంట్