ఆరోగ్య హక్కు బిల్లు సాహసోపేతం!: మ‌‌‌‌న్నారం నాగ‌‌‌‌రాజు

ఆరోగ్య హక్కు బిల్లు సాహసోపేతం!: మ‌‌‌‌న్నారం నాగ‌‌‌‌రాజు

ప్రజారోగ్యమే జాతి మహాభాగ్యం. దేశ ప్రజలను పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేందుకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చేస్తూనే ఉన్నారు.  అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలేనన్ని ఆరోగ్య సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి. మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆరోగ్య విషయంలో పాలకులు తీసుకోవాల్సిన చర్యల గురించి రాజ్యాంగంలో  పొందుపరిచారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటి పోయినా నేటికీ ఆరోగ్య వసతులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు విఫలమవుతున్నారనే చెప్పవచ్చు. ప్రజలపై రోగాల దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇందులో కొన్ని వ్యాధులను నియంత్రించడం డాక్టర్లకు కూడా సాధ్యం కావడం లేదు.  ఆధునిక విజ్ఞానంతో విర్రవీగే మానవజాతిపై ప్రకృతి విసురుతున్న వ్యాధుల సవాల్​కు చాలామంది బలైపోతూనే ఉన్నారు. ఆ శక్తి ముందు మానవుడు ఎప్పుడూ తలదించుకోవాలనే వాస్తవాన్ని చాటుతూ వ్యాధులు ప్రబలి పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త వ్యాధులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

కోట్లాదిమంది రోగపీడితులుగా మారుతుంటే.. వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, ఆరోగ్యహక్కు చట్టానికి సంబంధించిన అంశాలు  ప్రస్తుతం రాజస్థాన్‌‌‌‌ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. రాజస్థాన్‌‌‌‌లోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కులను కల్పించేందుకు అక్కడి కాంగ్రెస్​ ప్రభుత్వం ఆరోగ్య బిల్లు తీసుకొచ్చింది. సామాన్యుడికి సకాలంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యం అందించాలన్నదే ఈ బిల్లు ప్రాథమిక ఉద్దేశంగా అశోక్​ గెహ్లాట్ సర్కారు వెల్లడించింది.  దీనిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్యం విలువ తెలుస్తున్నది.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని గెహ్లాట్ ప్రభుత్వం విప్లవాత్మకమైన అడుగు వేయడం సాహసోపేతం.

ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వైద్యం ఉచితం

ఆరోగ్య బిల్లు చెబుతున్న కీలక అంశాలు ఏమిటంటే..రాజస్థాన్​ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ, ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు ఉచితం.  ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. పోలీసుల క్లియరెన్సులు అవసరం లేదు. వైద్యానికయ్యే ఖర్చులు, వైద్య పరీక్షల ఖర్చులూ ఏమీ ఉండవు. ఆసుపత్రులకు వెళ్లేందుకు వచ్చేందుకు కూడా ఉచితంగానే ట్రాన్స్‌‌‌‌పోర్ట్ సేవలు అందించాలి. ఇలాంటి ఉచిత వైద్య సేవలను ప్రజల హక్కుగా మారుస్తూ ఆరోగ్య హక్కు బిల్లుని మార్చి 21న రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదించింది.  రాజస్థాన్‌‌‌‌లోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కులను ఈ బిల్లు కల్పిస్తుంది . ఉచిత వైద్య సేవలు పౌరుల హక్కుగా అందిస్తుంది.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలతోపాటు మందులు,  వైద్య పరీక్షలు ఉచితం.  అయితే ఇక ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు ఉచితంగా అందనున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబరులోనే ఆరోగ్య హక్కు చట్టానికి సంబంధించిన బిల్లుని రాజస్థాన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై అభ్యంతరాలు రావడంతో బిల్లుని సెలక్ట్ కమిటీకి పంపించారు. ఆ తర్వాత కొన్ని సవరణలు జరిగాయి. చివరగా 2023 మార్చి 21న రాజస్థాన్ అసెంబ్లీ బిల్లుని ఆమోదించింది. అయితే ఈ బిల్లుకి వ్యతిరేకంగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రైవేట్ వైద్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ఆరోగ్య హక్కు చట్టాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. వీళ్లకు దేశవ్యాప్తంగా వైద్యులు తమ మద్దతు తెలుపుతున్నారు.

ప్రైవేట్ వైద్యులపై భారం

ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించే బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకుంటోందని,  ఆ భారాన్ని తమపైన పెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రైవేట్ వైద్యులు విమర్శిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్ని హక్కుగా అందించడం మంచిదే కానీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పర్చకుండా, ఉచిత వైద్య సేవల భారాన్ని తమపైన వేయడాన్ని వ్యతిరేకిస్తునట్టు ప్రైవేట్ వైద్యులు తెలిపారు. అయితే, ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గదని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రసాది లాల్ మీనా స్పష్టం చేశారు.  ప్రభుత్వం వెనక్కు తగ్గని పరిస్థితుల్లో ప్రైవేట్ వైద్యులు రాజస్థాన్ నుంచి వలస వెళ్లే పరిస్థితి ఎదురవుతుంది అని డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ హెచ్చరించడం దారుణమని, కార్పొరేట్ ఆసుపత్రుల లాభాలు తగ్గిపోతాయనే భయంతోనే ప్రైవేట్ వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఇటువంటి చట్టాలను, పథకాలనూ వ్యతిరేకిస్తున్నారని ఆరోగ్య కార్యకర్త,  జన స్వాస్థ్య అభియాన్‌‌‌‌కు చెందిన అమూల్య నిధి వంటి సామాజిక కార్యకర్తలు సైతం తీవ్రంగా విమర్శించారు. హెల్త్ కేర్‌‌‌‌ని హెల్త్ కేర్ బిజినెస్‌‌‌‌గా మార్చేశారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలను వారు వ్యతిరేకిస్తూనే ఉంటారని జన స్వాస్థ్య అభియాన్  నేషనల్ కో-కన్వీనర్ అమూల్య నిధి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చిరంజీవి యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య పథకాల కింద ఉచిత వైద్య సేవలకుగాను ప్రభుత్వాలు వైద్యులకు డబ్బు చెల్లింపులు చేస్తున్నాయని, కాబట్టి రీయింబర్స్‌‌‌‌మెంట్ అనేది సమస్య కాదని ఆమె తెలిపారు.

చట్టం  అమలెలా?

ఉచిత వైద్యసేవలను అమలు చేసే ప్రక్రియను మానిటర్ చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అధికారులను నియమించాలి. ఎవరైనా ఉచితంగా వైద్యం చేయడానికి నిరాకరిస్తే వారిపై ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదులని సదరు జిల్లా అధికారి నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఎలాంటి చర్యలు తీసుకున్నారో  నెల రోజుల్లోపు వెల్లడించాలి. అలా చేయకపోతే ఆ ఫిర్యాదు రాష్ట్ర స్థాయి అధికారికి చేరుతుంది. అయితే ఈ ప్రక్రియ వలన ప్రైవేట్ వైద్యులపై ఒత్తిడి పెరుగుతుందని, భయపడే పరిస్థితుల్లో వాళ్లు పని చేయాల్సి వస్తుందని దీనిని వ్యతిరేకిస్తున్నారు. వైద్యులపైన రాజకీయ నాయకుల ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని ప్రైవేట్ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నమోదైన ఫిర్యాదులను ఎవరు పరిశీలిస్తారు? వాటిని చూసేందుకు ఎవరెవరికి అనుమతి ఉంటుందనే దానిపైనా స్పష్టత లేదు. ఇది వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని మరి కొందరు అంటున్నారు. ఈ బిల్లు చట్టంగా రూపొందించి అమలు పొందితే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఈ దిశగా ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

వైద్యంపై రాజ్యాంగం చెబుతున్నదేంటీ

భారత రాజ్యాంగం ఒక పౌరుడి వైద్యానికి సంబంధించి కొన్ని అంశాలు స్పష్టం చేసింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అంటే అందరికీ స్వేచ్ఛగా బతికే హక్కుని కల్పిస్తోంది. ఆరోగ్య హక్కు కూడా దీని పరిధిలోకి వస్తుందని 1996లో సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను అందించే బాధ్యత ప్రభుత్వాలదేనని సర్వోన్నత న్యాయస్థానం ఆ తీర్పులో స్పష్టం చేసింది. బతికే హక్కు ఉండటమంటే కేవలం ఊపిరి పీల్చుకుంటూ గాలికి బతకడమనే కాదు. గౌరవంగా జీవించే హక్కు, జీవనోపాధిని కలిగి ఉండే హక్కు, ఆరోగ్య హక్కు ఇలా అన్నిటికీ దీని పరిధిని విస్తరించారు. ఇప్పటికే విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం అమల్లో ఉన్నాయి. కానీ, ఏ రాష్ట్రం కూడా ఆరోగ్య హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టలేదు. ఆ ప్రయత్నం మొదటిసారిగా రాజస్థాన్ ప్రభుత్వం చేసింది. అయితే ఇది రానున్న ఎన్నికల కోసం హడావుడిగా ఆమోదించిన బిల్లు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం తొందరపాటుతనంతో బిల్లుని చాలా బలహీనంగా మార్చారని కొందరు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

ఐఎంఎ ఆందోళన

ఇండియన్ మెడికల్ అసోసియేషన్, దాని అనుబంధ సంఘాలు, సంస్థలు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ఐఎంఎ పిలుపు మేరకు మార్చి 27న రాజస్థాన్ అంతటా ప్రైవేటు వైద్యులు బ్లాక్ డే పాటించారు.  వైద్య సేవలను నిలిపివేస్తూ ప్రైవేట్ వైద్యులంతా బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ‘‘ఇదొక క్రూరమైన చట్టం. ఈ బిల్లుని మేము సమర్థించలేం. ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి. మా డిమాండ్లను పట్టించుకోవాలి. ఈ బిల్లులో ఎమర్జెన్సీ సేవలంటే ఏంటో వివరించలేదు. రీయింబర్స్‌‌‌‌మెంట్ మాత్రమే కాదు ఇంకా అనేక సమస్యలను ప్రస్తావించలే దు’’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  వైద్యుల నిరసనలతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. లక్షల మంది ప్రజలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘’వైద్య సేవలకు అంతరాయం కలిగించాలనేది మా ఉద్దేశం కాదు. రోడ్లమీదకొచ్చి ఆందోళనలు చేయడం మాకూ ఇష్టం లేదు. కానీ వైద్య సేవలు అందిస్తున్న  వైద్యులను కూడా బతకనివ్వాలి కదా. మా మనుగడే కష్టమైతే ఇక సేవలు ఎలా అందిస్తాం? ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు. అలానే ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే మరో యాక్షన్ ప్లాన్‌‌‌‌తో ముందుకొస్తాం’’ అని ఐఎంఎ అధ్యక్షుడు శరద్​కుమార్ స్పష్టం చేశారు.

- మ‌‌‌‌న్నారం నాగ‌‌‌‌రాజు