Rinku Singh: రంజీల్లో దుమ్ములేపుతున్న రింకూ.. వరుస సెంచరీలతో హోరెత్తిస్తూ సెలక్టర్లకు సవాలు

Rinku Singh: రంజీల్లో దుమ్ములేపుతున్న రింకూ.. వరుస సెంచరీలతో హోరెత్తిస్తూ సెలక్టర్లకు సవాలు

టీమిండియా క్రికెటర్, టీ20 ఫినిషర్ రింకూ సింగ్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఓ రేంజ్ లో ఆడుతున్నాడు. తాను టీ20 స్పెషలిస్ట్ మాత్రమే కాదు టెస్టులు కూడా ఆడగలనని నిరూపిస్తునున్నాడు. ఒకటి రెండు ఇన్నింగ్స్ లు అయితే గాలివాటం అనుకోవచ్చు. కానీ రింకూ తన నిలకడతో సాధారణంగా ఆడుతున్నాడు. బుధవారం (నవంబర్ 19) తమిళ నాడుతో జరిగిన మ్యాచ్ లో 176 పరుగులు చేసి వరుసగా ఈ టోర్నీలో రెండో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకముందు రింకూ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఓవరాల్ గా ఇప్పటివరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లో 89,68,165*,176 పరుగులు చేసి టీమిండియా సెలక్టర్లకు ఛాలెంజ్ విసిరాడు. 

ప్రస్తుతం భారత టీ20 జట్టులో మాత్రమే కొనసాగుతున్న ఈ యూపీ కుర్రాడు టీమిండియా తరపున అన్ని ఫార్మాట్ లలో ఆడాలనే తన కోరికను గతంలో వెల్లడించాడు. తనపై వస్తున్న టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ ను తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. రింకూ ఇప్పటివరకు  51 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ల్లో 3500 పరుగులు చేశాడు. వీటిలో 24 అర్ధ సెంచరీలు, 9 సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 57 ఉండడం విశేషం. భవిష్యత్తులో ఇండియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాలనేది తన కల అని.. అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన రింకు ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. 

టెస్ట్ ఆశయాలు ఉన్నప్పటికీ, రింకు సుదీర్ఘ ఫార్మాట్ లో మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఈ యూపీ బ్యాటర్ సెప్టెంబర్ లో జరిగిన సెంట్రల్ జోన్ దులీప్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. ఇండియా ఏ జట్టులోనూ రింకూకు స్థానం దక్కట్లేదు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడుతున్న అతని ప్రదర్శనను సెలక్టర్లు పరిగణిస్తారో లేదో చూడాలి. తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్  విషయానికి వస్తే డ్రా గా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉత్తర ప్రదేశ్ 460 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తమిళనాడు కూడా బ్యాటింగ్ లో అద్భుతంగా ఆడి 455 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఉత్తర ప్రదేశ్ 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. నాలుగు రోజుల సమయం ముగియడంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రా గా ముగించారు.