ఇలాగే ఆడితే పంత్‌కు కష్టమే

ఇలాగే ఆడితే పంత్‌కు కష్టమే

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిష్టాత్మక ఫైనల్‌లో కోహ్లీ, పుజారా, పంత్ లాంటి స్టార్ ఆటగాళ్లు విఫలమవ్వడంపై అభిమానులతోపాటు సీనియర్ క్రికెటర్లూ ఫైర్ అవుతున్నారు. వెటరన్ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ కూడా భారత ప్రదర్శనపై నిరాశను వ్యక్తం చేశాడు. బ్యాట్స్‌మెన్ పెర్ఫామెన్స్‌పై గుస్సా అయిన గవాస్కర్.. ముఖ్యంగా పంత్ ఆటతీరు తనను తీవ్ర అసంతృప్తికి లోను చేసిందన్నాడు. బ్యాటింగ్‌లో పంత్ నిర్లక్ష్య వైఖరిని వదిలాలని సూచించాడు. 

‘నిర్లక్ష్యానికి, అజాగ్రత్తకు మధ్య ఓ సన్నటి గీత ఉంది. ఆ రేఖను పంత్ ఉల్లంఘించాడు. సెంచరీకి చేరువలో ఉన్నప్పుడు భారీ షాట్లకు వెళ్లి పంత్ పలుమార్లు శతకాలను మిస్ చేసుకున్నాడు. అతడు షాట్ సెలక్షన్‌లో తప్పులు చేస్తున్నాడు. చక్కటి డిఫెన్స్‌‌తోపాటు వైవిధ్యమైన షాట్లు కొట్టగల నైపుణ్యం పంత్‌కు ఉన్నప్పటికీ షాట్ సెలక్షన్‌లో మాత్రం తప్పులు చేస్తూనే ఉన్నాడు. దీన్ని అతడు అధిగమించాలి లేకపోతే భవిష్యత్‌లోనూ ఇబ్బందులు తప్పవు. పంత్ సానుకూల ధోరణిని కోల్పోకుండా ఉండాలి’ అని గవాస్కర్ సూచించాడు.